Embassy Warning: వీసా వచ్చినా అమెరికాలో గ్యారెంటీ ఏమీ లేదు
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:01 AM
అమెరికా వీసాలు పొందిన వారికి, దరఖాస్తుదారులకు ఇక్కడి ఆ దేశ రాయబార కార్యాలయం కఠిన సూచనలు చేసింది.

రూల్స్ ఉల్లంఘిస్తే వెనక్కి పంపే ముప్పు.. ఎంబసీ స్పష్టం
న్యూఢిల్లీ, జూలై 14: అమెరికా వీసాలు పొందిన వారికి, దరఖాస్తుదారులకు ఇక్కడి ఆ దేశ రాయబార కార్యాలయం కఠిన సూచనలు చేసింది. వీసా వస్తే అంతా ముగిసినట్టు కాదని, అనంతరం కూడా నిరంతర తనిఖీలు ఉంటాయని స్పష్టం చేసింది. వీసాపై అమెరికా వెళ్లిన వారిని అక్కడి అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుంటారని తెలిపింది. అమెరికా చట్టాలు, వీసా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా, లేదా అన్నదాన్ని గమనిస్తుంటారని, ఒకవేళ ఉల్లంఘించినట్టు తేలితే వెంటనే తప్పి పంపించివేస్తారని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. వీసా లభించినంత మాత్రాన అమెరికాలో శాశ్వత ప్రవేశానికి, శాశ్వత నివాసానికి గ్యారెంటీ లభించినట్టు కాదని విద్యార్థులు, ఉద్యోగార్థులకు స్పష్టం చేసింది. దరఖాస్తుల్లో తప్పుడు వివరాలు పేర్కొన్నా, తగిన అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేసినా వీసాలు రద్దు చేసి, తిప్పి పంపిస్తారని వివరించింది. డీఎస్-160 వీసా దరఖాస్తులో గత అయిదేళ్లలో ఉపయోగించిన అన్ని సామాజిక మాధ్యమాల యాజర్‌నేమ్‌లను రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఎఫ్, ఎం, జె నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసిన వారు తమ సామాజిక మాధ్యమాల అకౌంట్ల ప్రైవసీ సెట్టింగ్‌లను పబ్లిక్‌కు మార్చాలని సూచించింది. వాటిని పరిశీలించిన తరువాత వారిని దేశంలోకి రానీయవచ్చా, లేదా అని అమెరికాలోని అధికారులు నిర్ణయం తీసుకుంటారు.