Share News

Tirumala-Tirupati: తిరుమల శ్రీవారికి ‘డివోషనల్‌’, ‘సోషల్’ సేవ...

ABN , Publish Date - Nov 30 , 2025 | 08:36 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు అద్భుతమైన తిరుపతి, తిరుమల ఫొటోలు, వీడియోలతో పాటు... దర్శన, వసతి, టీటీడీ నూతన నిర్ణయాలు, ప్రసాదాలు, చేపడుతున్న మార్పులు వంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ... సోషల్‌ మీడియా సేవ చేస్తున్నారు తిరుపతికి చెందిన కొందరు యువకులు.

Tirumala-Tirupati: తిరుమల శ్రీవారికి ‘డివోషనల్‌’, ‘సోషల్’ సేవ...

పబ్లిసిటీ అవసరం లేని బ్రహ్మాండ నాయకుడాయన. అయినా సరే ఆ దేవదేవుని గురించి, ఆయన సన్నిధిలో జరిగే అనేక విశేషాలు, విపత్తుల గురించిన సమాచారాన్ని నిరంతరం సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ స్థానిక యువకులు ‘డివోషనల్‌’, ‘సోషల్‌’ సేవ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులతో పాటు స్థానికులనూ ఆకట్టుకుంటున్నారు. ఆ విశేషాలే ఇవి...

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు అద్భుతమైన తిరుపతి, తిరుమల ఫొటోలు, వీడియోలతో పాటు... దర్శన, వసతి, టీటీడీ నూతన నిర్ణయాలు, ప్రసాదాలు, చేపడుతున్న మార్పులు వంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ... సోషల్‌ మీడియా సేవ చేస్తున్నారు తిరుపతికి చెందిన కొందరు యువకులు. అత్యవసరంగా రక్తం ఎవరికి కావాలనే సమాచారంతో పాటు... వర్షాలు తదితర విపత్తులతో ప్రజలు ఏ ప్రాంతాల్లో ఇబ్బందిపడుతున్నారనే అంశాలను సైతం నిరంతరం అందజేస్తూ సామాజిక మాఽధ్యమాల్లో దూసుకుపోతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వీరి పేజీలను ఆసక్తిగా ఫాలో అవుతున్నారు.


11 ఏళ్ల క్రితమే...

2014కు ముందు తిరుమలకు వచ్చే భక్తులకు స్థానికంగా మాత్రమే సమాచారం లభించేది. ఏవైనా విశేషాలు, కార్యక్రమాలు ఉంటే మిగతా ప్రాంతాల భక్తులు వార్తపత్రికల్లో, టీవీల్లో చూసేవారు. సుమారుగా పదేళ్ల క్రితం నుంచి సోషల్‌ మీడియా జోరు మొదలైంది. దాంతో సోషల్‌మీడియాలో పత్యేకంగా పేజీని పెట్టాలనే ఆలోచన తిరుపతికి చెందిన ఇద్దరు యువకులకు వచ్చింది. ఇంజనీరింగ్‌ చదివే సమయంలోనే పృథ్వీరాజ్‌ జొరేపల్లి, నితిన్‌ రాచూరే అనే ఇద్దరు స్నేహితులు ‘ఇట్స్‌ మై తిరుపతి’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లోనూ ఇదే పేర్లతో పేజీలను క్రియేట్‌ చేశారు. తిరుపతిలో తొలి సోషల్‌మీడియా పేజ్‌ వీళ్లదే కావడం గమనార్హం.


book4.3.jpg

తిరుమల, తిరుపతి ఫొటోలు, వీడియోలేగాక తిరుమలకు సంబంధించి పూర్తిస్థాయిలో అప్‌డేట్స్‌ ఇవ్వడంలో విజయవంతం కావడంతో పాటు... సామాజిక బాధ్యత కింద తిరుపతి, పరిసర ప్రాంతాల్లో రక్తం ఎవరికైనా అవసరముంటే ఈ పేజీ ద్వారా దాతలను సంప్రదించడం, రోగులకు అందజేయడం వంటి విషయాల్లో గుర్తింపు పొందారు. ఇక, తిరుపతిలో పురాతన కట్టడాలు, వాటి చరిత్ర, అలనాటి జ్ఞాపకాలను ప్రజలకు అందజేయడం లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఇన్‌స్టాగ్రామ్‌లో 5.27 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 2.21 లక్షల మంది, ఎక్స్‌ (ట్విట్టర్‌) లో మరో 4,700 మంది ఫాలోవర్లు ఉన్నారు.


book4.2.jpg

కొవిడ్‌ సమయంలో...

