PVN Madhav: బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:00 AM
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడెవరనే సందిగ్ధతకు తెర పడింది. పార్టీ శ్రేణులకు అధిష్ఠానం ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు పీవీఎన్ మాధవ్‌ను ఈ పదవి కోసం ఎంపిక చేసింది.

ఆయన పేరును ఖరారు చేసిన అధిష్ఠానం
దీంతో ఒకటే నామినేషన్ దాఖలు
నేడు అధికారిక ప్రకటన
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాంచందర్‌రావు
రాష్ట్ర బీజేపీ కొత్త సారథి మాధవ్
అమరావతి, విశాఖపట్నం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడెవరనే సందిగ్ధతకు తెర పడింది. పార్టీ శ్రేణులకు అధిష్ఠానం ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు పీవీఎన్ మాధవ్‌ను ఈ పదవి కోసం ఎంపిక చేసింది. అనేక మంది పెద్దలు పోటీ పడినా మాధవ్‌నే ఈ పదవి వరించింది. సుదీర్ఘకాలంగా ఆయన చేసిన సేవలను బీజేపీ అధిష్ఠానం గుర్తించి కీలకమైన బాధ్యతలు అప్పగించింది. దీంతో సోమవారం ఆయన విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఐదు సెట్ల నామినేషన్లు ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణకు సమర్పించారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి శివ ప్రకాశ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, బీజేపీ ఎమ్మెల్యేలు పార్థసారథి, విష్ణుకుమార్ రాజు, నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి, ఎన్. ఈశ్వర రావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో ఇతరులెవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో మాధ వ్ పేరు అధ్యక్షుడిగా ఖరారైంది. మంగళవారం కొత్త అధ్యక్షుడి పేరు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ మోహన్ తెలిపారు. విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే రాష్ట్ర బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరిని అధినాయకత్వం మార్చే అవకాశం ఉందని జనవరి నుంచే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎవరికి వారు తమకున్న పరిచయాలతో ఢిల్లీలో ప్రయత్నాలు చేశారు.అయితే సుదీర్ఘకాలంగా పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తున్న మాధవ్ వైపు అధిష్ఠానం మొగ్గు చూపింది.
మాధవ్ రాజకీయ ప్రస్థానం
విశాఖపట్నానికి చెందిన పాతతరం బీజేపీ నాయకుడు పీవీ చలపతి రావు కుమారుడు మాధవ్. చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. అదే వారసత్వాన్ని తన పనితీరు ద్వారా మాధవ్ అందిపుచ్చుకున్నారని మిత్రులు చెబుతున్నారు. చలపతిరావు దంపతులకు అనకాపల్లిలో 1973 ఆగస్టు 10న మాధవ్ జన్మించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ సంఘ్ పాఠశాలలో ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. విశాఖపట్నం వీఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం పూర్తిచేశారు. ఏఐసీడబ్ల్యుఏలో సీఏ చేసి, అక్కడే కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లమో చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు.
మాధవ్ విద్యార్థి దశలో ఏబీవీపీలో చేరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం)లో 2003లో చేరి క్రియాశీల రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. 2003 నుంచి 2007 వరకు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2007 నుంచి 2010 వరకు మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేశారు. 2010-2013 వరకూ బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా 2017లో పోటీ చేసి విజయం సాధించారు. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సేవలు అందించారు. మాధవ్‌కు మాతృభాషతోపాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో మంచి పట్టు ఉంది. విశాఖపట్నంలో బీజేపీ జాతీయ నాయకుల సమావేశాలు నిర్వహిస్తే వారి ప్రసంగాన్ని అనువదించే బాధ్యత ఆయనకే అప్పగిస్తారు. ప్రఽధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరుల ప్రసంగాలను అనువదించిన అనుభవం మాధవ్‌కు ఉంది.