Ashok Gajapathi Raju: గవర్నర్‌గా నియామకం.. అశోక్ గజపతి రాజు రియాక్షన్
ABN , Publish Date - Jul 14 , 2025 | 09:41 PM
తనను గోవా రాష్ట్రానికి గవర్నర్‌గా కేంద్రం నియమించడంపై అశోక్ గజపతిరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

విజయనగరం, జులై 14: తానెప్పుడూ అవకాశాల కోసం పరుగెత్త లేదని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. అవకాశాలు వచ్చినప్పుడు బాధ్యతగా వాటిని స్వీకరించానని ఆయన తెలిపారు. గవర్నర్‌గా తన పేరును సీఎం చంద్రబాబు సిఫార్సు చేయడం ఆనందంగా ఉందన్నారు. గోవా నూతన గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతి రాజును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ(సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జాబితాలో అశోక్ గజపతి రాజు ఉన్నారు. అలాగే హర్యానా గవర్నర్‌గా ఆషిం కుమార్ ఘోష్, లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను నియమించారు.
గోవా గవర్నర్‌గా నియమితులు కావడంతో అశోక్ గజపతి రాజు స్పందించారు. విజయనగరంలోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ నియామకంతో తెలుగు వారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత తనపై ఉందన్నారు. ఓటమితో నిరుత్సాహ పడనక్కర్లేదని తెలిపారు. దాని నుంచి పాఠాలు నేర్చుకుని మరింత ఉన్నతంగా ముందుకు వెళ్లొచ్చని పేర్కొన్నారు. గోవా అనగానే మిత్రుడు, కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ గుర్తుకు వస్తారన్నారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు గుర్తు చేసుకున్నారు. కేంద్రం తనను గోవాకు గవర్నర్‌గా నియమించడంపై ఏపీ సీఎం చంద్రబాబుకు అశోక్ గజపతి రాజు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు అశోక్ గజపతి రాజు గవర్నర్‌గా నియమితుల కావడంతో.. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అశోక్ గజపతి రాజుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. అలాగే టీడీపీతోపాటు ఇతర పార్టీల నేతలు సైతం ఆయనకు ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నీ వయస్సు అయిపోయింది.. అందుకే..
ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే
Read Latest AP News And Telugu News