Share News

Health: మారిన జీవనశైలితో.. మెదడుకు ముప్పు

ABN , Publish Date - Oct 29 , 2025 | 10:07 AM

మానవ జీవనశైలి వేగంగా మారిపోతోంది. తినే సమయాలు మారిపోయాయి, పడుకునే వేళలు పాటించడం లేదు. ఉదయం ఆఫీసుకు వెళ్లితే రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ వంటి ఆహారం తీసుకోవడం.. టెన్షన్స్‌, ఆందోళన వంటివి పెరిగిపోవడం జరుగుతోంది.

Health: మారిన జీవనశైలితో.. మెదడుకు ముప్పు

- చిన్న లక్షణాలపై నిర్లక్ష్యం

- ధూమపానం, ఆల్కహాల్‌, రక్తపోటు ప్రబావం

- దెబ్బతీస్తున్న మధుమేహం

- నేడు వరల్డ్‌ స్ర్ట్రోక్‌ డే

హైదరాబాద్‌ సిటీ: మానవ జీవనశైలి వేగంగా మారిపోతోంది. తినే సమయాలు మారిపోయాయి, పడుకునే వేళలు పాటించడం లేదు. ఉదయం ఆఫీసుకు వెళ్లితే రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ వంటి ఆహారం తీసుకోవడం.. టెన్షన్స్‌, ఆందోళన వంటివి పెరిగిపోవడం జరుగుతోంది. ఇవి కాస్తా బ్రెయిన్‌ స్ర్టోక్‌ వంటి జబ్బులకు దారి తీస్తున్నాయి. అయితే వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రులకు పరుగులు తీస్తుండడంతో కోలుకోవడానికి చాలాకాలం పడుతుంది.


రోజూ 20మందికి బ్రెయిన్‌స్ట్రోక్‌

ప్రతీరోజు గ్రేటర్‌ పరిధిలో 20మంది వరకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి న్యూరాలజిస్టు వద్దకు కనీసం ఇద్దరు, ముగ్గురు ఈ సమస్యతో వస్తున్నారు. 20నుంచి 30 ఏళ్ల వయస్సు వచ్చే సరికి చాలామంది బీపీ, మధుమేహం, అధికబరువు, కొలస్ట్రాల్‌ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిని నియంత్రించుకోకపోతే ఇవి కాస్తా ఇతర జబ్బులకు దారి తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


స్మోకింగ్‌, ఆల్కహాల్‌తో..

సాధారణంగా 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసు ఉన్న వారిలో దాదాపు 40 శాతం పొగతాగే వారే ఉన్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వయస్సులో స్మోకింగ్‌ చేసేవారికి పదేళ్లు గడిచేసరికి బ్రెయిన్‌స్ట్రోక్‌ లక్షణాలు బయటపడుతున్నాయి. స్మోకింగ్‌ వల్ల రక్తనాళాలు పూడుకుపోయి సన్నగా మారి రక్తం సరఫరాకు అవరోధంగా మారుతున్నాయి. చైన్‌స్మోకర్స్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. మద్యం, పొగతాగే వారిలోనూ 70నుంచి 80శాతం వరకు బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చే ఆస్కారముంది. గుండెజబ్బులు, అధిక బరువు, కొలస్ట్రాల్‌, హైపర్‌టెన్షన్‌, మధుమేహం కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు దారి తీస్తాయని డాక్టర్‌ పద్మ వీరపనేని వివరించారు. హైపర్‌టెన్షన్‌ ఉన్న వారికి ఒత్తిడి ఎక్కువైతే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.


city6.2.jpg

నిశ్శబ్ద స్ట్రోక్‌లు ముప్పే

నిశ్శబ్దంగా వచ్చే స్ట్రోక్‌లు కూడా ప్రమాదమే. చాలాసార్లు చిన్నచిన్న రక్తగడ్డల వల్ల నిశ్శబ్దంగా స్ట్రోకులు వస్తాయి. వీటివల్ల కాలక్రమంలో జ్ఞాపకశక్తి తగ్గడం, నెమ్మదిగా కదలికలు, తలనొప్పి తిమ్మిరి లేదా నడకలో అసమతుల్యత వంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. స్ట్రోక్‌ వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కరోటిడ్‌ డాప్లర్‌ స్కాన్‌ వంటి ఆధునిక పరీక్షల ద్వారా రక్తనాళాల్లో కొలస్ట్రాల్‌ పేరుకుపోవడం ముందుగానే గుర్తించవచ్చు.

- డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌, న్యూరాలజిస్టు, గురునానక్‌ కేర్‌ ఆస్పత్రి


ఏడాదికి 18 లక్షల కొత్త కేసులు

2024-2025 గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రతి ఏటా 18లక్షలకుపైగా కొత్త బ్రెయిన్‌స్ట్రోక్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రతిలక్ష మందిలో 172 వరకు కేసులు వస్తున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం.. గత రెండు దశాబ్దాల్లో 20 నుంచి 64 ఏళ్ల వయస్సు గల వారిలో 25 శాతం వరకు కేసులు పెరిగాయి. ఒక క్షణంలో లక్షల మెదడు కణాలు నశిస్తాయి. వ్యాయామం, సరైన ఆహారం, ఒత్తిడి నియంత్రణ ద్వారా స్ట్రోక్‌ను నివారించవచ్చు. ఆకస్మిక అవయవాల బలహీనత, ముఖం వాలిపోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, అసమతుల్యత, వాంతులు లేదా ఆకస్మిక స్పృహ కోల్పోవడం కనిపిస్తే అప్రమత్తత అవసరం.

- డాక్టర్‌ నిహారిక మథుకుమల్లి, న్యూరాలజిస్టు, స్టార్‌ ఆస్పత్రి


city6.3.jfif

నివారణ మన చేతుల్లోనే

ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంచడం, వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానం నుంచి దూరంగా ఉండడం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌నుంచి బయటపడవచ్చు. లక్షణాలు కనిపించిన నాలుగున్నర గంటల్లో ఆస్పత్రికి చేరిస్తే చికిత్సతో ముప్పు నుంచి తప్పించే అవకాశముంది. మూతి వంకరపోతున్నట్లు, చెయ్యి తిమ్మిరి వచ్చినట్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

- డాక్టర్‌ బి.రోహిత్‌ కుమార్‌, న్యూరాలజీస్టు, మల్లారెడ్డి నారాయణ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో భారీగా తగ్గుదల

భయపెడుతున్న మొంథా తుఫాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 29 , 2025 | 10:07 AM