Fake Vomit To Steal Gold: కిలాడీ లేడీలు.. వాంతి చేసుకుంటారు.. బంగారం దోచేస్తారు..
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:10 PM
ఓ ఆరుగురు మహిళలు కొత్తరకం దొంగతనానికి తెర తీశారు. వాహనాల్లో వాంతి నాటకం ఆడి మహిళల్ని దోచేస్తున్నారు. వారినుంచి బంగారు ఆభరణాలు కొట్టేస్తున్నారు.
దొంగలు దొంగతనం చేయడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ ఉన్నారు. ఇలా కూడా దొంగతనం చేయవచ్చా అని ఆశ్చర్యపోయేలా దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లో కొత్త రకం దొంగతనం వెలుగులోకి వచ్చింది. మహిళల గ్యాంగ్ ఫేక్ వాంతి చేసుకుని తోటి ఆడవాళ్లను దోచేస్తోంది. బంగారు ఆభరణాలు చోరీ చేస్తోంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. లక్నోకు చెందిన ఆరుగురు మహిళలు గ్రూపుగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు.
బస్సులు, ఆటోలలో ప్రయాణించే ఆడవాళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ ఆరుగురు మహిళలు ఒకే వాహనంలో ప్రయాణిస్తారు. ముందుగానే టార్గెట్‌ను ఎంపిక చేసుకుంటారు. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లు వాహనంలో ప్రయాణిస్తారు. ఆ ఆరుగురిలో ఓ మహిళ టార్గెట్‌తో చనువుగా మాటలు కలుపుతుంది. మరో మహిళ వాంతి చేసుకుంటున్నట్లు నాటకం ఆడుతుంది. దీంతో వాహనంలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది.
ఇదే అదునుగా మూడో మహిళ టార్గెట్ మెడలోంచి చైన్ లేదా మంగళసూత్రాన్ని లాగేస్తుంది. ఆ వెంటనే గ్యాంగులోని నాలుగో వ్యక్తికి అందిస్తుంది. దొంగతనం చేసిన వెంటనే మరో స్టాపులో అందరూ దిగిపోతారు. దొంగతనం జరిగిందని టార్గెట్‌కు తెలిసే లోపే అంతా జరిగిపోతుంది. పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. విరాట్ క్రాసింగ్ దగ్గర వీరిని అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి బంగారు ఆభరణాలు, 13 వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
శీతాకాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే
రూ.2000పై ఆర్బీఐ కీలక ప్రకటన.. చలామణిలో రూ.5,817 కోట్లు విలువైన నోట్లు