Share News

Rajam- Visakha Road Problems: రహదారి కాదు.. నరకానికి దారి.. అక్కడి ప్రజల కష్టాలు తీరేదెప్పుడు..

ABN , Publish Date - Feb 27 , 2025 | 01:05 PM

విజయనగరం జిల్లా రాజాం నుంచి విశాఖ వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. విస్తరణ పేరిట ఏళ్ల తరబడి వాహనదారుల కళ్లల్లో దుమ్ము కొడుతున్న రోడ్లు ప్రజలకు శాపంగా మారుతున్నాయి.

Rajam- Visakha Road Problems: రహదారి కాదు.. నరకానికి దారి.. అక్కడి ప్రజల కష్టాలు తీరేదెప్పుడు..
Rajam- Visakhapatnam Road

విజయనగరం: అది కేవలం ఐదు కిలోమీటర్ల రహదారి మాత్రమే. కానీ, ఆ రోడ్డుపై ప్రయాణిస్తే మాత్రం బతికి ఉంటారనే గ్యారెంటీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. దాన్ని రహదారి అనే కంటే నరకానికి దారి అంటే సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఆ రోడ్డు అంత అధ్వానంగా తయారవ్వడానికి కారణాలేంటి?. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా గత పాలకులకు చీమకుట్టినంతైనా ఎందుకు అనిపించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


విజయనగరం జిల్లా రాజాం నుంచి విశాఖ వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. విస్తరణ పేరిట ఏళ్ల తరబడి వాహనదారుల కళ్లల్లో దుమ్ము కొడుతున్న రోడ్లు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. రాజాం పట్టణానికి ఆనుకుని ఉన్న కొత్తవలస నుంచి చీపురుపల్లి వరకూ ఉన్న ఐదు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి విస్తరణ పనులు.. మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఐదు కిలోమీటర్ల దూరమే అయినప్పటికీ.. ఈ ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే చాలు ఇక నరకానికి నడక మెుదలెట్టినట్లే అంటున్నారు ఇక్కడి ప్రజలు.


రాజాం- విశాఖ ప్రధాన మార్గంలో సుమారు ఐదు కిలోమీటర్ల రహదారి విస్తరణకు గత ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. అయితే కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ మాత్రం సుమారు రెండేళ్లు గడుస్తున్నా ఇంకా పనులు ప్రారంభించలేదు. కాంట్రాక్టర్‌తో పనులు చేయించే విధంగా ఆర్ అండ్ బీ అధికారులు చొరవ చూపలేదు. ఫలితంగా రాజాం- విశాఖ మధ్య నిత్యం రాకపోకలు సాగించే వందలాది వాహనదారులు నరకయాతన పడుతున్నారు. రహదారి ఎక్కడికక్కడే గోతులమయంగా మారింది. కొన్నిచోట్ల రహదారికి ఇరువైపులా భారీ గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుంతలు లేని రహదారుల కార్యక్రమంలోనూ నిధుల మంజూరుకు ఈ రహదారి నోచుకోలేదు.


గత ప్రభుత్వంలో కమీషన్ల కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెరగడంతో సదరు కాంట్రాక్టర్ పనులను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. సకాలంలో రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. కూటమి ప్రభుత్వం గుంతల రహదారులు ఉండకూడదన్న ఆలోచనతో రాజాం నియోజకవర్గంలో పలు రహదారుల అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. అయితే ఇప్పటికే ఈ రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి. పాత కాంట్రాక్టు రద్దు చేయకపోవడంతో కొత్త పథకంలో చోటు దక్కలేదు. దీంతో నాటి ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది.


పారిశ్రామిక పట్టణంగా అభివృద్ధి చెందుతున్న రాజాంలోని ఈ రోడ్డు పరిస్థితి చూసిన ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ రోడ్డుపై ప్రయాణించిన చాలా మంది మహిళలు.. నడిరోడ్డుపైనే ప్రసవం అయిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. అడుగుకో గుంత, ఊపిరి సలపని దుమ్ముతో ప్రజలు నిత్యం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.


మరోవైపు విద్యార్థులు చదువుల కోసం నిత్యం ఈ రహదారిపైనే ప్రయాణించాల్సిన పరిస్థితి. ఇక రాత్రివేళ పరిస్థితి నరకానికి దారి లాంటిదే. రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా రాత్రవేళ్లల్లో ప్రయాణాలు చేయాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు ఏడాది క్రితం మంజూరైన రహదారి పనుల్ని కాంట్రాక్టర్ ప్రారంభించకపోయినా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. కనీసం గత ప్రభుత్వంలో ప్రారంభం కాని పనుల రద్దుకూ సిఫార్సు చేయకపోవడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందులను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Gold and Silver Prices Today: బ్యాడ్ న్యూస్.. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే..

Home Loans: హోమ్ లోన్ కావాలా.. అయితే ఎస్బీఐ కంటే తక్కువ వడ్డీ రేట్లు ఇక్కడే..

Updated Date - Feb 27 , 2025 | 01:06 PM