AP Chief Secretary Krishnababu: కొవిడ్ పరీక్షల సామర్థ్యం పెంచండి
ABN , Publish Date - Jun 03 , 2025 | 06:31 AM
కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రోజుకు వెయ్యి మందికి పరీక్షలు జరగాలని, అవసరమైన కిట్లు మరియు పీపీఈ కిట్ల సరఫరా గురించి సూచించారు.

ప్రతిరోజు వెయ్యి మందికి పరీక్షలు జరిపే స్థాయికి రావాలి
స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఆదేశాలు
అమరావతి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కొవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. రోజుకు వెయ్యి మందికి కొవిడ్ పరీక్షలు చేసేస్థాయిలో ఏర్పాట్లు ఉండాలని కోరారు. సోమవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో తక్కువ స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని, జ్వరం వంటి రోగ లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. కొవిడ్ పరీక్షలు చేయడానికి అవసరమయ్యే వీటీఎం, ఆర్‌ఎన్‌ఏ, ఆర్‌టీపీసీఆర్ కిట్ల లభ్యతపై కృష్ణబాబు వాకబు చేశారు. పాత జీజీహెచ్‌ల్లో (గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్) రోజుకు వంద చొప్పున, కొత్త జీజీహెచ్‌ల్లో రోజుకు 50 చొప్పున పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నెల రోజులకు అవసరమయ్యే కిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా పీపీఈ కిట్లు, 60 వేలకు పైగా వీటీఎం కిట్లు ఉన్నాయని, ఆస్పత్రుల అవసరాల మేరకు వాటిని అందించాలన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ కమిషనర్ జి.వీరపాండియన్, ఎండీ వి. గిరీశ, డీఎంఈ డాక్టర్ నరసింహం, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.