Japan PM Takaichi: జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారి జీతాల్లో కోత.!
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:48 PM
జపాన్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సనాయె తకాయిచి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ దేశంలో తనతో సహా క్యాబినెట్ సభ్యులకు అదనపు జీతాలు చెల్లించకూడదని నిర్ణయం తీస్కున్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో నూతన అధ్యాయానికి తెరలేపారు ఆ దేశ ప్రధాని సనాయె తకాయిచి(Japan PM Sanae Takaichi). ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేదిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు పార్లమెంట్‌లోని క్యాబినెట్ సభ్యులందరికీ(Cabinet Members) చెల్లించే అదనపు భత్యాలపై ఇకపై కోత విధిస్తున్నట్టు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు (Public Servant Remuneration Law to Implement) స్థానిక మీడియా వెల్లడించింది. దీనిపై మంగళవారం ఆ దేశంలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు నివేదించింది.
మంత్రుల జీతాలను తగ్గించాలని ఎంతో కాలంగా వాదిస్తున్న తకాయిచి.. అక్టోబర్‌లో జరిగిన తన ప్రారంభ సమావేశంలోనే ఈ విషయం పట్ల ఆమె వైఖరిని స్పష్టం చేశారు. క్యాబినెట్ సభ్యులకు జీతాలకు మించి అదనపు భత్యాలు చెల్లించకుండా ఉండేందుకు చట్టసవరణ తీసుకొచ్చేందుకు తాను పనిచేస్తానని నాడు ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం జీతభత్య వివరాలిలా..
జపాన్‌లో పరిపాలనా సౌలభ్యత, ఆర్థిక సంస్కరణల పట్ల నిబద్ధతను ప్రదర్శించడంలో భాగంగానే తకాయిచి చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో ఇదొక చర్య. ప్రస్తుతం, అక్కడ ఒక్కో చట్టసభ సభ్యునికీ(Lawmakers) నెల జీతం 1.294 మిలియన్ యెన్‌లు ఉండగా.. ప్రధాని అదనంగా 1.152 మిలయన్ యెన్‌లు పొందుతున్నారు. క్యాబినెట్ మంత్రులకు 4,89,000 యెన్‌లు భత్యంగా చెల్లిస్తున్నారు. అయితే.. ఖర్చు తగ్గింపు చర్యలలో భాగంగా.. ప్రధానమంత్రి అదనపు వేతనం నుంచి 30 శాతం, మంత్రులు 20 శాతం చొప్పున తిరిగి ఇస్తున్నారని ఆ దేశ క్యాబినెట్ ప్రధాన కార్యదర్శి మినోరు కిహారా ధృవీకరించారు. ఫలితంగా ప్రధాని 3,90,000 యెన్‌లు; మంత్రులు ఒక్కొక్కరు 1,10,000 యెన్‌ల చొప్పున పుచ్చుకుంటున్నారన్నారు.
నూతన ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(Liberal Democratic Party) కొత్త సంకీర్ణ భాగస్వామి అయిన జపాన్ ఇన్నోవేషన్ పార్టీ(Japan Innovation Party) స్వాగతించింది. దీంతో పాటు చట్టసభ సభ్యులకు ఉండే ప్రత్యేక అధికారాలను తగ్గించాలని కూడా పిలుపునిచ్చింది.
అయితే.. ఈ ప్రతిపాదనపై కొంతమేర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని 'ఎ సింబల్ ఆఫ్ ది డిఫ్లేషనరీ మైండ్‌సెట్' అని డెమోక్రటిక్ పార్టీ ఫర్ ది పీపుల్(Democratic Party for the People) అధ్యక్షుడు యూచిరో తమాకీ విమర్శించారు. గృహ ఆదాయాలను పెంచేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
MP Sivanath: ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: ఎంపీ శివనాథ్
Unitree G1 Robot: పనిచేస్తుండగా నేలకూలిన రోబో.. వీడియో వైరల్