AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..
ABN , Publish Date - Nov 22 , 2025 | 10:35 AM
రూ.7 కోట్ల దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా గుడిపాల వాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సైతం ఈ విషయాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. అలాగే ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- నిందితుడి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫ ఇన్నోవాతో పాటు రెండు క్యాష్ బాక్సులు కూడా స్వాధీనం
- రామాపురంలో దొరికిన ఇన్నోవా
చిత్తూరు: బెంగళూరు(Bengaluru)లో కోట్ల రూపాయలు దోపీడీ చేసిన ముఠాలో చిత్తూరు(Chittoor) జిల్లా గుడిపాలకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు గురువారం రాత్రి పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి నిందితుడి తండ్రిని అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకెళ్లారు. మరోవైపు రెండో రోజైన శుక్రవారం కూడా గుడిపాలలో బెంగళూరు పోలీసులు గాలింపు కొనసాగింది.ఓ బ్యాంకు నుంచి ఏటీఎంలలో నింపడానికి తీసుకెళుతున్న రూ.7.11 కోట్ల నగదును బుధవారం బెంగళూరు నగరంలో ఓ ముఠా తాము ఐటీ అధికారులమంటూ బెదిరించి దోపిడీ చేసిన విషయం తెలిసిందే.

ఆ ఇన్నోవా వాహనం బుధవారం రాత్రే గుడిపాల మండలం చిత్తపార గ్రామానికి చేరుకుంది. గురువారం ఉదయం మళ్లీ బయల్దేరుతుండగా, 190.రామాపురం వద్ద టైర్ పంక్చర్ అయింది. దీంతో ఆ ఇన్నోవాను అక్కడే వదిలేసి వెళ్లారు. బెంగళూరు నుంచి 13 మంది పోలీసు అధికారుల బృందం గురువారం గుడిపాలకు చేరుకుని ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. చిత్తపార, 190.రామాపురం గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. చిత్తపార గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి రామదాసుకు రవి, రాకేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరూ బెంగళూరులోనే నివాసం ఉంటున్నారు. రామదాసు ఇద్దరు కుమారుల్లో రవి ఈ దోపిడీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు.
ఈ రవినే ఆ దోపిడీ సొమ్ముతో బుధవారం రాత్రి చిత్తపారకు వచ్చి గురువారం మరో ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. వెళ్లేటప్పుడు రెండు ఇనుప క్యాష్ బాక్సుల్ని రోడ్డు పక్కన గడ్డిలో వదిలేసి వెళ్లారు. గురువారం రామదాసుతో పాటు బంధువుల ఇళ్లలోకూడా బెంగళూరు పోలీసులు తీవ్రంగా గాలించారు. రవి ఆచూకీ లేకపోవడంతో అతని తండ్రి రామదాసును అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల్ని చిత్తూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం బెంగళూరు పోలీసులు ప్రకటించారు.

బెంగళూరు నగరంలోని బాణసవాడి, కల్యాణనగర ప్రాంతాలకు చెందిన ఆరుగురు నిందితులు ఈ దోపిడీకి పాల్పడినట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు బృందాలను పంపినట్లు బెంగళూరు పోలీసు అధికారులు వివరించారు. దొంగలు రెక్కీ చేశాకే, సీసీ కెమెరాలు లేని సర్కిల్ చూసుకుని దోపిడీకి పాల్పడ్డారని అక్కడి పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోషల్ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు
Read Latest Telangana News and National News