Share News

Popcorn Lung Disease: పాప్ కార్న్ ఊపిరితిత్తుల వ్యాధి గురించి విన్నారా.. వీరికే ఎక్కువగా వచ్చే ఛాన్స్..

ABN , Publish Date - Apr 21 , 2025 | 09:48 AM

What is Popcorn Lung Disease: ఇటీవల కొత్త ఊపిరితిత్తుల వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నట్లు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఈ అలవాట్లు, రసాయనాల కారణంగా ఈ శ్వాసకోస వ్యాధికి గురవుతున్నట్లు నిర్ధారించారు. ఒకసారి పాప్ కార్న్ లంగ్ డిసీజ్ సోకితే శాశ్వతంగా నయమయ్యే అవకాశం లేదు. కాబట్టి, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు.

Popcorn Lung Disease: పాప్ కార్న్ ఊపిరితిత్తుల వ్యాధి గురించి విన్నారా.. వీరికే ఎక్కువగా వచ్చే ఛాన్స్..
Popcorn Lung Disease

Symptoms and Causes Of Popcorn Lung Disease: ఇటీవల అమెరికాకు చెందిన బ్రియానా మార్టిన్ అనే అమ్మాయికి టీనేజీ దాటకుండానే పాప్ కార్న్ లంగ్ అనే తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి సోకింది. 17 ఏళ్ల వయసులోనే ఇంతటి క్లిష్టమైన వ్యాధి బారిన పడటానికి గల కారణాలను అన్వేషించారు డాక్టర్లు. మూడు సంవత్సరాలుగా వేపింగ్ దురలవాటుకు బానిస కావడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలుసుకున్నారు. 'పాప్‌కార్న్ లంగ్ డిసీజ్'గా పిలువబడే ఈ వ్యాధి వల్ల యువతే ఎక్కువగా బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇంతకీ, పాప్ కార్న్ లంగ్ డిసీజ్ అంటే ఏమిటి? ఇది ఎందుకొస్తుంది? ఈ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు ఏమిటో తెలుసుకుందాం..


పాప్‌కార్న్ ఊపిరితిత్తులు అంటే ఏమిటి?

పాప్ కార్న్ ఊపిరితిత్తుల వ్యాధిని వైద్యపరంగా బ్రోన్కియోలిటిస్ ఆబ్లిటెరాన్స్ అని పిలుస్తారు. ఇది అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి. ఈ వ్యాధి వల్ల ఊపిరితిత్తులలోని అతి చిన్న వాయుమార్గాలలో (బ్రోన్కియోల్స్) వాపు వచ్చి మచ్చ కణజాలం ఏర్పడటం ప్రారంభమవుతుంది. దీని కారణంగా బాధిత వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.


పాప్ కార్న్ లంగ్స్ అనే పేరు ఎందుకు?

ఈ వ్యాధికి పాప్ కార్న్ లంగ్ అని పేరు పెట్టడానికి కారణం ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి మొట్టమొదటిసారి మైక్రోవేవ్ పాప్‌కార్న్ ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులలో కనిపించాయి. వారు డయాసిటైల్ అనే రసాయనం వాడుతూ పనిచేయడం వల్లే ఈ వ్యాధి వచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు.


పాప్ కార్న్ ఊపిరితిత్తుల వ్యాధికి కారణాలు

డయాసిటైల్:

ఇది మైక్రోవేవ్ పాప్‌కార్న్, ఈ-సిగరెట్లు (వేపింగ్ ద్రవాలు), కొన్ని ఆహారాల్లో వెన్న రుచిని రావడానికి ఉపయోగించే రసాయనం. దీన్ని పీల్చినట్లయితే ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది.

ఇతర రసాయనాలు:

ఫార్మాల్డిహైడ్, క్లోరిన్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్ వంటి రసాయనాలు కూడా ఈ వ్యాధికి కారణమవుతాయి.

ఇన్ఫెక్షన్లు:

న్యుమోనియా లేదా బ్రోన్కైటిస్ వంటి కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఈ పరిస్థితిని రేకెత్తిస్తాయి.

రోగనిరోధక సమస్యలు:

రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఊపిరితిత్తుల మార్పిడి తర్వాత శరీరం అవయవాన్ని తిరస్కరించినా కూడా ఈ వ్యాధి రావచ్చు.

ఈ-సిగరెట్లు (వేపింగ్):

ఈ-సిగరెట్లలో ఉండే డయాసిటైల్, ఇతర హానికరమైన రసాయనాల వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.


లక్షణాలు:

  • దీర్ఘకాలిక పొడి దగ్గు

  • వ్యాయామం లేదా శారీరక శ్రమ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

  • ఆస్తమా లేదా జలుబుతో సంబంధం లేని గురక.

  • ఎటువంటి కారణం లేకుండానే అలసిపోయినట్లు అనిపించడం.

  • పాప్‌కార్న్ ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు సాధారణంగా రసాయనం లేదా అనారోగ్యానికి గురైన 2 వారాల నుండి 2 నెలల తర్వాత ప్రారంభమవుతాయి.

  • తీవ్రమైన సందర్భాల్లో వ్యాధి పెరిగేకొద్దీ శ్వాస ఆడకపోవడం శాశ్వతంగా మారవచ్చు.


నివారణ:

రసాయనాలు వాడి పనిచేసే ఉద్యోగులు మాస్క్ లు, ఇతర రక్షణ పరికరాలను ఉపయోగించాలి.

ధూమపానం, వేపింగ్ రెండూ ఊపిరితిత్తులకు హానికరం. వాటిని నివారించండి.

ముఖ్యంగా మీరు ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తుంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.


సలహా:

ఈ వ్యాధి పూర్తిగా నయం కాదు, కానీ చికిత్స ద్వారా లక్షణాలను నియంత్రించవచ్చు.


Read Also: Constipation: ఈ కూరగాయలంటే మీకిష్టమా.. జాగ్రత్త.. ఇవి తింటే మలబద్ధకం..

Health Tips: ఈ పండ్లు తిన్నాక నీరు తాగితే.. కడుపులో ఏ సమస్యలు వస్తాయో తెలుసా.

Effects Of Tight Clothes: బిగుతైన దుస్తులతో కలిగే అనర్థాలు ఇవే

Updated Date - Apr 21 , 2025 | 10:20 AM