2020లో వచ్చిన కొవిడ్‌ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ‘బ్యూటీఫుల్‌ తిరుపతి’ అనే పేజ్‌ ద్వారా ఇచ్చిన అప్‌డేట్స్‌ చాలామందికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. జిల్లా అధికార యంత్రాగం కూడా ఒకానొక దశలో ఈ పేజీని ఫాలో అయ్యిందంటే... ఏ స్థాయిలో అప్‌డేట్‌ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. తిరుపతి కొర్లగుంటకు చెందిన శశిధర్‌ ఫొటోగ్రాఫర్‌. ఉద్యోగం కోసం పుట్టిన ఊరును విడువలేక తిరుపతిలోనే చిన్న ఉద్యోగం చేసుకుంటూ ‘బ్యూటీఫుల్‌ తిరుపతి’ పేజ్‌ను నిర్వహిస్తున్నాడు.


2017లో ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బ్యూటీఫుల్‌ తిరుపతి’ పేజ్‌లను క్రియేట్‌ చేసి తాను తీసిన ఫొటోలు పోస్ట్‌ చేయడం మొదలుపెట్టాడు. వీటితో పాటు తిరుపతి, తిరుమల అందాలు, దర్శనం, వసతి, ప్రసాదం, టీటీడీ నూతన నిర్ణయాలు వంటి అప్‌డేట్స్‌ ఇచ్చేవాడు. స్వామి దర్శనం, ఉత్సవాలు, విశేష పర్వదినాల గురించి కూడా అప్‌లోడ్‌ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది కూడా శశినే. ఈవిధంగా దాదాపు 3.68 లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న శశి ఫేస్‌బుక్‌లోనూ 2.85 లక్షల మంది ఫాలోవర్స్‌ కొనసాగుతున్నారు. మొత్తానికి ఈ యువకులు తమ ఊరికి, దైవానికి ‘సోషల్‌’ సేవ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

- జగదీష్‌ జంగం, తిరుమల


సంతృప్తిగా ఉంది...

book4.jpgనేను పుట్టిన ఊరు తిరుపతంటే నాకు చాలా ఇష్టం. పుట్టిన ఊరికోసం ఏదో చేయాలనే తపన ఉంది. తిరుపతిలో చాలా అద్భుతాలున్నాయి. ప్రతీ ప్రదేశం నాకళ్లకు అందంగానే కనిపిస్తుంది. ఆ అందాలను, విశేషాలను ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయా లనుకున్నా. సోషల్‌ మీడియాను ఈ విధంగా మంచి పనులకు వాడు తున్నాననే సంతృప్తి నాకుంది.

- శశిధర్‌, ‘బ్యూటీఫుల్‌ తిరుపతి’


ఇదీ ప్రజా సేవే...

పదేళ్ల క్రితం ‘ఇట్స్‌ మై తిరుపతి’ని క్రియేట్‌ చేశాం. మొదట్లో ఇంత సక్సెస్‌ అవుతామను కోలేదు. చదువుకుంటూనే తిరుపతి, తిరుమల, పరిసర ప్రాంతాలకు చెందిన ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టాం. ఒకరకంగా ఇదీ ప్రజాసేవే కదా. నవంబర్‌ 29వ తేదీ నాటికి మా పేజీని ప్రారంభించి 11 ఏళ్లు పూర్తయింది.

- పృథ్వీ, నితిన్‌, ‘ఇట్స్‌ మై తిరుపతి’


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు

నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2025 | 08:36 AM