Student Assembly Brings Real Democracy: అధ్యక్షా.. అద్భుతః
ABN , Publish Date - Nov 27 , 2025 | 06:01 AM
విద్యార్థుల్లో ఎక్కడా తడబాటు లేదు. సీఎం, స్పీకర్ అక్కడే ఉన్నారన్న బెరుకు వారిలో కనిపించలేదు. తాము మాట్లాడాలనుకున్నది స్పష్టంగా మాట్లాడారు...
స్టూడెంట్ అసెంబ్లీలో అదరగొట్టిన చిన్నారులు
స్పీకర్ ఎన్నికతో పాటు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్
రెండు బిల్లులపై ఆసక్తికర చర్చ.. ఆమోదం
సభను అడ్డుకున్న వారిని ఎత్తుకెళ్లిన మార్షల్స్
విద్యార్థులను టెర్రరి్‌స్టలని ఎలా అంటారు?
మీటర్లు లేకుండా సోలార్ ప్యానెళ్లు పెడితే ఉపయోగం ఉండదని మీకు తెలియదా?
5జీ అంటున్నా.. మీ ప్రభుత్వం 2జీలో బఫరింగ్
సమస్యలపై పాలక పక్షాన్ని నిలదీసిన ప్రతిపక్షం
డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం
బడి పిల్లల బ్యాగుల బరువు తగ్గించాం
సమాధానాలతో దీటుగా తిప్పికొట్టిన ప్రభుత్వం
వీక్షించిన సీఎం చంద్రబాబు, స్పీకర్, మంత్రులు
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో ఎక్కడా తడబాటు లేదు. సీఎం, స్పీకర్ అక్కడే ఉన్నారన్న బెరుకు వారిలో కనిపించలేదు. తాము మాట్లాడాలనుకున్నది స్పష్టంగా మాట్లాడారు. ఇది అసలు అసెంబ్లీనేమో అనే స్థాయిలో స్టూడెంట్ అసెంబ్లీ అత్యంత ఆసక్తికరంగా సాగింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఆవరణలో బుధవారం స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించింది. 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా వ్యవహరించి పలు అంశాలపై చర్చించారు. సాధారణ శాసనసభ తరహాలో ప్రొసీడింగ్స్, ప్రశ్నలు, చర్చలు సాగాయి. అధికార, విపక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే ఎక్కడా హద్దులు దాటలేదు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేలా, ప్రభుత్వం దానిని హుందాగా స్వీకరించేలా కార్యక్రమం నిర్వహించారు. వాస్తవ అసెంబ్లీ తరహాలోనే విద్యార్థులు పలు అంశాలపై స్పష్టంగా మాట్లాడారు. సమస్యలపై ప్రభుత్వ తీరును ప్రతిపక్షం ఎండగడితే, పలు ప్రశ్నలకు ప్రభుత్వం తరఫు నుంచి మంత్రులు దీటుగా సమాధానాలిచ్చారు. ప్రశ్నోత్తరాలు జరిగిన తీరు ఇదీ...
కౌన్సెలింగ్ అంటూ కాలక్షేపం చేస్తున్నారు
కాలేజీ విద్యార్థులు, ద్విచక్ర వాహన ప్రమాదాల గురించి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు రవాణామంత్రి స్పందిస్తూ... కాలేజీ విద్యార్థుల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకుంటున్నామని, కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... ‘మంత్రిగారు కౌన్సెలింగ్, అవగాహన అంటూ కాలక్షేపం చేస్తున్నారు. దురుసుగా వాహనం నడిపేవాడు విద్యార్థి కాదు టెర్రరిస్ట్. ఓట్ల కోసం వారిని పిల్లలు అంటూ వెనకేసుకొస్తారా?’ అని నిలదీశారు. దీనిపై అధికార పక్షం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
మీటర్లు లేని ప్యానెళ్లు ఎందుకు?
సోలార్ ప్యానెళ్లు, వాటికి మీటర్లను అమర్చడం అంశంపై అడిగిన ప్రశ్నకు ఇంధన శాఖ మంత్రి సమాధానమిచ్చారు. సోలార్ ప్యానెళ్లకు మీటర్లు బిగించి దానిని గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘పీఎం సూర్యఘర్‌తో ఉచిత విద్యుత్ రావడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ నెట్ మీటర్ పెట్టడానికి డిస్కంలు నెలల తరబడి సమసం తీసుకుంటున్నాయి. మీటర్ లేకపోతే ఆ విద్యుత్ గ్రిడ్‌కు వెళ్లదని మీకు తెలియదా?’ అని ప్రశ్నించారు.
3.5 లక్షల మంది రైతులకు సాయం
వర్షాలు, తుఫాన్ల కారణంగా పంటలు దెబ్బతిన్న 3.5 లక్షల మంది రైతులకు సాయం అందించామని వ్యవసాయ శాఖ మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాలేజీల్లో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి చెప్పారు.
మీది బఫరింగ్ ప్రభుత్వం
విద్యార్థుల్లో మొబైల్ వ్యసనంపై వందల్లో కేసులు నమోదయ్యాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చిన్మయి అన్నారు. దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యే మాట్లాడుతూ... ‘మంత్రిగారి సమాధానం అద్భుతంగా ఉంది. కేసులు వందల్లో ఉన్నాయట. అంటే కచ్చితమైన లెక్కలు కూడా లేవా. పిల్లలు 5జీ స్పీడ్‌లో ఫోన్లకు అతుక్కుపోతుంటే మీ ప్రభుత్వ చర్యలు 2జీ స్పీడ్‌లో బఫర్ అవుతున్నాయి. మీ పైలట్ సెంటర్లు వచ్చేలోగా విద్యార్థుల భవిష్యత్తు స్విచ్ఛాఫ్ అయిపోదా?’ అని నిలదీశారు.
