Pattabhi Warns On Drugs: ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేశారో .. పట్టాభి వార్నింగ్
ABN , Publish Date - Nov 06 , 2025 | 03:07 PM
వైసీపీ నేతలు యువతకు డ్రగ్స్ సరఫరా చేసి.. రప్పా రప్పా రాజకీయాలు చేయాలని అనుకుంటారా అంటూ పట్టాభి ఫైర్ అయ్యారు. డ్రగ్స్‌పై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.
విశాఖపట్నం, నవంబర్ 6: వైసీపీపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ హయాంలో విశాఖను డ్రగ్స్ అడ్డాగా మార్చారని ఆరోపించారు. వైసీపీ హయాంలో గంజాయి కంటైనర్ , పెద్ద ఎత్తున గంజాయి దొరికేవన్నారు. వైసీపీ నేతల అరాచకాలు ఆగడం లేదని... విశాఖలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండా రెడ్డి డ్రగ్స్‌తో పట్టుబడ్డారని అన్నారు. వైసీపీ యువజన విభాగం డ్రగ్స్ ముఠాగా మారిందని.. రెడ్ హ్యాండెడ్‌గా కొండా రెడ్డి దొరికారంటూ వ్యాఖ్యలు చేశారు. కొండారెడ్డి దొరకగానే వైసీపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇప్పటి వరకు కొండారెడ్డిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో గుడివాడ అమర్నాథ్ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు రేవ్ పార్టీ చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని... విచారణ జరిపిస్తామని అన్నారు. వైసీపీ నేతలు యువతకు డ్రగ్స్ సరఫరా చేసి.. రప్పా రప్పా రాజకీయాలు చేయాలని అనుకుంటారా అంటూ ఫైర్ అయ్యారు. డ్రగ్స్‌పై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. విశాఖలో కానీ, ఎక్కడైనా సరే.. ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే అంతా చంద్రబాబు కృషి వలనే అని అన్నారు. డేటాకి మైండ్ అప్లై చేస్తే... ఏఐ అని జగన్ అంటారా ? ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు అంటూ ఎద్దేవా చేశారు. మొదట గూగుల్ సెంటర్‌ను వైసీపీ నేతలు వ్యతిరేకించారని.. అందరూ ఉమ్ము వేస్తే ఇప్పుడు సమర్థిస్తున్నారని పట్టాభి వ్యాఖ్యలు చేశారు.
పెట్టుబడుల సదస్సుపై...
పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు విశాఖకు వస్తున్నారని పట్టాభి అన్నారు. విశాఖలో 14, 15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను సమీక్షించామని తెలిపారు. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేయడానికి జీవీఎంసీ అద్భుతంగా పనిచేస్తోందని.. మేయర్ పీలా శ్రీనివాసరావును అభినందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని.. మూడు వేల మందికిపైగా ప్రతినిధులు వస్తారని చెప్పారు. పది లక్షల కోట్ల ఒప్పందాలు జరుగుతాయని.. ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా జోరో వెస్ట్ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ఎక్కడా ప్లాస్టిక్ లేకుండా చూస్తున్నామని.. క్లే బాటిల్స్‌ను ఉపయోగిస్తున్నామని కొమ్మారెడ్డి పట్టాభి వెల్లడించారు.