Visakhapatnam: నేడు అల్పపీడనం
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:21 AM
పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకుని బంగ్లాదేశ్‌లో శనివారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

రేపటి నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకుని బంగ్లాదేశ్‌లో శనివారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం అది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఉత్తర ఒడిశా దిశగా వెళ్లనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం కోస్తాలో అనేకచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
జంగమహేశ్వరపురంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, సౌరాష్ట్ర, ఉత్తర అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం కచ్, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీంతో అరేబియా సముద్రం నుంచి తేమగాలులు వస్తున్నందున ఆది లేదా సోమవారం నైరుతి రుతుపవనాలు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు.