Share News

US Visa: అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:58 AM

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరుతో అమెరికా ఉద్యోగ కలలు కల్లలవుతున్నాయన్న నిరాశలో కూరుకుపోయిన భారత విద్యార్థులకు భారీ ఉపశమనం లభించింది....

US Visa: అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం

  • ఎఫ్‌-1 నుంచి హెచ్‌-1బీకి మారితే లక్ష డాలర్లు కట్టనక్కర్లేదు

  • తాజా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చిన అమెరికా ఇమిగ్రేషన్‌ విభాగం

  • జే-1, ఎల్‌-1 వారికీ మినహాయింపు

  • ఇప్పటికే హెచ్‌-1బీ వీసా ఉండి కంపెనీ మారే వారికీ వర్తించదు

  • ఇప్పటికే అక్కడ ఉన్నవారికే సౌలభ్యం

  • కొత్తగా వెళ్లేవారికి, పాత వీసాల గడువు.. ముగిసినవారికి మాత్రమే లక్ష డాలర్లు ఫీజు

  • ఉల్లంఘనలు ఉంటే లక్ష డాలర్లు కట్టక తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు

వాషింగ్టన్‌, అక్టోబరు 21: అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరుతో అమెరికా ఉద్యోగ కలలు కల్లలవుతున్నాయన్న నిరాశలో కూరుకుపోయిన భారత విద్యార్థులకు భారీ ఉపశమనం లభించింది. అమెరికాలో చదువుకునే విద్యార్థులు, ఇప్పటికే వివిధ ఉద్యోగాలు చేస్తున్నవారు హెచ్‌-1బీ వీసా కోసం లక్ష డాలర్లు కట్టాల్సిన అవసరం లేదని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎ్‌ససీఐఎస్‌) స్పష్టం చేసింది. ఇప్పటికే ఎఫ్‌-1, జే-1, ఎల్‌-1 తదితర వీసాలతో అమెరికాలో ఉంటున్న విదేశీయులు హెచ్‌-1బీకి మారాలనుకుంటే ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికా వెలుపల ఉండి కొత్తగా దరఖాస్తు చేసినా, కాన్సులర్‌ ప్రాసెసింగ్‌ కోరినా ఫీజు చెల్లింపు నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుత హెచ్‌-1బీ వీసాదారులు అమెరికాకు రాకపోకలు సాగించడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండబోవని వివరణ ఇచ్చింది.

యూఎ్‌ససీఐఎస్‌ మార్గదర్శకాలు ఇవీ..

  • ఎఫ్‌-1 వీసాపై ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్నవారు, చదువు పూర్తయి ఓపీటీ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌)పై ఉన్నవారు హెచ్‌-1బీ వీసా కోసం లక్ష డాలర్లు కట్టాల్సిన అవసరం లేదు.

  • హెచ్‌-1బీపై ఉద్యోగం చేస్తూ.. వీసా రెన్యువల్‌, సవరణ (కంపెనీ మార్పు) కోసం దరఖాస్తు చేసుకొనేవారికి ఫీజు మినహాయింపు ఉంటుంది.

  • ఎల్‌-1 (సంస్థల్లో అంతర్గత బదిలీలు), జే-1 (వైద్యులు, పరిశోధకులు, అధ్యాపకులు, ఇతర నిపుణులు) వీసాలపై ఉండే వారికీ హెచ్‌-1బీకి మారితే ఫీజు వర్తించదు. కానీ వాళ్లు రెండేళ్లపాటు స్వదేశానికి వెళ్లిరావాలనే (హోమ్‌ రెసిడెన్సీ) నిబంధన ఉంది. ఇందులో వైద్యులకు మాత్రం హోం రెసిడెన్సీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.


  • 2025 సెప్టెంబరు 21వ తేదీకి ముందే దాఖలైన, ఆమోదం పొందిన హెచ్‌-1బీ దరఖాస్తుదారులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి గతంలో ఉన్న నిబంధనలే అమలు చేస్తారు.

