Share News

Climate Change : పసిఫిక్‌లో బలహీన ‘లానినా’

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:45 AM

గతేడాది జూన్‌లో వచ్చిన తటస్థ పరిస్థితులు జనవరి ద్వితీయార్థం వరకూ కొనసాగి, తర్వాత బలహీన లానినా ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Climate Change : పసిఫిక్‌లో బలహీన ‘లానినా’

  • ఏప్రిల్‌ వరకు కొనసాగే అవకాశం..

  • ఫిబ్రవరిలో ఎక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం

  • ఉత్తరాదిలో గోధుమ, ఆవాలు, యాపిల్‌ పంటలపై ప్రభావం

  • ఏపీలోనూ అధిక ఉష్ణోగ్రతలు

విశాఖపట్నం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పసిఫిక్‌ మహాసముద్రంలో ‘లానినా’ ఏర్పడింది. గతేడాది జూన్‌లో వచ్చిన తటస్థ పరిస్థితులు జనవరి ద్వితీయార్థం వరకూ కొనసాగి, తర్వాత బలహీన లానినా ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భూమధ్యరేఖకు ఆనుకుని పసిఫిక్‌ మహాసముద్రంలో బలహీన లానినా ఉందని, ఇది ఏప్రిల్‌ వరకూ కొనసాగుతుందని, తర్వాత తిరిగి తటస్థ పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. లానినా ప్రభావంతో మధ్య, తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో తూర్పు పసిఫిక్‌ మహాసముద్రం నుంచి భారత ఉపఖండంపైకి తేమగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల భారత్‌లో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎండలు ఒక మోస్తరుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే స్థానిక పరిస్థితులు ప్రభావం ఉన్నప్పుడు మాత్రం ఎండలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. బలహీన లానినా ఏప్రిల్‌ వరకు కొనసాగుతుందని ప్రస్తుతం చెబుతున్నా... వచ్చే రెండు, మూడు వారాల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది ఆగస్టులోనే లానినా వస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ, ఆస్ట్రేలియా, ఐఎండీ చెప్పినప్పటికీ ఆరు నెలల తర్వాత అది కూడా బలహీన లానినా ఏర్పడింది. ఆరు నెలలుగా లానినా గోడమీద పిల్లిలా ఉందని వాతావరణ అధికారి ఎస్‌.జగన్నాథకుమార్‌ విశ్లేషించారు. భూమధ్యరేఖకు ఆనుకుని పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే ‘ఎల్‌నినో’, తక్కువగా ఉంటే ‘లానినా’, సాధారణంగా ఉంటే తటస్థ పరిస్థితులుగా చెబుతారు.


ఫిబ్రవరిలో ఎండ తీవ్రత ఎక్కువే..!

ఫిబ్రవరికి సంబంధించి వాతావరణ పరిస్థితులపై శుక్రవారం ఐఎండీ బులెటిన్‌ విడుదల చేసింది. పశ్చిమ, దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు దక్షిణ, వాయవ్య భారతంలో కొద్ది ప్రాంతాలు తప్ప దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదుకానున్నాయి. ఫిబ్రవరిలో శీతల గాలులు (కోల్డ్‌ వేవ్స్‌) సాధారణం కంటే తక్కువగా సంభవించనున్నాయి. అంటే ఫిబ్రవరిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాదిలో జమ్ము కశ్మీర్‌ నుంచి దిగువన ఉత్తరప్రదేశ్‌ వరకూ ఏడు వాతావరణ సబ్‌ డివిజన్లు... తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌/లద్దాఖ్‌లలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకానుంది. సాధారణంగా ఫిబ్రవరిలో 65 మి.మీ.లు వర్షపాతం కురవాలి. ఈసారి తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున ఈ ఏడు సబ్‌డివిజన్లలో గోధుమ, ఆవాలు, బఠాణీలు, యాపిల్‌, ఇతర ఉద్యానవన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, ఏపీలోనూ ఫిబ్రవరిలో ఎండలు స్వల్పంగా పెరుగుతాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. కోస్తాలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా, రాయలసీమలో తక్కువగా నమోదవుతాయి. వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువగా నమోదవుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.


పెరిగిన ఎండలు.. కర్నూలులో 36.6 డిగ్రీలు

రథసప్తమి రాక ముందే రాష్ట్రంలో ఎండ చుర్రుమనిపిస్తోంది. శుక్రవారం రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల ఎండ పెరిగింది. చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 36.6డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువగా, మరికొన్నిచోట్ల ఎక్కువగా నమోదయ్యాయి. తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో తూర్పుగాలులు కొనసాగుతున్నందున రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, సీమల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - Feb 01 , 2025 | 03:45 AM