Anantapur: పెళ్లి కాలేదని నమ్మించి.. విడాకులు పొందిన మహిళతో రెండో పెళ్లి
ABN , Publish Date - Jul 15 , 2025 | 01:06 PM
పెళ్లి కాలేదని నమ్మించి, తనను వివాహం చేసుకుని మోసగించాడని గుంతకల్లు పట్టణానికి చెందిన వీఆర్వో మహ్మద్ అలీపై షేక్ షమీమ్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులతో కలిసి బాధితురాలు న్యాయం కోసం గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులకు ఆశ్రయించారు.

- డబ్బు, బంగారం కాజేసి.. ప్లేటు ఫిరాయింపు
- పోలీసులను ఆశ్రయించిన గర్భిణి
గుంతకల్లు(అనంతపురం): పెళ్లి కాలేదని నమ్మించి, తనను వివాహం చేసుకుని మోసగించాడని గుంతకల్లు పట్టణానికి చెందిన వీఆర్వో మహ్మద్ అలీపై షేక్ షమీమ్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులతో కలిసి బాధితురాలు న్యాయం కోసం గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులకు ఆశ్రయించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు, గుంతకల్లు భాగ్యనగర్‌కు చెందిన పీరాన్ కూతురు షేక్ షమీమ్ బానుకు 2017లో రాయచూర్(Rayachur)కు చెందిన షామీర్‌తో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు అబ్బాస్ అలీ ఉన్నాడు.
దంపతుల మధ్య విభేదాల కారణంగా 2023లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి షమీమ్ తనక కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. రేషన్ కార్డులో తన కుమారుడి పేరు చేర్చాలని గుంతకల్లు మున్సిపాలిటీలోని 24వ సచివాలయంలో ఆమె సుమారు ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేశారు. అక్కడ వీఆర్వో మహమ్మద్ అలీ పరిచయమయ్యాడు. అవసరమైన డాక్యుమెంట్లు తీసుకుని, రెండు రోజుల తరువాత రమ్మని సూచించాడు. ఈ క్రమంలో ఆమె గత జీవితం గురించి తెలుసుకుని పరిచయం పెంచుకున్నాడు.
‘నీకూ మంచి రోజులు వస్తాయి.. బాధపడకు’ అని ఓదార్చాడు. ఇంటి స్థలం, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఆ తరువాత మాయ మాటలు చెప్పి, గత ఏడాది మే 22న అనంతపురానికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం షమీమ్ ఏడు నెలల గర్భిణి. ఈ విషయం తెలుసుకున్న మహమ్మద్ అలీ మొదటి భార్య నూర్జహాన్, ఆమె కుటుంబ సభ్యులు నెల క్రితం షమీమ్ వద్దకు వచ్చి గొడవపడ్డారు. ఆమెను దూషించి, దాడి చేసి వెళ్లారు.
దీంతో మహమ్మద్ అలీకి ఇది వరకే వివాహం జరిగిన విషయం షమీమ్‌కు తెలిసింది. ఈ విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ సమయంలో తన భర్త మహమ్మద్ అలీ, ఆయన మొదటి భార్య, ఆమె అన్నలు, వదినలు తనను అసభ్య పదజాలంతో దూషించారని, తన తండ్రిని చంపేస్తామని బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహమ్మద్ అలి తన బంగారాన్ని యాంకర్ వెల్ఫేర్ బెంగళూరు బ్రాంచిలో తాకట్టు పెట్టి రూ.2 లక్షలు రుణం తీసుకున్నాడని వాపోయారు. ఆ డబ్బులను రెండింతలు చేస్తానని నమ్మించి మోసగించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త, అతని మొదటి భార్య, ఆమె అన్నలు, వదినలపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని వన్‌టౌన్ సీఐ మనోహర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య
Read Latest Telangana News and National News