US Visa Crisis: ట్రంప్ దెబ్బ మరింత తీవ్రం
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:44 AM
అమెరికాలో వీసా రద్దు బాధితుల్లో 50% మంది భారతీయ విద్యార్థులే. చిన్న తప్పులకే సెవిస్ రికార్డులు, వీసాలు రద్దవుతుండటంతో వారు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు.

భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు
అమెరికాలో చిన్న నేరాలకే దేశ బహిష్కరణ ముప్పు
వీసా రద్దు బాధితుల్లో 50% మనవాళ్లే
అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడి
14 శాతంతో తర్వాతి స్థానంలో చైనా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: అమెరికాలో భారతీయ విద్యార్థుల కష్టాలు తీవ్రస్థాయికి చేరాయి. వీసా రద్దు బాధితుల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంటోంది. ఈ ఏడాది జనవరి 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు 4,736 సెవిస్(ది స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టం) రికార్డులను అమెరికా ఐసీఈ(ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) విభాగం రద్దు చేయగా, 300కుపైగా విద్యార్థి వీసాలను అమెరికా విదేశాంగశాఖ రద్దు చేసింది. ఈ బాధితుల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉన్నట్టు ఐలా(ది అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్) విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే, రద్దయిన సెవిస్ రికార్డుల్లో అత్యధికం ఎఫ్-1(విదేశీ విద్యార్థి)లకు సంబంధించినవే. సెవిప్(స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్) సర్టిఫైడ్ స్కూళ్లు, ఎఫ్-1, ఎం-1 విద్యార్థుల సమాచార నిర్వహణ కోసం అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఉపయోగించే వెబ్ ఆధారిత వ్యవస్థే సెవిస్. అలాగే, ఎఫ్-1 హోదా విద్యార్థి అంటే అమెరికాలోని ఏదైనా సెవిప్ సర్టిఫైడ్ స్కూల్లో విద్యను అభ్యసించేందుకు అధికారికంగా ఆమోదం లభించిన విదేశీ విద్యార్థి. వీసా రద్దు, సెవిస్ రికార్డుల రద్దుకు సంబంధించి అమెరికా వ్యాప్తంగా 327 నివేదికలను అటార్నీలు, విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది నుంచి తాము సేకరించగా, అందులో 50ు బాధితులు భారతీయ విద్యార్థులేనని ఐలా తెలిపింది.
ఆ తర్వాతి స్థానంలో చైనా విద్యార్థులు(14%) ఉన్నారని, బాధితుల్లో దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు కూడా ఉన్నారని పేర్కొంది. ఐలా సేకరించిన సమాచారం మేరకు బాధిత విద్యార్థుల్లో 50 శాతం మంది ఓపీటీ(ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)వారే. వీరంతా విద్యాభ్యాసం పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని అర్థం. బాధితుల్లో 57 శాతం మంది విద్యార్థులకు వీసా రద్దు నోటీసులను అమెరికా కాన్సులేట్లు ఈమెయిల్ ద్వారా పంపగా, వారిలో ఇద్దరికి మాత్రమే రాజకీయ ఆందోళనల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. అలాగే, సెవిస్ రికార్డుల రద్దు నోటీసులను 83 శాతం బాధితులు తమ యూనివర్సిటీల నుంచి పొందగా, 14 శాతం మంది నేరుగా ఐసీఈ నుంచి పొందారు. బాధితుల్లో 7 శాతం మందికి అసలు నోటీసులు ఇవ్వకుండానే రికార్డులను రద్దు చేసేశారు. ఏవిధమైన పోలీసు చర్యలు, నేర చరిత్ర లేకుండానే సెవిస్ రికార్డులు రద్దయిన కేసులు కనీసం 17 ఉన్నాయని ఐలా తెలిపింది. బాధిత విద్యార్థుల్లో 86 శాతం మందికి నేరచరిత్ర ఉన్నప్పటికీ వారిలో 33 శాతం మందిపై కేసులను కోర్టులు కొట్టివేశాయని పేర్కొంది.
Read Also: Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీని చంపేసిన భార్య
SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..
China Hydrogen Bomb: చైనా సరికొత్త హైడ్రోజన్ బాంబు