Share News

Mallu Bhatti Vikramarka: జేఎన్‌టీయూ.. జాతీయ ఆస్తి

ABN , Publish Date - Nov 22 , 2025 | 07:32 AM

దేశాన్ని నడిపిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులను సృష్టించిన జేఎన్‌టీయూను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జేఎన్‌టీయూలో జరిగిన కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Mallu Bhatti Vikramarka: జేఎన్‌టీయూ.. జాతీయ ఆస్తి

- దేశాన్ని నడిపించే వ్యక్తుల సృష్టికర్త

- కాలేజీ వజ్రోత్సవ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

- వర్సిటీకి భూమి లీజ్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ మినహాయింపు

- అభివృద్ధికి రూ.800 కోట్ల నిధులు

హైదరాబాద్‌ సిటీ: దేశాన్ని నడిపిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులను సృష్టించిన జేఎన్‌టీయూను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం జేఎన్‌టీయూలో జరిగిన కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లలో లక్షలాదిమంది ఇంజనీర్లను, ఆవిష్కర్తలను, పరిపాలకులను తీర్చిదిద్దిన ఈ పవిత్ర స్థలంలో నిలబడి మాట్లాడటం.. తనకు అపూర్వమైన ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. సిలికాన్‌ వ్యాలీలో ఎవరైనా ఒకరాయి విసిరితే, అది తప్పకుండా ఒక జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థిపై పడుతుందని వర్సిటీ గొప్పతనాన్ని డిప్యూటీ సీఎం ప్రశంసించారు.


గ్రోత్‌ ఇంజన్‌ను నడిపేది జేఎన్‌టీయూనే

తెలంగాణ రైజింగ్‌ 2047 డాక్యుమెంట్లో విద్య, నైపుణ్యాలు, ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, తెలంగాణ గ్రోత్‌ ఇంజన్‌ను ముందుకు నడిపేది జేఎన్టీయూనే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సాంకేతిక విశ్వవిద్యాలయాలు దేశ పురోగతికి ఇంజిన్లుగా మారాలని పండిట్‌ నెహ్రూ కలగన్నారని, ఆ క్రమంలోనే, 1965లో నాగార్జునసాగర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ప్రారంభం కాగా, అదే కళాశాల 1972 నుంచి దేశంలో మొట్ట మొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిందని చెప్పారు.

city2.2.jpg


మరో 60 ఏళ్లు మహోన్నతంగా జేఎన్‌టీయూ

మొదటి 60 సంవత్సరాల కంటే.. రానున్న 60 సంవత్సరాల పాటు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల మరింత మహోన్నతంగా అభివృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. అంతకు మునుపు జేఎన్‌టీయూ సావనీర్‌ను డిప్యూటీ సీఎం, ఇతర అధితుల చేతులమీదుగా ఆవిష్కరించారు. అలాగే, ఉన్నతస్థానాలకు ఎదిగిన పూర్వ విద్యార్థులకు యంగ్‌ అచీవర్‌ అవార్డులను అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు జేఎన్‌టీయూ డైమండ్‌ జూబ్లీ పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ కిషన్‌ కుమార్‌ రెడ్డి, రెక్టార్‌ విజయకుమార్‌ రెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ నర్సింహారెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, సాంకేతిక విద్యా కమిషనర్‌ కృష్ణఆదిత్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ గణపతిరెడ్డి, విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.


19 మంది ‘యంగ్‌ అచీవర్స్‌’

హైదరాబాద్‌ సిటీ: వివిధ రంగాల్లో ప్రతిభా పాటవాలను చూపిన 19 మంది పూర్వ విద్యార్థులను ‘యంగ్‌ అచీవర్స్‌’ అవార్డులకు జేఎన్‌టీయూ అలూమ్ని కమిటీ ఎంపిక చేసింది. వారికి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌.. అవార్డులను ప్రదానం చేశారు. యంగ్‌ అచీవర్స్‌ అవార్డు గ్రహీతల్లో రాంప్రసాద్‌ (క్లైమేట్‌చేంజ్‌), ప్రతుల్‌రాజ్‌ మట్టా (క్రీడలు), శివరామకృష్ణ (కళలు), అనీస్‌ ఫాతిమా (ఎంటర్‌ప్రెన్యూర్‌), షిఫాలీ (రీసెర్చ్‌), పెద్ది చైతన్య (టెక్నాలజీ ఇన్నోవేషన్‌), సునీల్‌ కుమార్‌ (ఎంటర్‌ప్రెన్యూర్‌), రోసీసర్కార్‌ (అకడమిక్‌), శ్రీలత(రీసెర్చ్‌), శ్రీజారెడ్డి (ప్రజాసేవ), అట్లూరి రాంబాబు (ఎంటర్‌ప్రెన్యూర్‌), అనురుధ్‌ (కార్పొరేట్‌ లీడర్‌షిప్‌), శాంతి (టెక్నాలజీ ఇన్నోవేషన్‌), రిషీ మహేశ్వరీ (ఎంటర్‌ప్రెన్యూర్‌), రిషీజైన్‌ (రీసెర్చ్‌), వెంకన్న భానోత్‌ (అకడమిక్‌), తోట రాజశేఖర్‌ (ఎంటెర్‌ప్రెన్యూర్‌), నిశాంత్‌కుమార్‌ (సామాజిక సేవ), ఎం. ప్రణయ్‌ (కార్పొరేట్‌ లీడర్‌షిప్‌) తదితరులున్నారు. యంగ్‌ అచీవర్స్‌గా ఎంపికైన పూర్వ విద్యార్థులను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వైస్‌చాన్స్‌లర్‌ కిషన్‌కుమార్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోషల్‌ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు

రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2025 | 07:32 AM