Share News

Krishna District: రూటు మార్చిన రేషన్‌ మాఫియా

ABN , Publish Date - Apr 28 , 2025 | 03:51 AM

విజయవాడ నుంచి టాంజానియాకు తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని తాజాగా ఫిలిప్పైన్స్‌కు మళ్లిస్తున్న రేషన్‌ మాఫియా, రవాణా మార్గాలు మార్చి అక్రమ రవాణా సాగిస్తోంది. తెలంగాణ నుండి సన్నబియ్యం ఎగుమతి మరియు మాఫియా సిండికేట్‌ దారి మార్చడంతో అక్రమ రవాణాలో కొత్త మార్పులు వస్తున్నాయి

Krishna District: రూటు మార్చిన రేషన్‌ మాఫియా

  • టాంజానియాకు కాకుండా ఫిలిప్పైన్స్‌కు ఎగుమతి

  • తెలంగాణ నుంచి అధికారికంగా అక్కడకు ఎగుమతులు

  • డిమాండ్‌తో అదే మార్గంలో విజయవాడ ‘సిండికేట్‌‘

  • రూట్లు మార్చి, నిఘాను ఏమార్చి అక్రమ రవాణా

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

రేషన్‌ మాఫియా మళ్లీ రూటు మార్చింది. ఇటీవలి వరకు విజయవాడ నుంచి టాంజానియాకు తరలిస్తున్న పేదల బియ్యాన్ని తాజాగా ఫిలిప్పైన్స్‌కు మళ్లిస్తోంది. అక్కడి వాళ్లు మన బియ్యాన్ని కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపిస్తుండటంతో మాఫియా ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఫిలిప్పైన్స్‌కు కూడా ముంబై పోర్టు నుంచే రవాణా జరుగుతున్న నేపథ్యంలో అక్కడికే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పీడీఎస్‌ బియ్యం తరలుతోంది. విజయవాడ నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, నైజీరియా, టాంజానియా వంటి దేశాలకు రేషన్‌ బియ్యం తరలింపు జరగ్గా.. కొద్దిరోజులుగా ఆ రూటు మార్చారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తమ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడించిన తర్వాత ఫిలిప్పైన్స్‌కు అధికారికంగా ఎగుమతి చేస్తోంది. గతంలో మిల్లుల్లో ఆడించిన తర్వాత ఆ బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థకు అందించే ది. ప్రజలు ఈ బియ్యాన్ని 30 శాతం మించి తినడం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్కెట్‌లో సన్నబియ్యాన్ని కొనుగోలు చేసి కార్డుదారులకు అందిస్తోంది. ఇదే సమయంలో రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని మిల్లు ఆడించి ఫిలిప్పైన్స్‌కు ఎగుమతి చేస్తోంది. దీంతో తెలంగాణ నుంచి విజయవాడకు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా తగ్గిపోయింది. దీంతో ఇక్కడి రేషన్‌ మాఫియా సిండికేట్‌ ఫిలిప్పైన్స్‌లో బియ్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతో తమ రూటును టాంజానియా నుంచి ఫిలిప్పైన్స్‌కు మార్చింది. అక్కడకు ఎగుమతి చేసేందుకు మాస్టర్‌ ఆపరేటర్లతో సంప్రదింపులు జరిపింది. రేషన్‌ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయటంలో వీరిదే కీలకపాత్ర. ఆయా దేశాల్లో కొనుగోలు చేసే మాస్టర్‌ ట్రేడర్లతో వీరికి సంబంధాలు ఉంటాయి. ఫిలిప్పైన్స్‌లోని మాస్టర్‌ ట్రేడర్లతో ఒప్పందం చేసుకుని రేషన్‌ బియ్యాన్ని తరలించే ఏర్పాట్లు చేపట్టారు.


ప్రధానంగా రెండు మార్గాల్లో..

తెలంగాణ ప్రభుత్వం మార్కెట్‌ కంటే తక్కువ రేటుతోనే బియ్యం ఎగుమతి చేస్తోంది. ఆ రేటు కంటే కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా రేషన్‌ మాఫియా సిండికేట్‌ తక్కువ ధరకు అంతే నాణ్యమైన రేషన్‌ బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. దీంతో తక్కువ ధరకు వస్తుండటంతో సహజంగా ఫిలిప్పైన్స్‌లో మన రేషన్‌ బియ్యానికి మొగ్గు చూపుతున్నారు. ఎండీయూ ఆపరేటర్ల ద్వారా కొనుగోలు చేసిన బియ్యంలో సింహభాగం ముంబై పోర్టుకు తరలిస్తున్నారు. మిగిలిన వాటిని కాకినాడ పోర్టుకు తీసుకుపోతున్నారు. రూట్లు మార్చి, నిఘాను ఏమార్చి మరీ ఈ అక్రమ రవాణా సాగుతోంది. విజిలెన్స్‌ బృందాల నుంచి తప్పించుకోవటానికి ఉమ్మడి కృష్ణా జిల్లా రేషన్‌ మాఫియా బెజవాడ సిండికేట్‌కు రేషన్‌ బియ్యాన్ని తరలిస్తోంది. గతంలో మాదిరిగా గోడౌన్లలో నిల్వ ఉంచట్లేదు. డైరెక్టుగా చిన్న వ్యాన్లలో విజయవాడకు రవాణా చేసి, రోడ్డుపైనే ఆ వాహనాలను నిర్ణీత ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని తిరిగి అవే వాహనాలపై ముంబైకు తరలిస్తున్నారు. ఈ వాహనాలను ముంబై చేర్చేందుకు ప్రధానంగా రెండు మార్గాలు వినియోగిస్తున్నారు. ఎన్‌హెచ్‌-30 మీదుగా ఛత్తీ్‌సగఢ్‌కు రవాణా చేస్తున్నారు. నందిగామ-జగ్గయ్యపేట మార్గం నుంచి కూడా అడ్డదారిలో ఎన్‌హెచ్‌-30కు చేరుకునేలా రవాణా చేస్తున్నారు. సదాశివపేట మీదుగా నాగపూర్‌కు బియ్యాన్ని రవాణా చేశాక, అక్కడి నుంచి సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఆ వాహనాలు ముంబైకు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఫిలిప్పైన్స్‌కు నేరుగా ఓడల ద్వారా ఎగుమతి జరుగుతోంది. కాకినాడ పోర్టు నుంచి కూడా ఫిలిప్పైన్స్‌కు ఎగుమతి జరుగుతోంది. ఈ రూట్‌లో నిఘా ఎక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువగానే విజయవాడ నుంచి అక్రమ రవాణా జరుగుతోంది. చింతలపూడి మార్గం, గణపవరం, రావులపాలెం మీదుగా కాకినాడ పోర్టుకు రేషన్‌ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 05:29 AM