Share News

Bihar Polls: స్వల్ప ఆధిక్యంతో ఎన్డీయేకే మళ్లీ విజయం.. ఒపీనియన్ పోల్ జోస్యం

ABN , Publish Date - Nov 01 , 2025 | 09:26 PM

పోల్ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి పదవికి 33 శాతం మద్దతుతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. నితీష్ కుమార్ 29 శాతంతో ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్‌లు చెరో 10 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచారు.

Bihar Polls: స్వల్ప ఆధిక్యంతో ఎన్డీయేకే మళ్లీ విజయం.. ఒపీనియన్ పోల్ జోస్యం
Bihar openion poll

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly polls) ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార ఎన్డీయే (NDA), విపక్ష మహాగట్‌బంధన్ (MGB) మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్డీయే తిరిగి అధికారం నిలుపుకోనుందని ఒక ఒపీనియల్ పోల్ అంచనా వేసింది. జేవీసీ పోల్ (JVC Poll) జరిపిన సర్వేలో 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే 120 నుంచి 140 సీట్లు గెలుచుకుంటుంది. ఎంజీబీ 93 నుంచి 112 సీట్లు దక్కించుకుంటుంది.


బీజేపీ సొంతంగా 71 నుంచి 81 సీట్లు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలువనుందని సర్వే అంచనా వేసింది. జేడీయూ 42 నుంచి 48 సీట్లు, ఎల్‌జేపీ (ఆర్‌వీ) 5 నుంచి 7, హెచ్ఏఎం(ఎస్) 2, ఆర్ఎల్ఎం 1 నుంచి 2 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది. మహాగట్‌బంధన్‌లో ఆర్జేడీ 69 నుంచి 78 సీట్లు దక్కించుకోనుంది. కాంగ్రెస్ 9 నుంచి 17, సీపీఐ(ఎంఎల్) 12 నుంచి 14, సీపీఐ-1, సీపీఎం 1 నుంచి 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని 'జన్ సురాజ్ పార్టీ' ఒక సీటు గెలుచుకుని ఖాతా తెరుస్తుందని, ఏఐఎంఐఎం, బీఎస్‌పీ, ఇతర పార్టీలు 8 నుంచి 10 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే అంచనా వేసింది.


సీఎం ఫేస్.. తేజస్వి ముందజ

పోల్ సర్వే ప్రకారం... ముఖ్యమంత్రి పదవికి 33 శాతం మద్దతుతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. నితీష్ కుమార్ 29 శాతంతో ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్‌ చెరో 10 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచారు. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి 9 శాతంతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.


ఎన్డీయేకు 41-43 శాతం ఓట్ షేర్

ఒపీనియన్ పోల్ ప్రకారం, ఎన్డీయేకు 41 నుంచి 43 శాతం ఓట్ షేర్ రానుంది. ఎంజీబీ 39 నుంచి 41 శాతం, జన్ సురాజ్ 6 నుంచి 7 శాతం ఓట్ షేర్ రాబట్టుకోనున్నాయి. ఇతర చిన్న పార్టీలు 10 నుంచి 11 శాతం ఓట్ షేర్ రాబట్టుకునే అవకాశం ఉంది.


కాగా, బిహార్‌ ఓటర్ల తుది జాబితాలో 7.42 కోట్ల మంది ఓటర్లుగా ఉన్నారు. గతేడాది ఈ సంఖ్య 7.89 కోట్లుగా ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 స్థానాల్లో గెలుచుకుంది. 19.8 శాతం ఓట్ షేర్ రాబట్టింది. జేడీయూ 115 సీట్లలో పోటీ చేసి 43 స్థానాలు దక్కించుకుంది. 15.7 శాతం ఓటు షేర్ రాబట్టింది. హిందుస్థానీ అవావ్ మోర్చా (సెక్యులర్) 7 సీట్లలో పోటీ చేసి 4 చోట్ల గెలిచింది. 0.9 శాతం ఓట్ షేర్ దక్కించుకుంది. 2025 బిహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 243 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు విడతల్లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

మా ఇద్దరిలో ఎవరైనా చెబితేనే నమ్మండి.. నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే

ఇతర పార్టీలతో పొత్తులు ఉండవు: ప్రశాంత్ కిశోర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 09:53 PM