ఒలింపిక్స్‌లో కోతికొమ్మచ్చి, గోలీలాట
ఒలింపిక్స్- 2036 నిర్వహణకు నిధులు కేటాయించామని క్రీడల శాఖ మంత్రి తెలిపారు. దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యే స్పందిస్తూ... ‘మనవాళ్లు జావొలిన్ విసరడం కంటే కూడా ఒకరిపై ఒకరు బురద బాగా చల్లుకుంటున్నారు. నా సలహా ఏంటంటే కోతి కొమ్మచ్చి, గోలీలాట, గిల్లీదండ ఆటలు పెట్టాలని ఒలింపిక్స్ కమిటీకి లేఖ రాయండి. వాటిలో మనకు గోల్డ్ మెడల్ వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాపై బిల్లు
14 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే బిల్లును సభ ఆమోదించింది. ఆ వయసు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకూడదని మంత్రి అన్నారు. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇది తల్లిదండ్రులకు చట్టపరమైన ఆయుధమన్నారు. ఇది కంపెనీల మెడలు వంచి ‘మా పిల్లల డేటా మీ వ్యాపారం కాదు’ అని ధైర్యం చెబుతుందన్నారు.
మొక్కలు నాటే స్థలమేదీ?
పర్యావరణ పరిరక్షణ బిల్లుపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... ‘ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలనడం బాగుంది.. కానీ అందుకు స్థలం ఎక్కడుంది.శ్లాబులపై నాటమంటారా?.’ అని నిలదీశారు. దీనిపై పర్యావరణ శాఖ మంత్రి స్పందిస్తూ... ‘మొక్కలు అంటే మర్రి చెట్లు కాదు. మొక్కలు నాటే స్థలం ఉంది. లేకపోతే ఇంటి వద్ద అయినా నాటుతారు.’ అని బదులిచ్చారు. అనంతరం ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇకనుంచి అసెంబ్లీలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా, స్టూడెంట్ అసెంబ్లీకి 175మంది ఎంపికైనా వారిలో 43మందికి మాట్లాడే అవకాశంవచ్చింది. సభలో 50శాతం బాలికలు ఉన్నారు.
బాలల భారత రాజ్యాంగం ఆవిష్కరణ
విద్యార్థులకోసం బాలల భారత రాజ్యాంగం పుస్తకాన్ని పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. కార్టూన్ బొమ్మలతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పుస్తకాన్ని సీఎం చంద్రబాబులో ఆవిష్కరించారు. వాటిని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అందించనున్నారు. అనంతరం విద్యార్థులతో చంద్రబాబు ఫొటో దిగారు. వారిని అసెంబ్లీ హాలు సందర్శనకు తీసుకెళ్లారు.
జీరో అవర్ సాగిందిలా...
తుఫానులు, ఇతర విపత్తుల కారణంగా మత్స్య వేట, ఇతర నిషేధాలు విధిస్తే ఆ సమయంలో వారికి ఉపాధి హామీ పని చేసినట్లుగా పరిగణించి ఉపాధి కూలీ అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. జీరో అవర్ సందర్భంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే మాట్లాడుతూ... ‘తుఫానుపై ప్రభుత్వం హడావిడి చేస్తోంది. ఏడు రోజులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వేటనే నిషేధించారా? లేక ఆకలిని కూడా నిషేధించారా?’ అని నిలదీశారు. దీనిపై సీఎం స్పందిస్తూ... ‘మీరు అడిగింది ప్యాకేజీ.. కానీ మేం శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. వేట నిషేధించిన రోజులను ఉపాధి హామీ పనిచేసినట్లుగా పరిగణిస్తాం. అంటే ఇంట్లో ఉన్నా ఉపాధి కూలీ వస్తుంది.’ అని అన్నారు. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం అని స్పీకర్ వ్యాఖ్యానించారు. దీనిపై సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు.
అసలు అసెంబ్లీలానే..!
స్టూడెంట్ అసెంబ్లీ నిజమైన శాసనసభ లాగానే సాగింది. సీఎంనుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, మార్షల్స్‌దాకా అందరూ విద్యార్థులే. సభను ప్రొటెం స్పీకర్ హోదాలో ఓ విద్యార్థి ప్రారంభించారు. ఆయన సభలోకి ప్రవేశించే సమయంలో సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహా అందరూ లేచి నిలబడ్డారు. జాతీయ గీతం అనంతరం స్పీకర్ ఎన్నిక జరిగింది. ఒకే నామినేషన్ రావడంతో స్వాతిని స్పీకర్‌గా ఎన్నుకున్నారు. సీఎం లీలాగౌతమ్, ప్రతిపక్ష నేత సౌమ్మ... స్పీకర్‌ను తీసుకెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. జీరో అవర్ తర్వాత రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారు. పర్యావరణ బిల్లు ఆమోదం సమయంలో విపక్షసభ్యులు పోడియం వద్దకువెళ్లి నిరసన తెలిపారు. ఓ సభ్యుడిని మార్షల్స్ బయటకు ఎత్తుకుని వెళ్లారు. సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు.

