Share News

Hyderabad: తీరని విషాదం...‘ఉమ్రా’ ఘటనతో ఉలిక్కిపడిన హైదరాబాద్‌

ABN , Publish Date - Nov 18 , 2025 | 08:52 AM

ఉమ్రాయాత్ర ప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సోమవారం తెల్లారేసరికి ప్రమాద వార్త విని నగరవాసులు ఉలిక్కిపడ్డారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టిన ఘటనలో నగరానికి చెందిన 45 మంది మరణించడంతో సిటీ జనులు దిగ్బ్రాంతి కి గురయ్యారు.

Hyderabad: తీరని విషాదం...‘ఉమ్రా’ ఘటనతో ఉలిక్కిపడిన హైదరాబాద్‌

- శోకసంద్రంలో విద్యానగర్‌, మల్లేపల్లి, బజార్‌ఘాట్‌, ఆసిఫ్ నగర్‌ ప్రాంతాలు

- కన్నీటి పర్యంతమైన మృతుల కుటుంబసభ్యులు, బంధువులు

- స్నేహితుల మరణంతో ఆయా పాఠశాలల్లో తోటి విద్యార్థుల వేదన

హైదరాబాద్‌ సిటీ: ఉమ్రాయాత్ర ప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సోమవారం తెల్లారేసరికి ప్రమాద వార్త విని నగరవాసులు ఉలిక్కిపడ్డారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టిన ఘటనలో నగరానికి చెందిన 45 మంది మరణించడంతో సిటీ జనులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనలో విద్యానగర్‌లోని ఒకే కుటుంబానికి చెందిన 18మంది మరణించడం మరింత బాధించింది. దైవ దర్శనానికి వెళ్లిన తమ వారు మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. ఇంటి నుంచి సంతోషంగా వెళ్లిన వారు కానరాని లోకాలకు వెళ్లడంతో కన్నీటి పర్యంతమయ్యారు. మక్కా యాత్రను ముగించుకుని 46 మంది మదీనా(Medina)కు బస్సులో బయలుదేరిన క్రమంలో సోమవారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షోయబ్‌ అనే వ్యక్తి ఒక్కరే బతికి బయటపడగా, 45మంది మృతిచెందారు. వారంతా విద్యానగర్‌, మల్లేపల్లి, బజార్‌ఘాట్‌, ఆసిఫ్ నగర్‌ వాసులేనని తెలియడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఆనందంతో వెళ్లి.. అనంతలోకాలకు..!

ముస్లింలు హజ్‌ కోసం వెళ్లినా, ఉమ్రా కోసం వెళ్లినా.. మక్కాకు బయలుదేరే ముందు రోజు తమ కుటుంబ సభ్యులను పిలుచుకుని అందరూ కలిసి సంతోషంగా గడుపుతారు. ఇతర కుటుంబసభ్యులు అందరినీ కలిసి వీడ్కోలు పలికి వెళ్తారు. ఈనెల 9న హైదరాబాద్‌ నుంచి సౌదీ ఆరేబియాకు వెళ్లిన యాత్రికులు కూడా తమ తమ కుటుంబ సభ్యులందరినీ ఇంటికి పిలుచుకుని సంతోషంగా గడిపారు. అందరినీ అలింగనం చేసుకుని ‘అల్లా కే ఘర్‌ జాకే ఆతే ..’ అని చెప్పి వెళ్లిన వారందరూ తిరిగి రాని లోకానికి వెళ్లారు. ఇంటి నుంచి సంతోషంతో, భక్తిభావంతో ప్రయాణమైన తమ కుటుంబ సభ్యులు మరో వారం రోజుల్లో తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో హఠాత్తుగా ఈ వార్త చెవిన పడడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయమే తమ కుటుంబ సభ్యుల మృతి వార్త విని వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రిని కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుమార్తెలు, మనవరాళ్లు, అల్లుళ్లు, కొడుకు, కోడలు.. ఇలా ప్రతి ఇంటిలో ఒక్కో బంధం తెగిపోయింది. మరో చోట కుటుంబమంతా మరణించడంతో బంధువులంతా కన్నీరుమున్నీరయ్యారు.


city6.jpg

ఒకే కుటుంబంలో 18 మంది మృతి..

