Simhachalam Temple: అపురూపం అప్పన్న నిజరూపం
ABN , Publish Date - May 01 , 2025 | 05:34 AM
సింహాచలం చందనోత్సవం సందర్భంగా 1.2 లక్షల మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి తరలివచ్చారు. వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులతో సింహగిరి కిక్కిరిసిపోయింది.

చందనోత్సవ వేళ కిక్కిరిసిన సింహగిరి
పోటెత్తిన 1.2 లక్షల మంది భక్తులు
సింహాచలం, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధి చెందిన సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం అర్ధరాత్రికే క్యూలైన్లు కిక్కిరిశాయి. ఈదురుగాలులు, వర్షాన్ని లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో సింహగిరి జనసంద్రమైంది. చందనోత్సవంలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 12.45 గంటలకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం రుత్విగ్వరణం, పంచకలశావాహనం చేశారు. స్వామివారికి మంత్ర పూర్వకంగా కళా విసర్జనం జరిపారు. తర్వాత.. అర్చకులు వెండి బొరిగెలతో ఏడాదిపాటు స్వామివారి పైపూతగా ఉంచిన చందనోత్తరణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రభాత ఆరాధనలు చేసి, షోడశోపచారాలు, మంగళనీరాజనాలు ఇచ్చారు. ఒలుపు చందనాన్ని ఆలయ భాండాగారంలో భద్రపరిచారు. ఆచారం ప్రకారం దేవాలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు దంపతులు, పూసపాటి కుటుంబీకులకు తొలిదర్శనం కల్పించారు. అంతరాలయంలో వారి గోత్రనామాలతో పూజలు చేసి, చందన కిరీటాన్ని శిరస్సున ఉంచారు. శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు చతుర్వేద స్వస్తివచనాలతో ఆశీర్వదించగా, ఈవో కొమ్ముల సుబ్బారావు శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
తెల్లవారుజామున 2.19 గంటలకే పూసపాటి వంశీయుల దర్శనం పూర్తికావడంతో 2.45 గంటల నుంచి భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు అశోక్‌గజపతిరాజు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. రాత్రి 9.30 గంటలకు ఆధ్యాత్మికవేత్త త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి సారథ్యంలో శ్రీవైష్ణవస్వాములు గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున, తిరిగి మధ్యాహ్నం సింహగిరిపై భారీ వర్షం కురిసినప్పటికీ సుమారు 1.2 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..