Share News

పిల్లల డైట్‌ ప్లాన్‌ ఎలా ఉండాలంటే...

ABN , Publish Date - May 11 , 2025 | 12:00 PM

పిల్లల వయసు, ఎదుగుదల తీరును బట్టి వివిధ రకాల ఆహార పదార్థాలను ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే.. పిల్లలకు ఆహారం సూచించేప్పుడు వారిలో ఏవైనా పోషక లోపాలున్నాయేమో పరిశీలించాలని, ఎత్తు, బరువును చూడాలని చెబుతున్నారు. ఇంకా వారేం చెబుతున్నారంటే...

పిల్లల డైట్‌ ప్లాన్‌ ఎలా ఉండాలంటే...

మాకు ముగ్గురు పిల్లలు. ఎండాకాలం స్కూళ్లకి సెలవులు కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్లకి చక్కటి డైట్‌ ప్లాన్‌ చెబుతారా?

- చందు, గద్వాల

డైట్‌ చెయ్యడం అంటే సాధారణంగా తినే ఆహారం మానేయడం లేదా ఏవో ప్రత్యేకమైన సప్లిమెంట్లలాంటివి తీసుకోవడం కాదు. డైట్‌ ప్లాన్‌ అంటే సమతులమైన ఆహారం ఎలా తీసుకోవాలో తెలియచేయడం. పిల్లల వయసు, ఎదుగుదల తీరును బట్టి వివిధ రకాల ఆహార పదార్థాలను ఇవ్వాలి. పిల్లలకు ఆహారం సూచించేప్పుడు వారిలో ఏవైనా పోషక లోపాలున్నాయేమో పరిశీలించాలి. ఎత్తు, బరువును చూడాలి. ఇంకా వారి ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లను నేర్పించే సూచనలు చేయవచ్చు. ఈ సూచనల కోసం పిల్లల వైద్యులు లేదా ఆహార నిపుణులను వ్యక్తిగతంగా సంప్రదిస్తే మంచిది. సాధారణంగా మూడు నుంచి పదేళ్లలోపు పిల్లలకు ప్రతి మూడు నాలుగు గంటలకు ఓసారి ఏదైనా ఆహారం ఇవ్వడం మంచిది. రోజువారీ ఆహారంలో ధాన్యాలు (అన్నం, గోధుమ రొట్టె, చిరుధాన్యాలతో చేసిన జావలు మొదలైనవి), పప్పు ధాన్యాలు, గింజలు (ఆక్రోట్‌, బాదం, పల్లీ, జీడిపప్పు మొదలైనవి), వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి తప్పని సరిగా ఉండాలి. వారానికి మూడు నాలుగు సార్లు గుడ్లు, ఓసారి చికెన్‌, చేపలాంటివి చేరిస్తే మంచిది. బేకరీ స్నాక్స్‌, చాక్లెట్లు, బిస్కెట్లు, తీపి పదార్థాలు (స్వీట్లు, కేకులు, ఐస్‌క్రీమ్స్‌ మొదలైనవి), చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌ వంటివి మాత్రం అస్సలు అలవాటు చేయకూడదు. ఒకవేళ ఇప్పటికే అలవాటైతే నెమ్మదిగా మాన్పించాలి. దాహానికి తగినట్టుగా మంచినీళ్లు తాగేట్టు చూడాలి.


బరువు తగ్గడం కోసం రాత్రిపూట భోజనంలో కార్బోహైడ్రేట్లు మానేద్దామని అనుకుంటున్నాను. ఇది మంచి నిర్ణయమేనా? సలహా ఇవ్వండి.

