CM Chandrababu Naidu Investment Push: విశాఖలో 20,216 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:59 AM
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు మరో నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి.

50,600 మందికి ఉద్యోగాలు
16,466 కోట్లతో సిఫి డేటా సెంటర్
సత్వ డెవలపర్స్ 1500 కోట్ల పెట్టుబడి
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు మరో నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి. సిఫి, సత్వా, బీవీఎం, ఏఎన్‌ఎ్‌సఆర్ సంస్థలు విశాఖలో రూ. 20,216 కోట్ల పెట్టుబడులతో, 50,600 ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలతో ముందుకు వచ్చాయి. డిజిటల్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీలో ప్రఖ్యాత సంస్థ సిఫి 16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. సత్వ డెవలపర్స్ 1,500 కోట్లు, బీవీఎం ఎనర్జీ 1,250 కోట్లు, ఏఎన్‌ఎ్‌సఆర్ గ్లోబల్ 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన తొమ్మిదో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం ఆ నాలుగు సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అలాగే ఆ సంస్థలకు పారిశ్రామిక విధానం మేరకు రాయితీపై భూములు అప్పగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎస్‌ఐపీబీలో ఆమోదించిన నిర్ణయాలను గురువారం క్యాబినెట్ ముందుంచుతారు. అది ఆమోదముద్ర వేశాక ఆ నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక 4 సంస్థల ప్రాధాన్యం, పెట్టుబడులతో యువతకు లభించే ఉపాధి అవకాశాలు, రాష్ట్రాభివృద్ధిలో ఈ సంస్థల భాగస్వామ్యం వంటి అంశాలను ఎస్‌ఐపీబీలో మంత్రి లోకేశ్ వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పెట్టుబడుల అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. విశాఖలో భూమి లభ్యత తక్కువగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఆర్సెల్లార్ మిట్టల్‌కు భూములు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఈ క్రమంలో విశాఖకు తరలివచ్చే పారిశ్రామిక సంస్థలకు మౌలిక సదుపాయాల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సీఎం చెప్పారు. బెంగళూరు వంటి పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా మారిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కూడా కష్టమవుతోందన్నారు. అందుకే విమానాశ్రయం, రైలు కనెక్టివిటీ, హైవే రోడ్లు, మెట్రో వంటి వాటిపై ముందస్తు ప్రణాళికలు ఉండాలని, దీనికి తగ్గట్లు కార్యాచరణ ప్రణాళికలపై ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. దీనివల్ల మున్ముందు పౌరజీవనంలో ఎలాంటి సమస్యలూ తలెత్తవని సీఎం పేర్కొన్నారు. పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ కంపెనీలకు సమీపంలో ఉద్యోగులు నివాసం ఉండేలా మౌలిక సదుపాయాలను కల్పిస్తే ట్రాఫిక్ సమస్యనూ తగ్గించవచ్చన్నారు. విద్యాసంస్థలు, మాల్స్ వంటివి జనావాసాల సమీపంలోనే ఉంటే ఆర్థిక భారంలేని నగర జీవనం అందుబాటులో ఉంటుందన్నారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!