Yoga Andhra: ఆనంద యోగాంద్ర
ABN , Publish Date - Jun 22 , 2025 | 06:05 AM
యోగాంధ్రలో పాల్గొనేందుకు తెల్లవారుజాము నుంచే ప్రజలు భారీగా చేరుకున్నారు. కంపార్టుమెంట్లలోకి చేరుకున్న వారికి మ్యాట్, టీ షర్ట్, స్నాక్స్, వాటర్ బాటిల్ అందించారు.

అఖిల ప్రపంచం యోగ ముద్ర వేసింది!
ఆసేతు హిమాచలం యోగమయమైంది!
ఆంధ్ర... ఆనంద యోగాంధ్రగా మారింది!
శనివారం ‘అంతర్జాతీయ యోగా దినోత్సవ’ వేడుక సంరంభంగా జరిగింది. ప్రధాని మోదీ పాల్గొన్న ప్రధాన కార్యక్రమం విశాఖలో ఆహ్లాదకర వాతావరణంలో అట్టహాసంగా సాగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు యోగాసనాలు వేశారు. విశాఖ రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి దాకా సుమారు 30 కిలోమీటర్ల పొడవునా, తీరం వెంబడి 3 లక్షల మందికిపైగా ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో సూరత్‌లో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును బద్దలు కొట్టారు. తూర్పు తీరంలో యుద్ధ నౌకలపై నావికుల నుంచి, మారుమూల గ్రామాల్లోని బడి పిల్లల దాకా... మైదానాలు మొదలుకొని రహదారుల దాకా ఊరూవాడా యోగమంత్రం జపించారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందికిపైగా యోగా చేశారు. ‘యోగాంధ్ర’ విజయవంతంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మొత్తానికి నెలరోజుల ప్రణాళిక, వారం రోజుల పకడ్బందీ కార్యాచరణ ఫలించింది. ‘యోగాంధ్ర’ ఘనంగా విజయవంతమైంది!
యోగాసనాలు వేసిన మోదీ, బాబు, పవన్
ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రసంగాలు పూర్తయిన తరువాత వేదిక దిగి వచ్చి ప్రజల మధ్య కూర్చొన్నారు. దాదాపు దాదాపు 50 నిమిషాల పాటు వారందరితో కలిసి యోగా చేశారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ చెప్పిన ఆసనాలన్నీ వేసి వారు ముగ్గురు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వీరితో పాటు వెనుక మరో కంపార్టుమెంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసనాలు వేశారు. కొందరు కొన్నింటిని చేయలేక అచేతనంగా ఉండిపోయారు. మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌లు కూడా ఆసనాలు వేశారు.
యోగాంధ్ర సైడ్ లైట్స్
యోగాంధ్రలో పాల్గొనేందుకు తెల్లవారుజాము నుంచే ప్రజలు భారీగా చేరుకున్నారు.
కంపార్టుమెంట్లలోకి చేరుకున్న వారికి మ్యాట్, టీ షర్ట్, స్నాక్స్, వాటర్ బాటిల్ అందించారు.
మహిళలు, చిన్నారులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో యోగాంధ్రలో భాగస్వామ్యులయ్యారు.
విశాఖలో అనేకమంది కుటుంబాలతో సహా యోగా వేడుకల్లో పాల్గొన్నారు.
మహిళలు పిల్లలతో కలిసి ఆసనాలు వేశారు.
యోగా వేడుకల్లో వివిధ సంస్థలకు చెందిన వలంటీర్లు వందలాది మంది సేవలు అందించారు.
ఏయూలో చదువుతున్న విదేశీ విద్యార్థులు యోగా వేడుకల్లో పాల్గొన్నారు.
కొన్నిచోట్ల కంపార్ట్‌మెంట్లలోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురుకావడంతో వీలు దొరికినచోట్ల పలువురు యోగాసనాలు వేశారు.
కొన్ని కంపార్టుమెంట్లతో స్ర్కీన్లు దూరంగా ఉండడంతో ఆసనాలు వేయడం ఇబ్బందయ్యింది.
కొన్నిచోట్ల మ్యాట్ల పంపిణీ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. కొంతమంది రెండు, మూడు మ్యాట్లు తీసుకెళ్లారు.