Share News

SIT : ఇద్దరు టీటీడీ మాజీ ముఖ్యులకు లుకౌట్‌ నోటీసులు?!

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:42 AM

టీటీడీలో ఇదివరకు కీలకంగా వ్యవహరించిన ఇద్దరిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.

 SIT : ఇద్దరు టీటీడీ మాజీ ముఖ్యులకు లుకౌట్‌ నోటీసులు?!

  • లడ్డూ కేసులో అనుమానితుల బ్యాంకు ఖాతాలపై సిట్‌ దృష్టి

  • కాల్‌ డేటా తెప్పించి విశ్లేషించనున్న అధికారులు

  • ఒకరు అధికారి.. మరొకరు పాలకమండలి సభ్యుడు

తిరుపతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ తయారీకి నాణ్యతలేని నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సిట్‌ అధికారులు టీటీడీలో ఇదివరకు కీలకంగా వ్యవహరించిన ఇద్దరిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గత వైసీపీ హయాంలో టీటీడీలో పనిచేసిన ఓ కీలక అధికారితోపాటు, పాలకమండలికి చెందిన ఓ ముఖ్యవ్యక్తికి నోటీసులు జారీ కానున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా ఒప్పందాల్లో ఇప్పటికే సిట్‌ అధికారులు వీరిద్దరి పాత్రను ప్రాథమికంగా నిర్ధారించుకున్నారని, వారు తప్పించుకునే వీలులేకుండా ముందు జాగ్రత్తగా లుకౌట్‌ నోటీసులు జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. గతంలో టీటీడీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన పాలకమండలి సభ్యుడొకరు గత వైసీపీ హయాంలో టీటీడీ ముఖ్య అధికారితో అత్యంత సన్నిహితంగా మెలిగినట్టు సిట్‌ గుర్తించింది. వారి మధ్య పరిచయం బంధుత్వంగా మారే పరిస్థితి కూడా కనిపించింది. ఆ వ్యక్తి నెయ్యి సరఫరాకు సంబంధించిన డెయిరీల తరఫున టీటీడీతో ఒప్పందాలు కుదర్చడంలో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తోంది. ఆ దిశగా వారి ఖాతాలను, ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను పరిశీలిస్తోంది. డెయిరీల నిర్వాహకులు, మధ్యవర్తులు, టీటీడీకి చెందిన అధికార, అనధికారుల మధ్య జరిగిన ఫోన్‌ కాల్‌ డేటాను సేకరించి విశ్లేషించే పనిలో పడింది.

తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లనూ తిరిగి తెప్పించుకున్నారా?

కేసు దర్యాప్తులో సిట్‌ అధికారులు ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించినట్టు సమాచారం. నెయ్యి నాణ్యంగా లేదని టీటీడీ ల్యాబ్‌ రిపోర్టు ఇచ్చినప్పటికీ పాలకమండలికి చెందిన ఓ కీలక వ్యక్తి జోక్యం చేసుకుని ఆ విభాగం నిపుణులతో నెయ్యి నాణ్యత బాగుందంటూ లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ ఇప్పించి దాని ఆధారంగా వెనక్కి పంపిన ట్యాంకర్లను తిరిగి రప్పించి నెయ్యి తీసుకున్నట్టు తెలిసింది. ఆ నెయ్యికి టీటీడీ నుంచీ బిల్లులు బ్యాంకు ద్వారా కాకుండా నగదు రూపంలో చెల్లింపులు చేసినట్టు సిట్‌ గుర్తించిందని తెలిసింది.


నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

కల్తీనెయ్యి కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఈ నెల 9న కల్తీ నెయ్యి కేసులో ఏ2 నుంచీ ఏ5 దాకా నిందితులు రాజశేఖరన్‌, పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, వినయ్‌కాంత్‌ చావడాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి జ్యుడిషియల్‌ కస్టడీలో వున్న వారికి బెయిల్‌ కోసం వారి తరపు న్యాయవాదులు 10న పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై నేడు కోర్టు విచారించనుంది. గత 14 శుక్రవారం నుంచీ ఐదు రోజుల పాటు నిందితులను విచారణ నిమిత్తం సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీ 18న మంగళవారం ముగియనుంది. దీంతో నేడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే!.

నిందితులకు రుయాలో వైద్య పరీక్షలు

కల్తీ నెయ్యి సరఫరా కేసులో అరెస్టయి కస్టడిలీ ఉన్న నలుగురు నిందితులనూ ఆదివారం వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అందరి ఆరోగ్యం బాగానే ఉందని నిర్ధారించారు. అయితే హృదయ సంబంధ సమస్య ఉన్నట్లుగా భావిస్తున్న ఏ2 నిందితుడు ఏఆర్‌ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజశేఖరన్‌కు మత్రం సంబంధిత మందులు వాడాల్సిందిగా సూచించారు. అనంతరం నిందితులను తిరిగి సిట్‌ కార్యాలయానికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..

Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..

Updated Date - Feb 17 , 2025 | 03:43 AM