సభ ఎలా నిర్వహించాలో తెలిసింది
స్పీకర్‌గా ఎన్నిక కావడం, సీఎం చంద్రబాబు ముందు ఆ రోల్ ప్రదర్శించడం, వారంతా కింద ఉండి వీక్షించడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. మాక్ అసెంబ్లీ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. పిల్లలకు మాక్ అసెంబ్లీ పెట్టినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు. ఇదో గొప్ప అవకాశం.
- ఎస్ స్వాతి. ఏపీ మోడల్ స్కూల్,

శంఖవరం, కాకినాడ చాలా ఆనందంగా ఉంది
నాకు సీఎం పాత్ర ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. నేను, ప్రతిపక్ష నేత తీసుకెళ్లి స్పీకర్‌ను ఆయన స్థానంలో కూర్చోబెట్టడం చాలా బాగుంది. ప్రతి సంవత్సరం మాక్ అసెంబ్లీ నిర్వహించాలి. ఈ కార్యక్రమంతో చాలా నేర్చుకున్నా.
- లీలా గౌతమ్, జడ్పీ ఉన్నత పాఠశాల, బీజేపురం, పార్వతీపురం మన్యం జిల్లా

పెద్దయ్యాక సీఎం కుర్చీ ఎక్కాలనుకుంటున్నా
పెద్దయ్యాక రాజకీయాల్లోకి వద్దామనుకుంటున్నా. ముఖ్యమంత్రినై చంద్రబాబు కుర్చీ ఎక్కాలనుకుంటున్నా. మాక్ అసెంబ్లీలో నేను ప్రొటెం స్పీకర్‌గా పైన కూర్చుని కింద ఉన్న అందరినీ కంట్రోల్ చేయడం నచ్చింది. ఈ అవకాశం కల్పించిన మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు.
- రాజశేఖర్, పూసపాడు ఎస్‌కేవీఎస్ హైస్కూల్ బాపట్ల జిల్లా

జీవితంలో మర్చిపోలేని అనుభూతి
నా జీవితంలో మర్చిపోలేని అనుభూతిని సొంతం చేసుకున్నాను. అసెంబ్లీ, కౌన్సిల్‌ను చూసే అదృష్టం దక్కడం సంతోషంగా ఉంది. మాక్ అసెంబ్లీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మాట్లాడాను.
- గాయత్రి, ఏపీఎ్‌సడబ్ల్యూ స్కూల్, వెల్దుర్తి, కర్నూలు జిల్లా

ప్రతిపక్షం అంటే ప్రశ్నించడమే కాదు..
రాజకీయాల్లో ఎలా ఉంటుందని అనేది మాక్ అసెంబ్లీ ద్వారా తెలిసింది. నాకు ప్రతిపక్ష నేత పాత్ర ఇచ్చారు. ప్రతిపక్షం అంటే ప్రశ్నించడమే కాదు.. సమాధానం కూడా క్లారిటీగా వినాలని తెలిసింది. సభను మాకు ఈ విధంగా చూపించడం సంతోషంగా ఉంది.
- ఎల్ సౌమ్య సాయి జిల్లాప్రజాపరిషత్ ఉన్నత
పాఠశాల, మక్కువ, పార్వతీపురం మన్యం జిల్లా

డాక్టర్‌నై రాజకీయాల్లోకి వస్తా
మాక్ అసెంబ్లీ అనేది మంచి అనుభవం. విద్యా శాఖ మంత్రిగా పాత్ర నిర్వహించాను. ఇంతకుముందు డాక్టర్ కావాలనుకున్నా. ఇక్కడికి వచ్చాక డాక్టర్ అయున తర్వాత కూడా రాజకీయాల్లోకి రావొచ్చని తెలుసుకున్నా.
-ఎ.చిన్మయిశ్రీ, జడ్పీ స్కూలు, తిరుచానూరు, తిరుపతి జిల్లా