సౌదీ ప్రమాదంలో విద్యానగర్‌ ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి ఎస్‌కే నసీరొద్దీన్‌ (70), అతని కుటుంబ సభ్యులు 17మంది మృతిచెందడంతో విద్యానగర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన వారిలో 3 నుంచి పదేళ్ల ఏళ్లలోపు పిల్లలు ఉండడంతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పిల్లల మృతి వార్తను తెలుసుకున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. పలు పాఠశాలల్లో సంతాప కార్యక్రమాలు నిర్వహించారు.


దుబాయ్‌ కోరిక తీరకుండానే..

దుబాయ్‌లో ఉంటున్న సైఫ్‌ ఉర్‌ రెహమాన్‌ టోలీచౌకి మీరాజ్‌ కాలనీలో ఉంటున్న తల్లి రహీయత్‌ బేగంను తీసుకుని దుబాయ్‌ వస్తే దుబాయ్‌ చూయించి ఉమ్రాకు వెళ్దామని తన సోదరుడు మహ్మద్‌ సోయబ్‌ రెహమాన్‌కు సూచించాడు. అయితే మొదట ఉమ్రా పూర్తి చేసుకుని వెళ్దామని సూచించడంతో అంతా మక్కాలో కలుసుకున్నారు. మదీనా వెళ్తుండగా ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. దీంతో సైఫ్‌ఉర్‌ కోరిక నెరవేరకుండానే పోయింది. మీరాజ్‌ కాలనీలోని వారి కుటుంబీకులను కార్వాన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ కౌసర్‌ పరామర్శించి ఓదార్చారు.


అండగా ఉంటాం : ముబీన్‌

పాతబస్తి వట్టేపల్లి ఫాతిమానగర్‌కు చెందిన ముగ్గురు, మిస్రీగంజ్‌కు చెందిన తల్లీ కొడుకు మృతి చెందారన్న వార్త తెలుసుకున్న బహదూర్‌పుర ఎమ్మెల్యే ముబీన్‌ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్పొరేటర్లు మహ్మద్‌ సలీం, మహ్మద్‌ ఖాదర్‌ తదితరులు బాధితుల ఇంటికి వెళ్లి అండగా ఉంటామని భరోసా కల్పించారు. బోరబండకు చెందిన రహీమున్నిసా బేగం నివాసానికి అల్లాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సబిహా గౌసుద్దీన్‌ వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.


city6.3.jpg

సౌదీకి వెళ్లే ఏర్పాట్లు: బలాల

సౌదీ ఘటనలో మృతిచెందిన ముసారాంబాగ్‌ బస్తీకి చెందిన అమీనా బేగం (45), అనీస్‌ ఫాతిమా(25)ల కుటుంబీకులను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల సోమవారం సాయంత్రం పరామర్శించారు. కుటుంబ పెద్ద రషీద్‌ను ఓదార్చి మనోదైర్యంతో ఉండాలని సూచించారు. రషీద్‌తోపాటు అతని కుమారుడు సయ్యద్‌ అబ్ధుల్లా ఇర్షాద్‌ మంగళవారం సౌదీకి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.


ధైర్యం చెప్పిన ఎంపీ కె.లక్ష్మణ్‌

బాధిత కుటుంబ సభ్యులతో ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. సౌదీలో ఎలాంటి అవసరం ఉన్నా, సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. సౌదీకి వెళ్తామంటే అన్ని విధాల సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

city6.2.jpg

ఉపాధ్యాయుల కంటతడి..

మొఘల్‌ఖానాకు చెందిన హమీద్‌(6) మరణవార్త తెలియడంతో న్యూజన్‌ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది చిన్నారి చిత్రపటానికి నివాళులు అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. హమీద్‌తో ఉన్న జ్ఞాపకాలను పాఠశాల కరస్పాండెంట్‌ కాపూరి రవికుమార్‌, ప్రిన్సిపల్‌ హప్సా సుల్తానా, టీచర్‌ శ్వేత గుర్తుచేసుకున్నారు.


పార్టీ పరంగా సహకారం అందిస్తా: గోపాల్‌

సౌదీ ఘటనలో నసీరుద్దీన్‌ సహా మొత్తం 18మంది మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. సోమవారం రాత్రి విద్యానగర్‌లో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీపరంగా, తనవంతు సహకారం అందిస్తామన్నారు. సౌదీ రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర దిగ్ర్బాంతిని కలిగించిందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఎం.నాగేష్‌ ముదిరాజ్‌ పేర్కొన్నారు. విద్యానగర్‌లోని నసీరుద్దీన్‌ కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి దిగుమతులు మూడింతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ కార్లకు భలే డిమాండ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 18 , 2025 | 09:30 AM