  • అమెరికా వెలుపలి నుంచి కొత్తగా హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసినా, కాన్సులర్‌ ప్రాసెసింగ్‌ కోరినా ఫీజు చెల్లింపు నిబంధన వర్తిస్తుంది.

  • ఇప్పటికే ఉన్నవారంతా దరఖాస్తు చేసుకోగానే.. ఫీజు మినహాయింపు ఉండదు. వీసా మార్పు (స్టేటస్‌), నివాస, ఉద్యోగ అర్హత గడువు పొడిగింపునకు సంబంధించిన దరఖాస్తుదారులు అందుకు అనర్హులని యూఎ్‌ససీఐఎస్‌ నిర్ధారిస్తే.. వారు హెచ్‌-1బీ వీసా కోసం లక్ష డాలర్లు ఫీజు చెల్లించాల్సిందే.

  • హెచ్‌-1బీ కోసం దరఖాస్తు చేసుకునే ముందే లక్ష డాలర్లను అమెరికా ట్రెజరీ పోర్టల్‌లో జమ చేసి, ఆ ఆధారాలను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. లేదా మినహాయింపు కేటగిరీలో ఉంటే సంబంధిత ఆధారాలను జత చేయాలి. లేకపోతే దరఖాస్తు ఆటోమేటిగ్గా తిరస్కరణకు గురవుతుంది. లక్ష డాలర్లు చెల్లించినవారి దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. సొమ్ము మొత్తం రీఫండ్‌ చేస్తారు.

  • అమెరికా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, సదరు ఉద్యోగానికి తగిన అర్హత కలిగిన అమెరికన్‌ ఉద్యోగి అందుబాటులో లేరని కంపెనీ యాజమాన్యం నిరూపించినప్పుడు, అసాధారణ పరిస్థితుల్లో ఫీజు మినహాయించేందుకు అవకాశం ఉంటుంది.

భారతీయ విద్యార్థులకు ప్రోత్సాహం

‘ఓపెన్‌ డోర్స్‌’ తాజా గణాంకాల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరానికి గాను 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని విద్యాసంస్థల్లో చేరారు. వీరిలో 97,556 మంది ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ టైనింగ్‌ (ఓపీటీ)లో నమోదయ్యారు. ఎఫ్‌-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12నెలల వరకూ పని చేయడానికి ఓపీటీ ప్రోగ్రామ్‌ అనుమతిస్తుంది. స్టెమ్‌ (ఎస్‌టీఈఎం) గ్రాడ్యుయేట్లు ఈ వ్యవధిని అదనంగా మరో 24 నెలలు పొడిగించుకోవడం ద్వారా మూడేళ్ల వరకూ అమెరికాలో ఉండి పని అనుభవం పొందే అవకాశం ఉంది. అమెరికాలో ఉండే అనేక సంస్థల యజమానులు ఇటువంటి విద్యార్థులకు హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఇప్పుడు వీరందరికీ ఫీజు మినహాయింపు లభించనుంది.


చిన్న ఉల్లంఘన ఉన్నా లక్ష డాలర్లు కట్టాల్సిందే

ఎఫ్‌-1 వీసాలపై చదివే విద్యార్థులు ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారి వీసా మార్పు తిరస్కరణకు గురవుతుంది. ఉదాహరణకు చదువుకునే సమయంలో అనధికారికంగా ఎక్కడైనా ఉద్యోగం చేసినా ప్రభావం పడుతుంది. సదరు విద్యార్థికి హెచ్‌-1బీ వీసా వచ్చి ఉద్యోగం చేరిన తర్వాత అయినా సరే.. ఎఫ్‌-1 వీసా సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్టు రుజువైతే లక్ష డాలర్లు కట్టాల్సి ఉంటుందని ఇమిగ్రేషన్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు హెచ్‌-1బీ వీసా కేటాయింపుల్లో వేతనాల స్థాయిని ప్రామాణికంగా తీసుకోవాలనే ప్రతిపాదననుగానీ అమల్లోకి తెస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 22 , 2025 | 05:58 AM