Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూనేత భబేశ్ చంద్ర హత్య
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:31 AM
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మైనారిటీ నాయకుడు భబేశ్ చంద్ర రాయ్(58) హత్యకు గురయ్యారు. దీంతో ఆ దేశంలోని యూనుస్ పాలనపై భారత్ తీవ్రంగా ధ్వజమెత్తింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మైనారిటీ నాయకుడు భబేశ్ చంద్ర రాయ్(58) హత్యకు గురయ్యారు. దీంతో ఆ దేశంలోని యూనుస్ పాలనపై భారత్ తీవ్రంగా ధ్వజమెత్తింది. మైనారిటీ ప్రజలకు రక్షణ కల్పించడంలో బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. ‘ఈ ఘటనను మేం ఖండిస్తున్నాం. సాకులు చెప్పకుండా, భేదభావం లేకుండా హిందువులు సహా మైనారిటీలందరినీ రక్షించే బాధ్యతను తాత్కాలిక ప్రభుత్వానికి మరోసారి గుర్తుచేస్తున్నాం’ అంటూ కఠిన పదాలతో విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది.
దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన చంద్ర రాయ్‌కు బుధవారం సాయంత్రం 4.30గంటలకు తెలిసిన వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అనంతరం నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై ఆయన ఇంటికి వచ్చారు. వారు ఆయనను కిడ్నాప్ చేసి సమీపంలోని నరబరి గ్రామానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంటికి చేరుకున్న చంద్రరాయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.