Share News

Citizenship Case: తండ్రి భారతీయుడు తల్లి పాకిస్థానీ

ABN , Publish Date - Apr 29 , 2025 | 06:10 AM

ధర్మవరంలో నివసిస్తున్న రంశా రఫీక్‌ పాకిస్థాన్‌ పౌరసత్వంతో 19 ఏళ్లుగా లాంగ్‌ టర్మ్‌ వీసాపై ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పౌరసత్వ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది.

Citizenship Case: తండ్రి భారతీయుడు తల్లి పాకిస్థానీ

  • 19 ఏళ్లుగా పాకిస్థాన్‌ పౌరసత్వంతోనే కూతురు

  • శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉంటున్న యువతి ఇప్పటికీ లాంగ్‌ టర్మ్‌ వీసానే

  • కేంద్రం వద్ద పౌరసత్వ దరఖాస్తు పెండింగ్‌

  • పహల్గాం ఘటన నేపథ్యంలో వెలుగులోకి..

ధర్మవరం రూరల్‌, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌ పౌరసత్వం ఉన్న ఓ యువతి 19 ఏళ్ల నుంచి శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉంటోంది. తండ్రి ఇండియన్‌, తల్లి పాకిస్థానీ కావడం, కార్గిల్‌ యుద్ధ సమయంలో తల్లి పాకిస్థాన్‌లో ప్రసవించడంతో ఆ యువతి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ధర్మవరం పట్టణంలోని చంద్రబాబునగర్‌కు చెందిన రఫీక్‌ అహ్మద్‌ ఆయుర్వేద వైద్య నిపుణుడు. బళ్లారికి చెందిన ఇతడి మేనమామ మహబూబ్‌ పీరాన్‌.. దేశ విభజన సమయంలో బళ్లారి నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. అహ్మద్‌ 1989లో మేనమామ కూతురు జీనత్‌ పీరాను వివాహం చేసుకున్నాడు. రఫీక్‌, జీనత్‌ దంపతులకు మొదట ఇక్కడే కుమారుడు జన్మించాడు. జీనత్‌ 1998లో రెండోసారి గర్భం దాల్చింది. ఆ సమయంలో తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చూసేందుకు జీనత్‌ కరాచీ వెళ్లింది. అదే సమయంలో కార్గిల్‌ యుద్ధం జరగడంతో ఆమె వెంటనే భారత్‌కు తిరిగిరాలేకపోయింది. ఈ క్రమంలో 1999లో కూతురు రంశా రఫీక్‌కు జన్మినిచ్చింది. 2005లో ఆమె తన కూతురిని తీసుకుని ధర్మవరంలో ఉన్న భర్త వద్దకు వచ్చింది. దాదాపు ఏడేళ్లపాటు అక్కడే ఉండటంతో రంశాకు పాకిస్థాన్‌ ప్రభుత్వం అక్కడి పౌరసత్వాన్ని ఇచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు రంశాకు తల్లిదండ్రులు లాంగ్‌ విజిట్‌ వీసా తీసుకున్నారు. ప్రస్తుతం రంశా రఫీక్‌ వయసు 26 ఏళ్లు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ధర్మవరంలో చదువుకుంది. ప్రస్తుతం అనంతపురంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఇప్పటికీ ఆమె పాకిస్థాన్‌ పౌరసత్వంతోనే ఉంటోంది. లాంగ్‌ విజిట్‌ వీసా 2029 వరకు ఉంది.


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్థాన్‌ పౌరుల వివరాలను సేకరిస్తున్న క్రమంలో రంశా పౌరసత్వం విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. రంశా రఫీక్‌కు లాంగ్‌టర్మ్‌ వీసా ఉందని, ఆ వీసా కింద దేశంలో ఉండవచ్చనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. కాగా, షెహనాబ్‌ అనే మరో పాకిస్థానీ కూడా ధర్మవరంలో ఉంటున్నారని, అతడి గురించి దర్యాప్తు చేస్తున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నిబంధనల మేరకే ఉంటోంది: రంశా తండ్రి

నా కూతురు పాకిస్థాన్‌లో పుట్టడంతో ఆ దేశ పౌరసత్వం వచ్చింది. లాంగ్‌ టర్మ్‌ వీసా ఉన్న పాకిస్థానీలు దేశంలో ఉండవచ్చన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే నా కూతురు దేశంలో ఉంటోంది. ఇక్కడికి వచ్చాక భారత పౌరసత్వం కోసం కేంద్ర హోం అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నాం. ఇంకా రాలేదు. ఈ విషయాన్ని జిల్లా పోలీసు అధికారులను కలిసి వివరించాం. నేను భారతీయుడ్ని. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

Updated Date - Apr 29 , 2025 | 06:11 AM