Share News

Elan Musk: నా పోస్టులు చాలా దూరం వెళ్లాయి.. ట్రంప్‌తో గొడవలపై మస్క్ పశ్చాత్తాపం

ABN , Publish Date - Jun 11 , 2025 | 03:09 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య తలెత్తిన గొడవలు ఇక ఇద్దరి మధ్యా సంధి కుదరడం కష్టం కావచ్చనేంత వరకూ వెళ్లాయి. మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే ఈ ఉహాగానాలకు మస్క్ చెక్ పెట్టారు.

Elan Musk: నా పోస్టులు చాలా దూరం వెళ్లాయి.. ట్రంప్‌తో గొడవలపై మస్క్ పశ్చాత్తాపం
Elan Musk with Donald Trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trumph), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elan Musk) మధ్య తలెత్తిన గొడవలు ఇక ఇద్దరి మధ్యా సంధి కుదరడం కష్టం కావచ్చనేంత వరకూ వెళ్లాయి. మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. మస్క్‌పై చర్యలు తప్పవనే ధోరణిలో ట్రంప్ హెచ్చరికల వరకూ పరిస్థితి వెళ్లింది. ఇలాంటి సమయంలో ట్రంప్‌పై సోషల్ మీడియా పోస్టుల్లో తాను చేసిన ఆరోపణలపై మస్క్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా పోస్టులు చాలా దూరం వెళ్లాయంటూ విచారం వ్యక్తం చేశారు. ''అధ్యక్షుడు ట్రంప్‌పై గత వారంలో నేను పెట్టిన కొన్ని పోస్టులపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. ఇవి చాలా దూరం వెళ్లాయి'' అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మస్క్ పోస్ట్ చేశారు.


గొడవ ఎలా మొదలైంది?

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించిన 'బిగ్ బ్యూటీఫుల్' బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ బిల్లును మస్క్ వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. కొత్త బిల్లు ఫెడరల్ లోటును మరింత తీవ్రతరం చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టగలదని మస్క్ హెచ్చరించారు. అలాగే తన మద్దతు లేకుంటే 2024 ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు గెలిచేవారు కారని మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ట్రంప్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. మస్క్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమ విజయానికి మస్క్ అవసరమే లేదన్నారు.


రిపబ్లికన్ లేజిస్లేచర్లకు వ్యతిరేకంగా డెమొక్రాట్లకు మస్క్ ఫండింగ్ చేయనున్నట్టు వార్తలు రావడంతో ట్రంప్ మరింత తీవ్రంగా స్పందించారు. ఇదే జరిగితే మస్క్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. మస్క్‌తో మాట్లాడే ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు.


కాగా, ప్రభుత్వ వృథాను తగ్గించడంలో ఫెడరల్ అడ్వయిజరీ అయిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ) హెడ్‌గా మస్క్ పాత్రను ట్రంప్ గత వారంలో బహిరంగంగానే ప్రశంసించారు. అయితే ప్రభుత్వ ఖర్చుల ప్రాధాన్యతలపై అసంతృప్తితో ఉన్న మస్క్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

Pakistan: ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు..

LA Protests: రగులుతున్న లాస్ ఏంజెల్స్.. 2 వేల మంది గార్డ్స్‌తో..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 04:18 PM