TTD Gosala Controversy: వైసీపీ డైవర్షన్ రాజకీయం
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:29 AM
వైసీపీ రాజకీయం, దివర్షన్ పాలిటిక్స్‌పై మంత్రుల ఆరోపణలు. జగన్ అక్రమ ఆస్తుల గురించి చర్చ వంచించడానికి గోశాలపై వైసీపీ వివాదాలు పెంచుతోంది

మంత్రులు అనగాని, గొట్టిపాటి, సత్యకుమార్, సవిత థ్వజం
మడకశిర, అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ‘జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తుందనే విషయం తెలిసే టీటీడీ గోశాలపై వైసీపీ రాజకీయం చేస్తోంది. జగన్ అక్రమాల గురించి చర్చ జరగకుండా నీచమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని మంత్రులు అనగాని, గొట్టిపాటి, సవిత, సత్యకుమార్ మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో శుక్రవారం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, భూమి పూజలలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మట్లాడారు. మంత్రి అనగాని మాట్లాడుతూ, ‘ఉమ్మడి అనంతపురం జిల్లాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. సోలార్ ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో దాల్మియా ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకొని డైవర్షన్ రాజకీయాలకు వైసీపీ నాయకులు తెరతీశారు. ప్రతి గోవుకు జియో ట్యాగింగ్ చేశాం. గో సంరక్షణ భేషుగ్గా ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థల్లో జరిగిన అవినీతిని వెలికి తీస్తాం. దోషులను కఠినంగా శిక్షిస్తాం’ అన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ, మడకశిర నియోజకవర్గంలోని చివరి ఎకరాకు కూడా సాగునీరు అందిస్తామని అన్నారు.
మడకశిరలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం మరో మూడు సబ్‌స్టేషన్‌లను మంజూరు చేశామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. తమ అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని గ్రహించి ప్రజల దృష్టిని మళ్లించడానికి టీటీడీ గోశాలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ప్రశాంతంగా ఉన్న తిరుమలలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి.నరసింహ యాదవ్ విమర్శించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఏకవచనంతో సంబోధించిన రోజా వెంటనే యాదవ సామాజికవర్గానికి క్షమాపణ చెప్పాలని నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు.