Dry Fruits: మీరు డ్రై ఫ్రూట్స్ తింటుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..
ABN , Publish Date - Apr 26 , 2025 | 08:30 AM
Health Benefits Of Dry Fruits: డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో అధిక మొత్తంలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఒక్కో డ్రై ఫ్రూట్ శరీరంలోని ఒక్కో భాగానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది. అవేంటో తెలుసుకుంటే అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు.

Health Benefits Of Dry Fruits: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. వ్యాధుల నివారణకు, శరీరానికి అవసరమైన పోషకాలను తీర్చడానికి క్రమం తప్పకుండా గింజలు లేదా డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. ఇవి రోజూ తినడం అలవాటు చేసుకుంటే విటమిన్లు, అధిక పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా అంది ఆరోగ్యంగా ఉంటారు. ఇక అందరిలో సాధారణంగా కనిపించే ఈ సమస్యలకు డ్రై ఫ్రూట్స్ ద్వారా చెక్ పెట్టవచ్చు. మరి, ఏ డ్రై ఫ్రూట్ ఏ శరీర భాగానికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పు
రోజువారీ ఆహారంలో బాదం, వాల్‌నట్స్ చేర్చుకోవడం వల్ల మెదడు, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆల్మండ్స్ లేదా బాదంపప్పులో విటమిన్ ఇ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడును బలపరుస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
వాల్‌నట్స్
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి, గుండె జబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
జీడిపప్పు
జీడిపప్పులో మెగ్నీషియం, జింక్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యం, కండరాల పనితీరును ప్రోత్సహిస్తాయి. గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. జీవక్రియ పెరిగేందుకు, కంటి ఆరోగ్యానికి చాలా మంచివి.
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో ఇనుము, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలగా ఉంటాయి. ఇందులోని పైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత, అలసట సమస్యలను నివారిస్తుంది. సహజ చక్కెర వల్ల త్వరగా శరీరానికి శక్తి అందుతుంది.పేగుల ఆరోగ్యానికీ ఎండుద్రాక్ష తింటే చాలామంచిది. నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందుతారు.
ఖర్జూరాలు
ఖర్జూరాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అలసట, బలహీనతను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఖర్జూరంలో సహజ చక్కెరలు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులో ఇనుము పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత, మలబద్ధకాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. కాల్షియం, మెగ్నీషియంలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పొటాషియం రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడుతుంది.
అంజూర
అంజూరలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్రమం తప్పకుండా తింటే పేగు, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది. బరువు, రక్తపోటు, గుండె ఆరోగ్యానికి, ఒత్తిడి తగ్గేందుకు ఈ పండు చాలా మంచిది.
ఆప్రికాట్లు
ఆప్రికాట్లలో విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ కంటెంట్ వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది. జీర్ణక్రియ, ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ప్రూన్స్ లేదా ప్లమ్
ప్రూన్స్ లేదా ప్లమ్ పండ్లు ఫైబర్, పొటాషియం, విటమిన్ కె అధికంగా ఉంటాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించి జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. విటమిన్ కె, పొటాషియం కారణంగా ఎముకలు దృఢంగా ఉంటాయి. కడుపు నిండిన భావనను కలిగించి బరువు తగ్గించుకునేందుకు సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని నివారిస్తాయి.
Read Also: Kumkuma Puvvu: ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీళ్లు తాగవచ్చా..
Coffee: రోజూ మూడు కప్పుల కాఫీ మంచిదే..
Constipation: ఈ కూరగాయలంటే మీకిష్టమా.. జాగ్రత్త.. ఇవి తింటే మలబద్ధకం..