- హరిణి, నెల్లూరు

book7.3.jpg

శరీరం బరువు తగ్గాలంటే రోజూ అవసరమయ్యే క్యాలరీలకంటే తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడు శరీరంలో పేరుకున్న అధిక కొవ్వు కరిగి, నెమ్మదిగా బరువు తగ్గుతారు. ఈ క్యాలరీల నియంత్రణ అనేది మనిషికీ మనిషికీ వారి జీవన శైలి విధానాలను బట్టి తేడాలు ఉంటాయి. శరీరంలో అన్ని వ్యవస్థల పనితీరు సక్రమంగా ఉండాలంటే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు అన్నీ తగు మోతాదుల్లో తీసుకోవాలి. ఒకటి ఎక్కువ, మరొకటి మరీ తక్కువగా తీసుకుంటే సమీపకాలంలో ఇబ్బంది లేనప్పటికీ, దీర్ఘకాలంలో ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. తక్షణ శక్తినిచ్చే గ్లూకోజ్‌ మనకు పిండి పదార్థాల (కార్బోహైడ్రేట్స్‌) నుండే వస్తుంది. ఆహారంలో పిండి పదార్థాలను పూర్తిగా తగ్గించి వేస్తే, ఎప్పుడూ నీరసంగా ఉండడమే కాక ఆ పదార్ధాల నుంచి అందే విటమిన్లు, ఖనిజాలు కూడా తక్కువై ఆరోగ్యం పాడవుతుంది. నిద్రకు కనీసం రెండు మూడు గంటల ముందే భోజనం ముగించినప్పుడు, రాత్రివేళ కార్బోహైడ్రేట్లు తీసుకోకూడదనే నియమం అవసరం లేదు. ఒకవేళ తిన్న వెంటనే నిద్ర పోవాల్సిన పరిస్థితి ఉంటే, సమతులాహారాన్నే తక్కువ మొత్తంలో తీసుకొని, తిన్న తరువాత కనీసం అర గంట ఆగి నిద్రపోతే సరిపోతుంది.


డార్క్‌ చాక్లెట్‌ తీసుకుంటే అల్జీమర్స్‌ నుంచి రక్షణ లభిస్తుంది అని విన్నాను, నిజమేనా? డెబ్భై ఏళ్ళు దాటినవాళ్లు ఏ మోతాదులో డార్క్‌ చాక్లెట్‌ తీసుకోవచ్చు?

- బి. వెంకటరావు, తిరుపతి

ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాలతో డార్క్‌ చాక్లెట్‌ నిండి ఉంటుంది. డార్క్‌ చాక్లెట్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నాణ్యమైన డార్క్‌ చాక్లెట్‌లో ఫైబర్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, మాంగనీస్‌ తదితరాలు పుష్కలం. వీటిలోని పాలీఫెనాల్స్‌, ఫ్లేవనోల్స్‌, కాటెచిన్స్‌ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు అల్జీమర్స్‌ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ నియంత్రించడానికి, రక్తపోటును తగ్గించేందుకు కూడా డార్క్‌ చాక్లెట్‌ ఉపయోగపడుతుంది. ఈ ఆరోగ్యఫలితాలు పూర్తిగా అందాలంటే 80-90శాతం కోకో ఉన్న డార్క్‌ చాక్లెట్‌ మాత్రమే తీసుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా చక్కెర, అధిక క్యాలరీలు ఉంటాయి. కాబట్టి రోజుకు 30 గ్రాములకు మించకుండా తీసుకుంటే చాలు. బరువు అధికంగా ఉన్నవారు డార్క్‌ చాక్లెట్‌ తినేముందు ఆరోజు తిన్న లేదా తినే ఆహార పదార్థాల క్యాలరీలను కూడా లెక్కించుకుని ఆరగిస్తే మంచిది. షుగర్‌ వ్యాధిగ్రస్తులు అన్ని రకాల తీపి పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి పది, పదిహేను గ్రాములకు మించకుండా డార్క్‌ చాక్లెట్‌ తీసుకోవచ్చు. డెబ్భై ఏళ్ళు పైబడిన వారు డార్క్‌ చాక్లెట్‌ను ఇలాగే పరిమిత మోతాదులో తీసుకుంటే పర్వాలేదు..

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com


ఈ వార్తలు కూడా చదవండి

CBI: రూ.70 లక్షల లంచం డిమాండ్‌

Operation Sindoor: ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..

Southwest Monsoon: ముందుగానే నైరుతి రుతుపవనాలు

Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 11 , 2025 | 12:03 PM