World Diabetes Day: షుగర్ తక్కువేయండి!
ABN , Publish Date - Nov 14 , 2025 | 09:31 AM
మధుమేహంతో ప్రాణానికి ముప్పుకాకపోయినా జీవన విధానానికి ఆటంకం కలిగిస్తుంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒతిళ్లు మధుమేహ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. ప్రధానంగా దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు.
- పెరుగుతున్న మధుమేహ బాధితులు
- పదేళ్లలో రెట్టింపయిన సంఖ్య
- యువతపైనా ప్రభావం ..
నేడు వరల్డ్ డయాబెటిస్ డే
హైదరాబాద్ సిటీ: మధుమేహంతో ప్రాణానికి ముప్పుకాకపోయినా జీవన విధానానికి ఆటంకం కలిగిస్తుంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒతిళ్లు మధుమేహ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. ప్రధానంగా దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారని పేర్కొంటున్నారు. ప్రదానంగా కార్పొరేట్ ఉద్యోగం చేసే వారికి డయాబెటిస్ శాపంగా మారింది. గంటల కొద్దీ కుర్చీలో నుంచి కదలకుండా పనులు చేసేవారికి షుగర్ వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంది. నవంబర్ 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
గ్రేటర్‌లో 13 నుంచి 26 శాతానికి..
గ్రేటర్ హైదరాబాద్‌లో డయాబెటిక్ బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం నిర్వహించిన ఓ సర్వే ప్రకారం హైదరాబాద్‌లో 13 శాతం ఉండగా ప్రస్తుతం అది 26 శాతం వరకు పెరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు. మధుమేహంతో బాధపడే గర్భిణుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిలోఫర్, పెట్లబుర్జు, సుల్తాన్‌బజార్ ఆస్పత్రుల్లో రోజూ 80 నుంచి 100 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. వారిలో 10 నుంచి 15 మంది డయోబెటిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నగరంలో దాదాపు 60 వేల మంది పిల్లలు మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లలు, యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం, అధిక బరువును పెంచుకోవడం వల్ల మధుమేహ వ్యాధి బారిన పడుతున్నట్లు చెప్పారు.
యువతలో పెరుగుదల
యువతలో మధుమేహం పెరుగుతోంది. 2025లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం 40 ఏళ్ల లోపు వయస్సు గల వ్యక్తుల్లో 17.2 శాతం మందికి టైప్-2 మధుమేహం ఉందని తేలింది. 36-40 సంవత్సరాల వయసు గల వారిలో అత్యధికంగా కనిపిస్తోంది. మధుమేహం నిర్ధారణ అయితే జాగ్రత్తలపై దృష్టి సారించాలి. ఆహారపు అలవాట్లు మార్చాలి. వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ ఉండాలి.
- డాక్టర్ కృష్ణారెడ్డి తాడూరి, ఎండోక్రినాలజిస్ట్, కిమ్స్

ఈ లక్షణాలు ఉంటే..
అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన, ఆకస్మిక బరువు తగ్గడం, అలసట, దృష్టి మసకబారడం వంటివి సాధారణ హెచ్చరిక సంకేతాలు. ఫాస్టింగ్ గ్లూకోజ్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ వంటి సాధారణ రక్త పరీక్షల ద్వారా డయాబెటి్‌సను నిర్ధారించవచ్చు. డయాబెటి్‌సను నయం చేయలేకపోయినా, జీవనశైలి మార్పుల ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చు. వైద్యుడు సూచించిన మందులను వాడాలి.
- డాక్టర్ బి. పద్మనాభ వర్మ, ఎండోక్రినాలజిస్టు, శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రి
ఆధునిక జీవనశైలి మార్పులే
టైప్ 1 డయాబెటిస్ తరచుగా బాల్యంలో లేదా కౌమార దశలో కనిపిస్తుంది. దీనికి జీవితాంతం ఇన్సులిన్ థెరపీ, పర్యవేక్షణ అవసరం. టైప్ 2 డయాబెటిస్ అత్యంత సాధారణ రకం. ఇది ఇన్సులిన్ నిరోధకత, సరైన ఆహారం లేకపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వంటి జీవనశైలి వల్ల వస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటి్‌సతో తల్లికి, బిడ్డకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. ముందస్తు స్ర్కీనింగ్, ఆహార నిర్వహణ చాలా అవసరం.
- డాక్టర్ నిత్య చంద్ర, సీనియర్ జనరల్ మెడిసిన్,
మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి
ముప్పు నాలుగు రెట్లు అధికం
మధుమేహం నియంత్రణలో లేకపోతే అది నిశ్శబ్దంగా శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు ఇరుకుగా మారి గుండెపోటు వచ్చే ముప్పు రెండు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంది. మూత్రపిండాల వైఫల్యానికి కూడా ప్రధాన కారణంగా మారుతుంది. కాబట్టి ముందుగానే గుర్తించాలి. క్రమం తప్పకుండా రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. అధిక చక్కెర స్థాయిలు కళ్లలోని రెటీనా నాళాలను దెబ్బతీస్తాయి. చూపు కోల్పోవడానికి దారి తీస్తుంది. డయాబెటిస్ సమస్యలను ముందుగానే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
- డాక్టర్ పి.సి. గుప్తా, కేర్ ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భరత్‌రామ్ నుంచి ప్రాణహాని ఉంది
Read Latest Telangana News and National News