Share News

Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసు తిరగదోడం

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:09 AM

తుని రైలు దహనం కేసులో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ జీవో 852 రద్దు చేసి అప్పీలకు వెళ్లనట్లు స్పష్టీకరించింది. ఈ చర్యతో కేసు తిరగదోదామని, గందరగోళానికి కారణమైన అప్పీలపై పరిశీలన జరుపాలని ఆదేశించింది.

Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసు తిరగదోడం

  • రాష్ట్రప్రభుత్వం స్పష్టీకరణ

  • అప్పీలుకు అనుమతిస్తూ ఇచ్చిన జీవో రద్దు

  • ‘తుని’ కేసు తిరగదోడం!

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా తుని రైలు దహనం కేసులో నెలకొన్న గందరగోళానికి రాష్ట్రప్రభుత్వం తెరదించింది. రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులో రైల్వే కోర్టు వెలువరించిన తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఉద్దేశం లేదని, కేసును మళ్లీ తిరగదోడే ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) అధికారి ప్రతిపాదనతో అప్పీలుకు వెళ్లాలంటూ సోమవారం హోంశాఖ వెలువరించిన జీవో-852ను ఉపసంహరిస్తూ మంగళవారం మరో జీవో 869ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వెలువడి గందరగోళానికి కారణమైన అప్పీలు జీవో ఫైలు ఎవరి ఆమోదంతో ముందుకు కదిలిందనే విషయమై ఆరా తీసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను అదేశించింది.

ఏం జరిగింది..?: రైల్వే ఆస్తులను సంరక్షించే ఆర్‌పీఎఫ్‌ విభాగం సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ తుని రైలు దహనం కేసులో కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు ప్రతిపాదన పంపారు. పరిశీలించిన ప్రభుత్వ న్యాయవాది.. ఇతర ప్రతిపాదనల తరహాలోనే హోంశాఖకు పంపడంతో యాంత్రికంగా జీవో జారీ అయింది. సదరు బాధ్యులపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తుని వద్ద ‘కాపు గర్జన’ పేరుతో 2016 జనవరి 31న భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభ ముగిసిన వెంటనే ఆయనతో పాటు వైసీపీ నేత దాడిశెట్టి రాజా యువతను రెచ్చగొట్టడంతో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలను తగులబెట్టారు. అప్పట్లో ఆర్పీఎఫ్‌ కేసు నమోదు చేసింది. కేసు విచారణ సందర్భంగా.. ఆర్‌పీఎఫ్‌ అధికారులు ఒక్క సాక్షిని కూడా కోర్టులో ప్రవేశపెట్టలేక పోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. దర్యాప్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైల్వే కోర్టు.. ముద్రగడ, దాడిశెట్టితో పాటు 41 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.

Updated Date - Jun 04 , 2025 | 04:14 AM