Vote Counting: ‘ఎమ్మెల్సీ’ ఓట్ల లెక్కింపు నేడే
ABN , Publish Date - Mar 03 , 2025 | 03:18 AM
రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలకు గత నెల 27న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

ఒక ఉపాధ్యాయ, 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు గత నెల 27న పోలింగ్
నేటి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
మొదటి ప్రాధాన్య ఓటుతో నెగ్గకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ
తదుపరి ప్రాధాన్య ఓటు మేరకు విజేతను ప్రకటించనున్న అధికారులు
ప్రక్రియ పూర్తికి సుదీర్ఘ సమయం.. షిఫ్టుల వారీగా లెక్కింపు సిబ్బంది సిద్ధం
ఏలూరు/గుంటూరు/విశాఖపట్నం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలకు గత నెల 27న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ నాయకులతోపాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయస్థానంలో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు స్థానాల్లోనూ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపించింది. సోమవారం జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌కు ఆయా జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, ఈ లెక్కింపు ప్రక్రియ రోజురోజంతా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఓట్ల లెక్కింపు క్లిష్టం
పట్టభద్రుల ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు మాత్రమే వినియోగించారు. నిబంధనల ప్రకారం పోలైన ఓట్లలో చెల్లనివి పక్కన పెడతారు. మిగిలిన ఓట్లలో 50 శాతం పైబడి మొదటి ప్రాధాన్య ఓటు ఏ అభ్యర్థికి లభిస్తుందో.. వారినే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్య ఓటు మార్కును చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. రెండో ప్రాధాన్య ఓటుని లెక్కిస్తారు. అప్పుడు కూడా సగం కంటే తక్కువగా ఉంటే తర్వాతి ప్రాధాన్య ఓటును పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల గెలు పు, ఓటముల్లో మొదటి ప్రాఽధాన్యత ఓటుతో పాటు ఇతర ప్రాధాన్యతా ఓట్లు కూడా కీలకమవుతాయి. ప్రాధాన్యతా ఓట్లను బట్టి ఫలితం నిర్దేశించాల్సి ఉన్నందున ఈ ప్రక్రియలో జాప్యం తప్పకపోవచ్చని భావించి ఆ మేరకు షిప్టుల వారీగా లెక్కింపు సిబ్బందిని సిద్ధం చేశారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ పక్షాన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవుల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా బలమైన పోటీ ఇస్తున్నారు. 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఏలూరులోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరులోని ఏసీ కళాశాలలో జరగనుంది. 2,41,502 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సాయంత్రానికే ఉత్తరాంధ్ర ఫలితం!
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. మొత్తం 22,493 మంది ఓటర్లు ఉండగా 20,794 మంది(92.45 శాతం) ఓటు వేశారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలితే సాయంత్రం 6 గంటల తర్వాత విజేత పేరు ప్రకటిస్తారు.