Share News

Priyanka Gandhi: మీరు ప్రశాంతంగా రిటైర్ కాలేరు.. సీఈసీపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 03:33 PM

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇద్దరు ఈసీలు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక ఓ సభలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 'చోర్ చోర్' అంటూ ప్రియాంక మద్దతుదారులు నినాదాలు చేయడం కనిపించింది.

Priyanka Gandhi: మీరు ప్రశాంతంగా రిటైర్ కాలేరు.. సీఈసీపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు
Priyanka gandhi

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఓవైపు జరుగుతుండగా మరోవైపు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ ఎడతెరిపి లేకుండా విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రీగాలో శుక్రవారంనాడు జరిగిన ర్యాలీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ (Gyanesh Kumar)ను, ఇద్దరు ఈసీ అధికారులను నేరుగా టార్గెట్ చేశారు.


ఎన్నికల అధికారులకు సూటి హెచ్చరిక

ఎన్నికల అధికారులను స్టేజిపై నుంచే ప్రియాంక నేరుగా హెచ్చరిస్తూ.. 'జ్ఞానేశ్ కుమార్.. మీరు ప్రశాంతంగా రిటైర్ అవుతారని అనుకుంటున్నారేమో.. అది జరగదు. జ్ఞానేశ్ కుమార్ పేరును మరిచిపోవద్దని ప్రజలకు చెప్పదలచుకున్నాను' అని అన్నారు. జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇద్దరు ఈసీలు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక ఈ సభలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 'చోర్ చోర్' అంటూ ప్రియాంక మద్దతుదారులు నినాదాలు చేయడం కనిపించింది.


హరియాణా ఎన్నికల్లో ఓట్ల అవకతవకలకు పాల్పడ్డారని, ప్రజలు తమకు జరిగిన మోసాన్ని మరిచిపోరని ప్రియాంక అన్నారు. ఇందులో ప్రమేయమున్న జ్ఞానేశ్ కుమార్, ఎస్ఎస్ సంధు, వివేక్ జోషిలు ప్రశాంతంగా రిటైర్ అవుతామని అనుకుంటే పొరపడినట్టేనని పేర్కొన్నారు. దీనికి ముందు రాహుల్ గాంధీ సైతం ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని, తన మాటలు 100 శాతం నిజమని అన్నారు.


కాగా, ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా ఎన్నికల అధికారులను బెదిరించడంలో ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రసంగాల పరిధి ఏమేరకు ఉండవచ్చనే దానిపై చర్చ సైతం జరుగుతోంది. రెండు విడతల బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 121 నియోజకవర్గాల్లో గురువారంనాడు తొలి విడత పోలింగ్ జరుగగా, రెండో విడత పోలింగ్ 122 నియోజకవర్గాల్లో నవంబర్ 11న జరగాల్సి ఉంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

అది మీ కుమారుడి తప్పిదం కాదు.. ఎయిరిండియా దుర్ఘటనపై సుప్రీంకోర్టు

బీజేపీ, ఈసీ కలిసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 04:29 PM