AP News: ఊసులాడి.. ఊడ్చేస్తారు.. సోషల్ మీడియాలో కిలేడీ వెబ్‌సైట్ లింకులు
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:42 PM
సోషల్ మీడియా వేదికపై వలపు వలలో పడి యువకులు, పెళ్లైనవారు విలవిలలాడుతున్నారు. స్నేహం, జోడీ పేరిట కనిపించే వెబ్‌సైట్ లింకులను క్లిక్ చేసి.. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. ఇలా ఏదో ఒక మార్గంలో అమ్మాయిల గొంతుతో కేటుగాళ్లు వాయిస్ కాల్స్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు.
- ఓపెన్ చేస్తే అమ్మాయిల గొంతుకతో కాల్స్
- స్నేహం.. ప్రేమ.. పెళ్లి.. పేరిట బురిడీ
- ఏకాంతంగా కలుసుకుందామని మోసాలు
హిందూపురం(అనంతపురం): సోషల్ మీడియా(Social media) వేదికపై వలపు వలలో పడి యువకులు, పెళ్లైనవారు విలవిలలాడుతున్నారు. స్నేహం, జోడీ పేరిట కనిపించే వెబ్‌సైట్ లింకులను క్లిక్ చేసి.. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. ఇలా ఏదో ఒక మార్గంలో అమ్మాయిల గొంతుతో కేటుగాళ్లు వాయిస్ కాల్స్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో అమ్మాయిలే ఇలా మోసగిస్తున్నారు. ‘కలుసుకుందాం.. పెళ్లి చేసుకుందాం.. మాట్లాడుకుందాం..’ అని లైన్‌లో పెట్టి, మాయ చేసి డబ్బులు కాజేస్తున్నారు.
అటువైపు నుంచి వినిపించేది అమ్మాయిల గొంతే అయినా, మాట్లాడుతోందని అమ్మాయే అన్న గ్యారెంటీ లేదు. అయినా పెళ్లికాని యువకులు, పెళ్లి అయిన పురుషులు కూడా ఉచ్చులో పడిపోతున్నారు. సరదాగా వెబ్‌సైట్‌లు తెరిచి.. బుట్టలో పడిపోతున్నారు. గుట్టుగా మాట్లాడుకుంటున్నారు. అటువైపు ఉన్నది అపరిచితులే అయినా.. అడిగిన వెంటనే వేలు.. లక్షలు ఇచ్చేస్తున్నారు. మోసపోయామని తెలుసుకున్నా.. పోలీసులను ఆశ్రయించడం లేదు. అవమానంగా భావించి, స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోవడం లేదు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. నిత్యం వందలాది మందిచిన దోచుకుంటున్నారు. అతి చనువు వెనుక దాగిన అపాయాన్ని పసిగట్టుకుంటే ప్రమాదం తప్పదని పోలీసులు తరచూ హెచ్చరిస్తున్నా చైతన్యం రావడం లేదు.
ఊసులు ఆగిపోయి..
ప్రేమ, పెళ్లి, సహజీవనం పేరుతో విసిరే వలపు వలల వెనుక అమ్మాయిలే ఉన్నారో, కేటుగాళ్లు ఉన్నారో తెలియదు. మాట్లాడుతోంది మనిషో, ఏఐ బొమ్మనో తెలియదు. మంత్రాల్లాంటి మాటలవినిపించగానే ఇక అమ్మాయి దొరికేసింది అన్నట్లు బుట్టలో పడిపోతున్నారు. డబ్బులు కాజేసీన తరువాత అక్కడి నుంచి ఊసులు ఆగిపోగానే అవమాన భారంతో కుమిలిపోతున్నారు. స్నేహం పేరిట మొదలు పెట్టి మాటల్లో ఎక్కడెక్కడికో తీసుకుపోతున్నా అనుమానించడం లేదు. దీనికి కారణం.. సోషల్ మీడియాలో అందమైన యువతుల ఫొటోలతో కేటుగాళ్లు ఖాతాలను నిర్వహించడమే. హిందూపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొన్నాళ్లపాటు ఇదే ప్రాంతానికి చెందిన కొందరికి ఫోన్ కాల్స్ చేసి.. ట్రాప్‌లో పెట్టి దోచేసింది. చివరకు కటకటాలపాలైంది.

