ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం!
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:27 AM
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని అమెరికా-భారత్‌లు గుర్తించాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. గత నెల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో.. ఈ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.

ఆ ప్రాధాన్యాన్ని అమెరికా-భారత్ గుర్తించాయి
ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి
ట్రంప్ నేతృత్వంలో బహుళధ్రువ ప్రపంచంవైపు
అమెరికా.. ఇది భారత్‌కు అనుకూల పరిణామమే
బ్రిటన్‌లో విదేశాంగమంత్రి జైశంకర్
మంత్రి వాహనం మీదికి దూసుకొచ్చిన ఖలిస్థానీ
వసతులు ఊరికేరావు.. పన్నులకు కారణాలున్నయ్
భారత ఎగుమతిదార్ల ప్రయోజనాలు కాపాడతాం
చర్చల కోసమే గోయల్ అమెరికాకు: నిర్మల
లండన్, మార్చి 6: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని అమెరికా-భారత్‌లు గుర్తించాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. గత నెల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో.. ఈ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం ఈ అంశంపైనే అమెరికా పర్యటనలో ఉన్నారని చెప్పారు. బుధవారం లండన్‌లో ఛాతమ్‌హౌస్ మేధోసంస్థ ‘భారత్ ఉత్థానం.. ప్రపంచంలో పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చలో జైశంకర్ ప్రసంగించారు. ట్రంప్ సారథ్యంలో అమెరికా బహుళ ధ్రువ ప్రపంచంవైపు అడుగులు వేస్తోందని, అది భారత్‌కు మంచిదేనన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బలంగా ముందుకు తీసుకొస్తున్న సుంకాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. దానిపై ఇరుదేశాలూ మన సు విప్పి మాట్లాడుకున్నాయని, దాని ఫలితంగానే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని ఆమోదించాయన్నారు.
మరోవైపు, ‘భారత్-బ్రిటన్ స్వేచ్ఛాయు త వాణిజ్య ఒప్పందం’ దిశగా కసరత్తు జరుగుతోందని, అయితే, అది కొన్ని సంక్లిష్టతలతో కూడుకొని ఉన్నందున దాని సాకారానికి కొంత సమయం పడుతుందని జైశంకర్ వెల్లడించారు. చైనాతో భారత్‌కు ఉన్న సంబంధాల గురించి ప్రస్తావిస్తూ.. ‘ప్రపంచం లో 200 కోట్లకుపైగా జనాభా ఉన్న దేశాలు చైనా, భారత్. మా ప్రయోజనాలకు, అభిప్రాయాలకు గౌర వం దక్కే విధంగా చైనాతో సంబంధాలు ఉండాలని మేం కోరుకుంటున్నాం. టిబెట్‌లో ఉన్న కైలాస పర్వ త తీర్థయాత్రకు చైనా అనుమతించటం ఒక మంచి పరిణామం’ అని తెలిపారు. కశ్మీర్ అంశంపై ఓ సభికుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్ అభివృద్ధికి ఇప్పటికే దారులు పరిచామని తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూ భాగం తిరిగి భారత్‌లో చేరినప్పుడే కశ్మీర్ సమస్య సంపూర్ణంగా పరిష్కారం అవుతుందన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. ఆ రెండు దేశాలతోనూ భారత్ సంప్రదింపులు జరుపుతున్నదని.. తన అవసరం ఉన్నదని భావించిన ప్రతి సందర్భంలోనూ భారత్ ముందుకొస్తోందని చెప్పారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన క్వాడ్ కూటమి మంచి పురోగతి సాధిస్తోందని, కూటమిలో ఉన్న సభ్యదేశాలందరికీ తగిన ప్రాతినిధ్యం దక్కుతోందన్నారు. జైశంకర్ ప్రస్తుతం బ్రిటన్, ఐర్లండ్‌లలో ఆరు దేశాల పర్యటనలో ఉన్నారు.
ఖలిస్థానీల దాడి యత్నం
ఛాతమ్‌హౌ్‌సలో జైశంకర్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఛాతమ్‌హౌస్ నుంచి జైశంకర్ వెళ్లిపోతుండగా.. ఆయనను ఎగతాళి చేస్తూ భారత వ్యతిరేక నినాదాలు చేశారు. వారిలోంచి ఓ వ్యక్తి భారత్ జెండాను చింపివేసి, జైశంకర్ వాహనంవైపు దూసుకురావటానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. విదేశాంగమంత్రి భద్రతనే ఉల్లంఘించిన ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై బ్రిటన్ గట్టి చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో, బ్రిటన్ ఒక ప్రకటన జారీ చేస్తూ.. ప్రజాభద్రతను ఉల్లంఘించే, బెదిరించే ఈ తరహా ఘటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. విదేశాల ప్రతినిధులకు పూర్తి భద్రత కల్పిస్తామని పేర్కొంది.