Heart Problems: గుండె బలహీనంగా ఉంటే ముఖంలో ఈ 4 సంకేతాలు..!
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:01 PM
Facial Signs of Heart Problems: గుండె బలహీనపడితే శరీరంలోని ఏ అవయవమూ సరిగ్గా పనిచేయద్దు. మొత్తం శరీర పనితీరు లయ తప్పుతుంది. ముఖ్యంగా ముఖంపై ఈ సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే తీవ్రమైన గుండె జబ్బులను నివారించవచ్చు.

Physical Sgns of Hart Wakness: గుండె ఎందుకు బలహీనపడటానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు. హఠాత్తుగా పెరిగే రక్తపోటు గుండె కండరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని కారణంగా గుండె పనితీరు క్రమంగా బలహీనపడుతుంది. అలాగే డయాబెటిస్ కూడా గుండె ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రించుకోవడంలో విఫలమైతే గుండె రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇంకా క్రమరహిత జీవనశైలి, ధూమపానం, అధిక మద్యం, ఫాస్ట్ ఫుడ్, ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా గుండెను బలహీనపరుస్తాయి.
గుండె మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం. ఇది మొత్తం శరీరానికి రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు మన జీవితాంతం విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కానీ గుండె బలహీనపడటం ప్రారంభించినప్పుడు లేదా సామర్థ్యం తగ్గడం మొదలైతే.. దాని ప్రభావం అంతర్గత అవయవాలపై మాత్రమే కాకుండా ముఖంపై కూడా కనిపిస్తుంది. వైద్యులు, కార్డియాలజిస్టుల ప్రకారం ముఖంపై ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే గుండె జబ్బులు తీవ్రంగా మారకుండా నిరోధించవచ్చు.
గుండె బలహీనంగా ఉంటే ముఖంలో ఈ 4 సంకేతాలు..
పాలిపోయిన ముఖం..
గుండె పనితీరు సరిగాలేకపోతే ముఖం పాలిపోవడమనే లక్షణం అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందదు. ఇది ముఖ చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని వలన ముఖం నిస్తేజంగా లేదా అనారోగ్యంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడి ముదురు రంగులోకి మారుతాయి.
సైనోసిస్ (ముఖం లేదా పెదవులు నీలి రంగులోకి మారడం)
మరో ముఖ్యమైన సంకేతం ముఖం లేదా పెదవులు నీలిరంగులోకి మారడం (సైనోసిస్). శరీరానికి తగినంత ఆక్సిజన్ అందనప్పుడు పెదవులు, గోళ్లు, ముఖం నీలం లేదా బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా గుండె వైఫల్యం లేదా తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో కనిపిస్తుంది.
ముఖం మీద నిరంతర వాపు..
మూడవ లక్షణం ముఖం మీద నిరంతరం వాపు. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం మొదలవుతుంది. దీని ప్రభావం ముఖ చర్మంపై వాపు రూపంలో కనిపిస్తుంది, ముఖ్యంగా ఉదయం నిద్ర మేల్కొన్నప్పుడు.
అధిక చెమట..
నాల్గవ లక్షణం అధిక చెమట లేదా ముఖం తరచుగా తడిగా ఉండటం. బలహీనమైన గుండె సాధారణ విధులను నిర్వహించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. దీని వలన శరీరం అధిక చెమట ఉత్పత్తి చేస్తుంది. భారీగా కష్టపడకున్నా ముఖం పదే పదే చెమటతో తడిసిపోతే ఇది గుండె సమస్యకు సంబంధించిన సంకేతం కావచ్చు.
పై లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు. ముఖ్యంగా అలసట, ఊపిరి ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పితో ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి ECG, ఎకో, రక్త పరీక్షలు వంటి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. గుర్తుంచుకోండి. గుండె జబ్బులు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. కానీ ముఖంపై కనిపించే సంకేతాలు గుర్తించారంటే సకాలంలో చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. అయితే ప్రతి రోగిలో ఇవి కనిపించాల్సిన అవసరం లేదు. కానీ, మీకు పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)