Share News

Reservoir Levels: నీటి లెక్క తేలింది!

ABN , Publish Date - Feb 27 , 2025 | 02:43 AM

ఉన్న నీటి నిల్వలను మే, జూన్‌ వరకు ఎవరెవరు ఎంతెంత వాడుకోవాలో ఆంధ్ర, తెలంగాణ చీఫ్‌ ఇంజనీర్ల కమిటీ నిర్ధారించింది.

 Reservoir Levels: నీటి లెక్క తేలింది!

  • తెలంగాణకు 63 టీఎంసీలు.. ఏపీకి 55

  • కృష్ణా జలాలపై 2 రాష్ట్రాల సీఈల ఏకాభిప్రాయం

  • మే, జూన్‌ నెలల్లో నీటి అవసరాలపై నివేదిక

  • నేడు కృష్ణా బోర్డు సమావేశంలో తుది నిర్ణయం

  • గత రెండ్రోజులుగా హైడ్రామా

అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలను మే, జూన్‌ వరకు ఎవరెవరు ఎంతెంత వాడుకోవాలో ఆంధ్ర, తెలంగాణ చీఫ్‌ ఇంజనీర్ల కమిటీ నిర్ధారించింది. పంటలు కాపాడుకోవడానికి, తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 63 టీఎంసీలు, ఏపీకి 55 టీఎంసీలు అవసరమని అంచనా వేసింది. ఈ వివరాలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి నివేదిక సమర్పించింది. బోర్డు గురువారం హైదరాబాద్‌ జలసౌధలో సమావేశమై ఈ నివేదిక ఆధారంగా రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను ఏ మేర కేటాయించాలో ఖరారు చేయనుంది. వాస్తవానికి మంగళ, బుధవారాల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ నెల 24న జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల తాగు, సాగు నీటి అవసరాల వాస్తవ అంచనాకు రెండు రాష్ట్రాల సీఈలతో బోర్డు కమిటీని వేసింది. అయితే మంగళవారమే వారు భేటీ అవ్వాల్సి ఉండగా.. తెలంగాణ సీఈ హాజరు కాలేదు. దీంతో బుధవారం సమావేశం జరిగింది. తెలంగాణ తరఫున నల్లగొండ చీఫ్‌ ఇంజనీర్‌ వి.అజయ్‌కుమార్‌, ఏపీ తరఫున ఒంగోలు చీఫ్‌ ఇంజనీర్‌ బి.శ్యామ్‌ ప్రసాద్‌ జలసౌధలో కలిసి.. ప్రస్తుత రబీలో సాగర్‌ నుంచి ఇరు రాష్ర్టాలకు అవసరమైన సాగునీటితో పాటు జూన్‌ నెల వరకు తాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రణాళికను సిద్థం చేశారు. కనిష్ఠ నిల్వ మట్టానికి ఎగువన శ్రీశైలంలో 36.51 టీఎంసీలు, సాగర్‌లో 30.57 టీఎంసీలు.. మొత్తం 67 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చారు. శ్రీశైలం జలాశయం పరిధిలో ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 13 టీఎంసీలు.. సాగర్‌ కింద ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 50 టీఎంసీలు.. మొత్తంగా ఆంధ్రకు 55 టీఎంసీలు, తెలంగాణకు 63 టీఎంసీలు అవసరమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు బోర్డుకు నివేదిక ఇచ్చారు. గురువారం జరిగే రెండో అత్యవసర సమావేశంలో కృష్ణా బోర్డు ఈ ప్రణాళిక ఆధారంగా రెండు రాష్ర్టాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది.


బోర్డుపై తెలంగాణ ఒత్తిడి..

మంగళవారంనాటి సమావేశానికి తెలంగాణ సీఈ హాజరుకాకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జలసౌఽధలో భేటీ అవ్వాలని ఏపీ, తెలంగాణ చీఫ్‌ ఇంజనీర్లు నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే.. బుధవారం సాయంత్రం 4 గంటలకు బోర్డు సమావేశం పెడదామని ఆంధ్ర ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫ (ఈఎన్‌సీ) ఎం.వెంకటేశ్వరరావుకు అతుల్‌ జైన్‌ ప్రతిపాదించారు. అయితే సీఈల తుది నిర్ణయం ఏమిటో తెలుసుకోకుండా.. ఆదరాబాదరాగా ఎలా సమావేశమవుతామని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. చీఫ్‌ ఇంజనీర్ల సమావేశం తర్వాతే దీనిపై చర్చించుకుంటామని తేల్చిచెప్పారు. ఆయన ఇదే విషయాన్ని తెలంగాణ ఈఎన్‌సీకి కూడా వివరించారు. బుధవారం చీఫ్‌ ఇంజనీర్లు సమావేశం కానున్నారని.. పైగా శివరాత్రి పర్వదినం అయినందున గురువారమే భేటీ అవుదామని వెంకటేశ్వరరావు కోరడంతో తెలంగాణ ఈఎన్‌సీ ఆమోదం తెలిపారు. బుధవారం సీఈల సమావేశం ముగియగానే.. వెంటనే బోర్డు సమావేశం పెట్టాలని తెలంగాణ కేఆర్‌ఎంబీని కోరింది. నీటి కేటాయింపులపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి పెంచింది. దీంతో హైదరాబాద్‌కు ప్రత్యక్షంగా రాలేకపోయినా.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా గానీ.. టెలికాన్ఫరెన్సులో గానీ హాజరుకావాలని వెంకటేశ్వరరావును జైన్‌ కోరారు. శివరాత్రి సందర్భంగా తాను కోవెలకు వచ్చానని.. గురువారం ప్రత్యక్షంగా హాజరవుతానని వెంకటేశ్వరరావు చెప్పారు. దీనికి జైన్‌ అంగీకరించారు. గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ జలసౌధలోని కేఆర్‌ఎంబీ కార్యాలయంలో భేటీ కావాలని నిర్ణయించారు.


అత్యవసర భేటీ అంటూ..

ఇంకోవైపు.. అత్యవసరంగా కలవాలంటూ జైన్‌తో తెలంగాణ నీటిపారుదల కార్యదర్శి రాహుల్‌ బొజ్జా భేటీ అయ్యారు. కృష్ణా జలాల్లో కేటాయింపుల కంటే ఎక్కువగా ఏపీ వాడేసిందని మరోసారి ఫిర్యాదు చేశారు. సాగర్‌లో అందుబాటులో ఉన్న జలాల్లో ఆ రాష్ట్రానికి వాటా రాదన్నారు. మే, జూన్‌ నెలల్లో సాగుకు, తాగునీటికి ఇండెంట్‌ పెట్టే హక్కు దానికి లేదని చెప్పారు. ఏపీ వాదనలు సరైనవే అయితే సమావేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పండుగ నాడు కూడా కేఆర్‌ఎంబీతో భేటీకి వచ్చామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపై ఆసక్తి ఉంటే ఎందుకు ఆన్‌లైన్‌లో హాజరు కాలేదని ప్రశ్నించారు. కాగా.. గురువారం భేటీలో నీటి వాడకంపై వైఖరిని ఆంధ్ర మరోసారి స్పష్టం చేయనుంది. వరద నీటిని మాత్రమే వాడుకున్నామని గణాంకాలతో వెల్లడించేందుకు సమాయత్తమవుతోంది.

Updated Date - Feb 27 , 2025 | 02:43 AM