Brushing Teeth: ఒక్క రోజు పళ్లు తోముకోకపోతే ఇంత డేంజరా..?
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:28 AM
ఒక్క రోజు పళ్లు తోముకోకుంటే ఏముందిలే అని వదిలేస్తాం. కానీ అదే మన ప్రాణాలకు ముప్పు తీసుకు వస్తుందని ఏ మాత్రం గమనించం. ఒక్క రోజు కూడా పళ్లు తోముకోకపోవడం వల్ల మరణానికి చేరువ అవుతున్నామనే విషయాన్ని గుర్తించం.
ఎవరో ఒకరు. ఎప్పుడో అప్పుడు. జీవితంలో ఒక్కసారి అయినా పళ్లు తోముకోకుండా ఉంటారు. అంటే.. ఏదైనా అర్జెంట్ పని మీద ఊరు వెళ్లినప్పుడో, మరో సమయంలోనే జస్ట్ నీటితో నోటిని పుక్కిలించేస్తాం. ప్రస్తుతం శీతాకాలం కావడంతో చలి విపరీతంగా ఉంటుంది. దీంతో చన్నీళ్లతో పళ్లు ఏం తోముకుంటామని చాలా మంది బద్ధకంతో ఆ పని చేయడం మానేస్తారు. ఒక్క రోజు బ్రేష్ చేయకుంటే ఏం కాదులే అనే ఒక భావనతో ఇలా చేసేస్తాం. కానీ ఇలా చేయడం చాలా డేంజర్ అని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క రోజు పళ్లు తోముకోకుంటే వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పేర్కొంటున్నారు.
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం.. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత 20 నిమిషాల్లోనే.. నోట్లోకి బ్యాక్టీరియా, చక్కెర, స్టార్చ్‌ను ఆమ్లంగా మారుస్తుంది. ఈ ఆమ్లం దంతాల బయటి పొర ఎనామిల్‌ను తినడం ప్రారంభిస్తోంది. పళ్లు తోముకోకపోతే.. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది.
ఆహారం తీసుకున్న 4 నుంచి 6 గంటల తర్వాత.. దంతాలపై ప్లేక్ అనే జిగట పొర ఏర్పడడం ప్రారంభమవుతుంది. 12 గంటల తర్వాత.. ప్లేక్ గట్టిపడి టార్టార్ ఏర్పడుతుంది. 24 గంటల అనంతరం చిగుళ్లు ఉబ్బడం, వాటి నుంచి రక్తస్రావం కావడంతోపాటు నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతోంది. రోజూ పళ్లు తోముకోకుంటే.. వ్యక్తుల మరణానికి 25 శాతం పెరుగుతుంది.
అల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన దంత వైద్యుడి పరిశోధన ప్రకారం. ఒక రోజు పళ్లు తోముకోకుంటే.. మీ నోటిలో మిలియన్ బ్యాక్టీరియా పెరుగుతుందని స్పష్టమైంది. ఈ బ్యాక్టీరియా రక్తప్రవాహంలో ప్రవేశించి.. శరీరంలోని ప్రతి అవయవానికి హాని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో పళ్లు తోముకోకుంటే.. మరణానికి దగ్గరవుతామని సంకేతం.
ఒక ఏడాది పాటు పళ్లు తోముకోకపోతే.. మీ దంతాలు పూర్తిగా కుళ్లిపోయి.. చిగుళ్లకు చీముతోపాటు నొప్పికి కారణమవుతాయి. ఇది చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది. దీని వల్ల చిగుళ్లు వదలుగా మారతాయి. దాంతో దంతాలు ఊడిపోతాయి. ఇది మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతుంది. ఈ బ్యాక్టీరియా దమనుల్లో వాపును కలిగిస్తుంది. ఇది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కలిగించి.. న్యూమోనియాకు దారితీస్తుంది.
పొగాకుతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవడం ద్వారా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే పళ్లు తోముకోకపోవడం వల్ల కూడా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు.