Share News

Chikungunya Symptoms: చికెన్‌గున్యా.. ఈ లక్షణాలు ఉంటే తక్షణమే జాగ్రత్త పడండి.!

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:52 PM

చికెన్‌గున్యా అనేది దోమ కాటు ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది చికున్‌గున్యా వైరస్ వల్ల వస్తుంది. అయితే, ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Chikungunya Symptoms:  చికెన్‌గున్యా.. ఈ లక్షణాలు ఉంటే తక్షణమే జాగ్రత్త పడండి.!
Chikungunya Symptoms

ఇంటర్నెట్ డెస్క్‌: వర్షాకాలంలో అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వలన దోమలు, ఈగలు వంటివి వృద్ధి చెంది.. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి, వర్షాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఈ సీజన్‌లో చికెన్‌గున్యా అనే వ్యాధి గుర్తించడం కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే దీనిలో వచ్చే జ్వరం ఇతర వైరస్‌ల మాదిరిగానే ఉంటుంది. కానీ, కొన్ని ప్రత్యేక లక్షణాలు ద్వారా ఈ వ్యాధిని ముందే గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ఆ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


చికెన్‌గున్యా అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది ఈడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన దోమ కుట్టినప్పుడు మనుషులకు సంక్రమిస్తుంది. అకస్మాత్తుగా అధిక జ్వరం రావడం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు రావడం, తలనొప్పి, కండరాల నొప్పి, వికారం, వాంతులు, అలసట వంటివి సమస్యలు వస్తాయి. చికెన్‌గున్యా వ్యాధి సోకిన చాలా మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన 3-7 రోజుల తర్వాత లక్షణాలు మొదలవుతాయి. దీనికి నిర్దిష్ట చికిత్స లేనప్పటికీ, లక్షణాలను తగ్గించడానికి మందులు ఇస్తారు. అలాగే, విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. దోమల ద్వారా వ్యాపించే వ్యాధి కాబట్టి, దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.


తీవ్రమైన కీళ్ల నొప్పులు

చేతులు, మోకాళ్లు, చీలమండలు, మణికట్టుల దగ్గర ఎక్కువ నొప్పి కనిపిస్తుంది. ఇది రోజువారీ పనులు కూడా చేయలేని స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే అలసట, శరీరం మొత్తం నొప్పి, బలహీనత సహజంగా కనిపిస్తాయి. జ్వరం తగ్గిన తర్వాత కూడా ఇవి కొన్ని రోజుల వరకు ఉండొచ్చు.

చర్మంపై దద్దుర్లు

ముఖం, చేతులు, కాళ్లపై ఎర్రగా చిన్న మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా జ్వరం వచ్చిన 2–5 రోజుల తర్వాత కనిపిస్తాయి.

తలనొప్పి, వికారం

కళ్ళ వెనుక భాగంలో గట్టిగా తలనొప్పి, వికారం లేదా వాంతులు వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు కడుపునొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కొంతమందికి కళ్ళు ఎర్రగా కనిపించవచ్చు. ఇది ఇతర వైరస్‌లతో పోలిస్తే కొంచెం ప్రత్యేక లక్షణం.

తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గిపోవచ్చు

చికెన్‌గున్యా వ్యాధి వచ్చినప్పుడు కొన్నిసార్లు తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గిపోవచ్చు. ఇది రక్త పరీక్షల్లో తేలుతుంది. దీన్ని నిర్ధారించడానికి RT-PCR లేదా IgM యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవచ్చు.


ఇవి గుర్తుంచుకోండి:

  • జ్వరం వచ్చినంత మాత్రాన ప్రతిసారీ అది ఫ్లూ అని అనుకోవద్దు.

  • కీళ్ల నొప్పి, చర్మ దద్దుర్లు, కళ్ళ ఎర్రబడటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి.

  • చికిత్సను ఆలస్యం చేయకుండా తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు.

  • చికెన్‌గున్యా గుర్తించడంలో స్పష్టత లేకపోవడం వల్ల చికిత్స ఆలస్యం అవుతుంది. అందుకే, ఈ లక్షణాలను మీరు ముందు గుర్తించి, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుంటే, దీర్ఘకాలిక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

అల్యూమినియం పాత్రల్లో ఇన్నేళ్లకు మించి వండితే కిడ్నీ సమస్యలు..!

హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.

Also Read Health News

Updated Date - Jul 29 , 2025 | 05:57 PM