చుక్కలు చూపిస్తారు
ట్రాప్‌లో పడినవారికి సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపుతున్నారు. ఏకాంతంగా కలుద్దామని పిలవడం, అక్కడికి వెళ్లగానే తమ కుటుంబ సభ్యులకు అరోగ్యం బాగా లేదనో, ప్రమాదం జరిగిందనో మాయ మాటలు చెప్పడం పరిపాటిగా మారుతోంది. మాటలను నమ్మగానే వైద్యం పేరిట డబ్బులు గుంజుతున్నారు.
పెళ్లి చేసుకుందాం..
సోమందేపల్లికి చెందిన ఓ చేనేత కార్మికుడు వారం క్రితం ఫేస్‌బుక్ చూస్తుండగా ఓ వెబ్‌సైట్ దర్శనమిచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ఓ యువతి ఫోన్‌చేసి పలకరించింది.
మాటలు కలిపింది. ‘నాకు పెళ్లి కాలేదు. చేనేత కార్మికులు అంటే నాకు చాలా ఇష్టం. ఓ చేనేత కార్మికుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా..’ అంది. ఇదంతా నిజమేనని ఆ చేనేత కార్మికుడు అనుకున్నాడు. ‘మీరూ చేనేత కార్మికుడే కదా..? ఓకే అంటే త్వరలోనే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం..’ అని నమ్మించింది. అలా లైన్‌లో పెట్టి.. ఖర్చుల పేరిట రూ.లక్ష దాకా లాగేసుకుంది. ‘ఇంక పెళ్లి చేసుకుందాం రా..’ అని కార్మికుడు ఆహ్వానించగానే.. ‘వచ్చేస్తున్నా..’ అని ఓ తేదీ చెప్పింది. ఆ రోజు నుంచి ఫోన్ కాల్స్ ఆగిపోయాయి. ఆ యువతి వాట్సప్ వాయిస్ కాల్స్ కాకుండా, ఇన్‌స్టా వాయిస్ కాల్స్ చేసి బురిడీ కొట్టించింది.
కలుసుకుందాం రా..!
హిందూపురం(Hindupuram) పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగికి సోషల్ మీడియాలో ఓ వెబ్‌సైట్ లింక్ కనిపించింది. దాన్ని క్లిక్ చేసిన కాసేపటికి ఓ యువతి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆమె సూచనతో రూ.1500 చెల్లించి ఆ వెబ్‌సైట్‌లో సభ్యుడిగా చేరాడు. అక్కడ సరైన జోడీ కోసం వెతుకుతుండగా మరో యువతి ఫోన్‌చేసి పలకరించింది. ఇద్దరి మధ్య కొన్నాళ్లు చాటింగ్, వాట్సప్, ఫోన్‌కాల్స్ కొనసాగాయి. అలా ఫోన్‌లో దగ్గరయ్యారు. ‘మనం కలుసుకుందాం. ఎక్కడైనా రూమ్ బుక్ చెయ్’ అని ఆమె ఊరించింది. ఆ యువకుడు మొహమాటానికి పోయాడు. ‘వద్దులే..’ అన్నాడు.
దీంతో ఆమెనే చొరవ తీసుకుంది. ‘బెంగళూరులో ఓ హోటల్ గది బుక్ చేస్తున్నా.. రూ.10 వేలు’ అంది. మనోడు అలా వలలో పడిపోయాడు. ఆమె బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేశాడు. బెంగళూరుకు చేరుకుని, ఆమె బుక్ చేసినట్లు చెప్పిన హోటల్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమె కనిపించంలేదు. ఫోన్ చేస్తే.. ‘అక్కడ వద్దు.. ఇంకో చోటకు రా..’ అని పిలిచింది. అప్పటికే సమయం ముగియడంతో ‘నాకు వేరే పని ఉంది. ఇంకోసారి కలుద్దాం..’ అని చెప్పి తిరుగుముఖం పట్టాడు. ఆ తరువాత కూడా ఫోన్ సంభాషణలు కొనసాగాయి. ఊరించి.. ఊరించి.. రూ.2 లక్షల దాకా కాజేసింది ఆమె. చివరకు మోసపోయానని అర్థమైంది. బయటకు చెబితే చులకన అవుతానని మౌనంగా ఉండిపోయాడు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News