UN Security Council Debate: ఐరాసలో ఇండస్ ఒప్పందంపై భారత్-పాక్ మధ్య తీవ్ర వాదనలు
ABN , Publish Date - Jul 23 , 2025 | 10:28 AM
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి వాడివేడి వాదనలు కొనసాగాయి. కాశ్మీర్ అంశంపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అస్పష్టత, ఇండస్ నీటి ఒప్పందంపై చర్చలు క్రమంగా తీవ్ర విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) భారత్ తీరు గురించి చెప్పి రచ్చ చేయాలని చూసిన పాకిస్తాన్‌కు మళ్లీ భారత్ నుంచి గట్టి కౌంటర్ ఎదురైంది. UNSCలో భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి హాట్ హాట్ చర్చ కొనసాగిన క్రమంలో.. కాశ్మీర్, ఇండస్ నీటి ఒప్పందం (Indus Waters Treaty) అంశాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ డార్, కాశ్మీర్‌ను అంతర్జాతీయంగా గుర్తించబడిన వివాదాస్పద ప్రాంతంగా పేర్కొన్నారు. దీంతోపాటు భారత్ ఇటీవల ఇండస్ నీటి ఒప్పందంపై తీసుకున్న చర్యలను అన్యాయమైనవని విమర్శించారు. ఆ క్రమంలో కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
పాకిస్తాన్ వాదనలను..
భారత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. భారత్ తరపున ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పి. హరీష్, పాకిస్తాన్ వాదనలను బలంగా తిప్పికొట్టారు. భారత్ ఒక పరిపక్వ ప్రజాస్వామ్య దేశం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సమ్మిళిత సమాజం కలిగి ఉందని ఆయన వివరించారు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం మతోన్మాదం, ఉగ్రవాదంలో కూరుకుపోయి, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి పదేపదే అప్పులు తీసుకునే దేశంగా ఉందని ఆయన విమర్శించారు.
ఉగ్రవాదంపై భారత్ గట్టి వైఖరి
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాంతి, భద్రత అంశాలను చర్చిస్తున్న సమయంలో, ఉగ్రవాదంపై ఎటువంటి సహనం అవసరం లేదనే సూత్రాన్ని అందరూ పాటించాలని హరీష్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పద్ధతుల్లో పాల్గొని, అంతర్జాతీయ సమాజం ఆమోదించని చర్యలకు చేపడుతూ, శాంతి గురించి పాకిస్తాన్ ఉప దేశాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎప్పటినుంచో ప్రోత్సహించిన చరిత్రను ఆయన మరోసారి ప్రస్తావించారు.
కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం
కాశ్మీర్ అనేది భారత్‌లో అంతర్భాగమని, దాని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే ఏ ప్రయత్నమైనా ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. ఇండస్ నీటి ఒప్పందం విషయంలో కూడా, ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందమన్నారు. పాకిస్తాన్ తన వైపు నుంచి ఒప్పంద ఉల్లంఘనలను సరి చేసుకోకుండా దీనిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావడం సరికాదని భారత్ తేల్చి చెప్పింది.
పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలం
పాకిస్తాన్ గతంలో కూడా కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడానికి ప్రయత్నించింది. అయితే, ఈ ప్రయత్నాలు ఎక్కువగా విఫలమయ్యాయి. చాలా దేశాలు కాశ్మీర్ సమస్యను భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక అంశంగా గుర్తిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో ఈ విషయంలో పాకిస్తాన్‌కు పెద్దగా సపోర్ట్ లభించడం లేదు.
ఇవి కూడా చదవండి
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణీకులు ఏం చేయాలంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి