Tholi Ekadasi 2025:తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఉపవాసం ఎందుకు చేస్తారు?
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:36 AM
Tholi Ekadashi Rituals and Benefits: హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజును తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి నుంచే విష్ణువు యోగనిద్రలోకి జారుకుంటాడు. అంతేకాదు,ఇవాళ నుంచే హిందువుల పండగలు మొదలువుతాయి.

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి నాడు తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటారు. విష్ణుమూర్తికి అంకితం చేసిన ఈ పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజు నుంచి మొదలుకుని కార్తిక శుద్ధ ఏకాదశి వరకూ లక్ష్మీ వల్లభుడు నాలుగు నెలలపాటు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి జారుకుంటాడు. దీంతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యభగవానుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినం ఈరోజు జూలై 06, 2025 ఆదివారం నాడు జరుపుకుంటున్నాం. ఇవాళ భక్తులు నియమ నిష్ఠలతో ఉపవాసం పాటిస్తూ విష్ణువును ఆరాధిస్తే గతజన్మల పాపాలూ, కష్టనష్టాలు తొలగిపోయి కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం.
నిజానికి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతినెలా శుక్ల పక్షంలో ఒకసారి, కృష్ణ పక్షంలో ఒకసారి ఏకాదశి వస్తుంది. అయితే, వీటన్నింటిలోకి ఆషాఢశుద్ధ ఏకాదశిని అత్యంత పుణ్యప్రదమైనదిగా పరిగణిస్తారు. ఈ పండగను హరిశయని, దేవశయని, ఆషాఢ ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే తొలి ఏకాదశి హిందువులకు తొలి పండుగ. పురాణాల ప్రకారం, దశమి రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండటం ప్రారంభిస్తారు భక్తులు. ఉపవాసం, జాగరణ చేస్తూ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆచారం ప్రకారం ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసుకుని స్వామి తీర్థప్రసాదాలను సేవించి ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా చేయడం వల్ల స్వామి అనుగ్రహం దక్కి సర్వపాపాలు తొలగిపోయి వైకుంఠప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్లే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలు ప్రాప్తించాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.
ఉపవాసం ఎందుకు చేస్తారు?
తొలి ఏకాదశి అంటే అసలైన అర్థం పదకొండు అని అర్థం. ఇవాళ ఉపవాసం చేయడం ద్వారా ఐదు జ్ఞానేంద్రియాలు (కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం), ఐదు కర్మేంద్రియాల (నోరు, చేతులు, కాళ్ళు, పాయువు, జననేంద్రియాలు)ను మనసు అనే ఆయుధంతో ఒకతాటిపైకి తెచ్చేందుకు సాధ్యమవుతుంది. తద్వారా ఇంద్రియ నిగ్రహం పెరిగి రోగాలు దరిచేరవు. ఈ సమయంలో ప్రకతిలో వచ్చే మార్పులను శరీరం తట్టుకుని నిలబడేందుకు ఈ దీక్షను పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి ఏకాదశి రోజున ఉపవాసం మనిషిలో బద్ధకాన్ని తొలగిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ శుద్ధి జరిగి శరీరం ఉత్తేజితమవుతుంది. శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మోక్ష సిద్ధి పొందుతారని అంటారు. అలాగే తొలి ఏకాదశి నాడు పేలాలు, బెల్లం, యాలకులు కలిపి తినే ఆచారముంది. ఇది ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.