Share News

Srisailam laddu: గుడులపైనే గురి

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:24 AM

రాష్ట్రంలో ఆలయాలు, హిందుత్వపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. ప్రధాన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరగనివి జరిగినట్లు.. లేనివి ఉన్నట్లు రోజుకొక అబద్ధపు వదంతిని ప్రచారంలో పెడుతున్నారు...

Srisailam laddu: గుడులపైనే గురి

ప్రధాన ఆలయాల్ని వివాదంలోకి లాగే కుట్ర

  • లడ్డూ ప్రసాదాలపై కావాలనే దుష్ప్రచారం

  • శ్రీశైలం లడ్డూలో బొద్దింక వచ్చిందని యాగీ

  • దుర్గమ్మ లడ్డూలో మేకు ఉందని హడావుడి

  • ఆ ఘటనలు ఫేక్‌ అని తేల్చిన రిపోర్టులు

  • సీసీ కెమెరాల ఆధారంగా గుట్టు రట్టు

  • వైసీపీ మొదలుపెట్టిన దుష్ట సంప్రదాయమిది

  • టీటీడీ గోవులు చనిపోతున్నాయని, అన్నదానం సరిగా లేదని నిన్నామొన్న వైసీపీ హల్‌చల్‌

  • అదే కోవలో తప్పుడు వదంతులు వెలుగులోకి..

(అమరావతి, కర్నూలు - ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆలయాలు, హిందుత్వపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. ప్రధాన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరగనివి జరిగినట్లు.. లేనివి ఉన్నట్లు రోజుకొక అబద్ధపు వదంతిని ప్రచారంలో పెడుతున్నారు. గుడులపై గురిపెట్టి నానాఅల్లరి చేసే దుష్ట సంప్రదాయాన్ని వైసీపీ నేతలు మొదలుపెట్టారు. తిరుపతి, తిరుమల దేవస్థానం గోశాలలో ఆవులు చనిపోతున్నాయని, నిత్యాన్నదాన కార్యక్రమ నిర్వహణ సరిగా లేదంటూ నిన్నామొన్న అల్లరి చేశారు. రామతీర్థంలో శ్రీరాముని విగ్రహానికి తల తీసేసిన ఘటన వైసీపీ హయాంలోనే జరిగింది. ఇదే కోవలో ఆలయాలను వివాదంలోకి లాగుతూ కొన్ని ఉదంతాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల క్రితం విజయవాడ దుర్గమ్మ ప్రసాదంలో మేకు వచ్చిందని హడావుడి చేశారు. నిన్న శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందని యాగీ సృష్టించారు. అయితే, ఈ ఘటనల వెనుక వైసీపీ నేతలున్నారా లేక ఇవి అసాంఘిక శక్తులు, ఆగతాయిల దుశ్చర్యలా అనేది స్పష్టత రావడం లేదు.


నెల్లూరువాసి నిర్వాకం..

శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఓ భక్తుడు సోషల్‌ మీడియాలో గత ఆదివారం ఫేక్‌ ప్రచారం చేశాడు. అదే విషయం ఆయన ఆలయ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన శరత్‌ చంద్ర ఈ నిర్వాకానికి పాల్పడినట్టు దేవస్థాన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. అధికారులు, పోలీసుల కథనం ప్రకారం, శరత్‌ చంద్ర తన మిత్ర బృందంతో కలిసి ఈనెల 28న శ్రీశైల మలన్న దర్శనానికి వచ్చాడు. ఆదివారం ఉదయం దర్శనం అనంతరం మిత్రులందరూ కలిసి ప్రసాద కేంద్రంలో లడ్డూను కొనుగోలు చేశారు. కావాలని శరత్‌ చంద్ర ఆ లడ్డూలోకి మిడతను (బొద్దింక అని ప్రచారం చేశారు) దూర్చాడు. మిత్రులతో కలిసి వెళ్లి లడ్డూ విక్రయ కేంద్రం సిబ్బందితో గొడవపడ్డాడు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వెంటనే స్పందించిన ఈవో శ్రీనివాసరావు ఆలయ అధికారులను అప్రమత్తంచేశారు. అధికారులు ప్రసాదాల తయారీ, లడ్డూ కౌంటర్లతోపాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆయితే ఎక్కడా ఎలాంటి లోపం కనిపించలేదు. అదే విషయం తన నివేదికలో ఈవో స్పష్టం చేశారు. ఆ నివేదికను పరిశీలిస్తే ఆలయాలు, హిందుత్వపై ఏ స్థాయిలో కుట్ర సాగుతుందో తెలిసిపోతోంది. లడ్డూను కొనుగోలు చేసిన తర్వాత, దానిలో బొద్దింకను దూర్చడం సీసీ కెమెరాల్లో నమోదైందని ఆ నివేదిక తెలిపింది.


అది వైసీపీ హయాం వీడియో..

కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో మేకు వచ్చిందని సోషల్‌ మీడియాలో ప్రచారం సాగింది. భక్తుల భద్రత దేవదాయశాఖకు పట్టడం లేదని అప్పట్లో దుమ్మెత్తిపోశారు. అయితే, అసలు విషయం అధికారుల విచారణలో బయటపడింది. వాస్తవానికి ఈ మేకు ఘటన 2019లో జరిగింది. అప్పటి వీడియోను కొంతమంది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ప్రశాంతతకు మారుపేరైన టీటీడీ ఆలయాన్ని తరచూ వివాదంలోకి లాగే ప్రయత్నం జరుగుతోంది. గతంలో స్వామి వారి పింక్‌ డైమండ్‌ పోయిందని మీడియాలో వైసీపీ నేతలు హాల్‌చల్‌ చేశారు. స్వామి ఆభరణాలు మొత్తం తనిఖీలు చేసి అవి నిరాధారణమైన ఆరోపణలని అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం తేల్చేసింది. అసలు పింక్‌ డైమండ్‌ ఉందా అన్న అనమానాలు కూడా ఆనాడు వ్యక్తమయ్యాయి. తిరుమలలో అన్యమత ప్రచారం ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది కావాలనే అన్యమత ప్రచార పుస్తకాలు, వస్తువులను కొండపైకి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నారు. అన్యమత ప్రచారాన్ని ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోని రావడం లేదు. కొన్ని రాజకీయ పార్టీలు, వారి రాజకీయ మనుగడ కోసం ఆలయాలను, లడ్డూ ప్రసాదాలపై దుష్ప్రచారాలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కుట్రలు చేస్తున్నారు.


జాగ్రత్తలు అవసరం...

కుట్రపూరితంగా నిరాధార ఆరోపణలు చేసే వారిపట్ల టీటీడీ, దేవదాయ శాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి. శ్రీశైలం దేవస్థానంలో సీసీ కెమెరాలు ఉండడం వల్లనే లడ్డూలో ఉద్దేశ పూర్వకంగా కీటకాన్ని పెట్టారన్న విషయం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలు లేకపోతే నిజంగానే మిడత వచ్చిందని నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకురావాలి. మరీముఖ్యంగా కేంద్ర పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని భక్తులు సూచిస్తున్నారు. మరోవైపు లడ్డూ, ప్రసాదం తయారీ కేంద్రాల్లో ఫుడ్‌ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఆలయాల్లో ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తే నిరాధారమైన ఆరోపణలకు చెక్‌ పెట్టే అవకాశం ఉంటుంది.

Updated Date - Jul 01 , 2025 | 02:24 AM