Air Service launch: విజయవాడ కర్నూలు విమాన సర్వీసు ప్రారంభం
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:01 AM
ఎన్నో ఏళ్ల నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న విజయవాడ విమాన సర్వీసు కల ఎట్టకేలకు నెరవేరింది.

వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఓర్వకల్లు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్ల నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న విజయవాడ విమాన సర్వీసు కల ఎట్టకేలకు నెరవేరింది. ఈ విమాన సర్వీసును ప్రజాప్రతినిధులు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులను పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ బి.నవ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కర్నూలు-విజయవాడ కనెక్టివిటీ ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఇప్పుడు ఈ విమాన సౌకర్యం అనంతపురం జిల్లా ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు.