Share News

Bihar Elections: మోదీ నినాదాలతో మార్మోగిన ప్రధాని రోడ్‌షో, హారతి పట్టిన మహిళలు

ABN , Publish Date - Nov 02 , 2025 | 08:05 PM

ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరోసారి ఎన్డీయే గెలుపు ఖాయమని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఎన్డీయే చేపట్టిన అభివృద్ధి మోడల్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది చాటుతోందన్నారు.

Bihar Elections: మోదీ నినాదాలతో మార్మోగిన ప్రధాని రోడ్‌షో, హారతి పట్టిన మహిళలు
Modi road show in Patna

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narenedra Modi) ఆదివారం సాయంత్రం పాట్నా సిటీలో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో జనం ప్రధానికి ఘన స్వాగతం పలికారు. బీజేపీ జెండాలు పట్టుకుని 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు హోరెత్తించారు. భారీ భద్రతతో ప్రధాని కాన్వాయ్ ముందుకు సాగగా, పలువురు ప్రధానిపై పూలజల్లులు కురిపించారు. మహిళలు హారతులు పట్టారు. రోడ్‌షో పండుగ ఉత్సవాన్ని సంతరించుకుంది.


దీనికి ముందు నవడలో జరిగిన భారీ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరోసారి ఎన్డీయే గెలుపు ఖాయమని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఎన్డీయే చేపట్టిన అభివృద్ధి మోడల్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది చాటుతోందన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిపై విమర్శలు గుప్పిస్తూ, సొంత కుటుంబ ప్రయోజనాల చుట్టూనే ఆ పార్టీల రాజకీయాలు ఉంటాయని, వీరిలో ఒక పార్టీ బిహార్‌లోనే అత్యంత అవినీతి కుటుంబమని, మరొకటి దేశంలోనే అత్యంత అవినీతి కుటుంబమని అన్నారు. విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని, పొత్తులు ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరు పోటాపోటీగా అభ్యర్థులను బరిలోకి దింపాయని ఎద్దేవా చేశారు. బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఆర్జేడీ తమ అభ్యర్థిని నిలపెట్టడం దేశ ప్రజలంతా గమనిస్తున్నారని, ఆర్జేడీని ప్రతి బూత్‌లోనూ ఓడించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోందని మోదీ చెప్పారు.


యువతకు బిహార్‌లోనే ఉపాధి

ఎన్డీయే ప్రభుత్వం బిహార్‌లోనే పుష్కలమైన అవకాశాలను కల్పిస్తుందని, సమీప భవిష్యత్తులో బిహార్ యువత సొంత రాష్ట్రంలోనే పని చేసుకునేందుకు తాను భరోసా ఇస్తున్నానని మోదీ చెప్పారు. రాష్ట్రంలోని రైతుల అకౌంట్లలో రూ.650 కోట్లు జమ చేశామని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే నిధులు అందేలా చేయడమే ఎన్డీయే గవర్నెన్స్ మోడల్ అని వివరించారు.


ఇవి కూడా చదవండి...

LVM3 సిరీస్‌లో ఇది 8వ విజయం: ఇస్రో ఛైర్మన్ నారాయణన్

ఈ నేరం ప్రేమతో జరిగింది.. కామంతో కాదు: సుప్రీంకోర్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 02 , 2025 | 08:27 PM