Yoga Event: రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర.. యోగాసనాలు వేసిన అనిత
ABN , Publish Date - Jun 18 , 2025 | 10:08 AM
Yoga Event: హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అని అన్నారు.

Anakapalli Dist: ఎస్ రాయవరం మండలం, రేవు పోలవరం సముద్ర ఒడ్డున (Revu Polavaram Beach ) బుధవారం ఉదయం వేలాది మందితో యోగాసనాలు (Yoga Event) ప్రారంభమయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Minister Anitha) ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. అనిత యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సీటీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్. జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో స్థానికులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ప్రపంచం అంతా విశాఖ వైపే...
ఈ సందర్బంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు అని, అంతర్జాతీయ యోగ దినోత్సవం విశాఖలో నిర్వహించడం ఉత్తరాంధ్రా వాసుల అదృష్టమని అన్నారు. ప్రపంచం అంతా విశాఖ వైపు చూస్తుందని... యోగా జీవితంలో ఒక భాగం అవ్వాలన్నారు. ప్రపంచానికి యోగా భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్ అని, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపిచ్చారు. యోగాపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని హోంమంత్రి అనిత సూచించారు.
ట్రాఫిక్ అంక్షలు...
కాగా సాగరతీరంలో ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంక్షలు విధిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం పోలీసు కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ సహా వివిధ దేశాల ప్రతినిధులు, రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఐదు లక్షల మంది ఈ వేడుకలకు హాజరవుతున్నారని తెలిపారు. భద్రతతో పాటు యోగా కార్యక్రమంలో పాల్గొనే ఔత్సాహికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో కొన్ని రకాల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ ఆర్కే బీచ్‌రోడ్డు (ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్కు హోటల్ జంక్షన్ వరకూ)ను మూసివేయనున్నట్టు తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ఈ నెల 19-21 మధ్య పార్కు హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకూ వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సూచనలు పాటించి పోలీసులకు సహకరించాలని సీపీ బాగ్చి కోరారు.
2వేల సీసీ టీవీ కెమెరాలు..
కాగా విశాఖపట్నం-భీమిలి బీచ్ రోడ్డులో ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం కోసం రెండు వేల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వీఎంఆర్‌డీఏలో ఆమె మంత్రులు అనగాని సత్యప్రసాద్, బాలవీరాంజనేయస్వామి, అచ్చెన్నాయుడు, జనార్దన్‌రెడ్డి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. లక్షలాది మంది హాజరవుతున్నందున ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా కార్యక్రమం కొనసాగేలా చర్యలు చేపట్టామన్నారు. విశాఖ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
మొబైల్, లాప్ టాప్ సమర్పించడానికి కేటీఆర్‌కు డెడ్ లైన్
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్
చిన్నారి ప్రాణం తీసిన బీడీ ముక్క..
For More AP News and Telugu News