Share News

SIT Investigation: సిట్‌ కస్టడీలో మరో ఇద్దరు నెయ్యి కల్తీ నిందితులు

ABN , Publish Date - Apr 27 , 2025 | 03:08 AM

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రెండు కొత్త అరెస్టులు. మొత్తం అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది, వారిని విచారణ కోసం సిట్‌ కస్టడీలో తీసుకున్నారు.

SIT Investigation: సిట్‌ కస్టడీలో మరో ఇద్దరు నెయ్యి కల్తీ నిందితులు

  • మొత్తంగా ఆరుకు చేరిన అరెస్టులు

తిరుపతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఇద్దరు నిందితులను విచారణ నిమిత్తం సిట్‌ అధికారులు జ్యుడిషియల్‌ కస్టడీ నుంచి తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో తొలుత నలుగురు నిందితులను అరెస్టు చేసిన సిట్‌ బృందం తర్వాత మరో ఇద్దరిని అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఏడాది జనవరిలో నలుగురిని అరెస్టు చేయగా.. కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరిని నెల కిందట అరెస్టు చేసినట్టు సమాచారం. ఏ12 హరిమోహన్‌, ఏ15 ఆశిష్‌ అగర్వాల్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు తెలిసింది. హరిమోహన్‌ భోలేబాబా డెయిరీ సీజీఎం అని, ఆశిష్‌ అగర్వాల్‌ నెయ్యి తయారీకి వినియోగించే ముడి పదార్థాల సరఫరా వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. వీరిని విచారించేందుకు సిట్‌ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేయగా.. 24 నుంచి 28 వరకూ... సిట్‌ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతిచ్చింది. తిరుపతి సిట్‌ కార్యాలయంలో వారిని విచారిస్తున్నట్టు తెలిసింది. 28 సాయంత్రం లేదా 29 ఉదయం గానీ వీరిని తిరిగి జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించనున్నట్టు తెలిసింది. వీరి అరెస్టును సిట్‌ అధికారులు గుట్టుగా ఉంచడం గమనార్హం. తొలుత అరెస్టయిన నలుగురి తరఫున హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలైంది. వచ్చేవారం కోర్టు విచారించే అవకాశముంది.

Updated Date - Apr 27 , 2025 | 03:08 AM