IAS Officers Protest:మేం పనికిరామా?
ABN , Publish Date - Mar 17 , 2025 | 03:48 AM
ప్రమోటీలు అంటే.. రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందినవారు. ఫైళ్లను పరిష్కరించడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా పనిచేసిన అనుభవం వారికి బాగా ఉంటుంది.

పోస్టింగ్‌ల్లో వివక్షపై ‘ప్రమోటీ’ల ఆవేదన
కీలక బాధ్యతలన్నీ ఆర్‌ఆర్ కేడర్ ఐఏఎస్‌లకేనా ?
రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన అధికారులకు అన్యాయం
కార్పొరేషన్లు, పనిలేని విభాగాలకా?
కలెక్టర్, జేసీ పోస్టుల భర్తీలోనూ చిన్నచూపు
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్కరూ లేరు
గగ్గోలు పెడుతున్న ప్రమోటీ ఐఏఎస్‌లు
వేర్వేరుగా కొందరు అధికారుల భేటీలు.. చర్చ
సీఎంను కలిసి విన్నవించాలని ప్రయత్నాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో దాదాపు 70 శాతం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నేరుగా ఎంపికైన వారుంటే.. మరో 30 శాతం అధికారులు ప్రమోటీఐఏఎస్‌లు. ప్రమోటీలు అంటే.. రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందినవారు. ఫైళ్లను పరిష్కరించడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా పనిచేసిన అనుభవం వారికి బాగా ఉంటుంది. పనితీరు, సమర్థత ఆధారంగా ఐఏఎ్‌సలుగా వారికి పదోన్నతి కల్పిస్తారు. అయితే పోస్టింగ్‌ల విషయంలో తమను చిన్నచూపు చూస్తున్నారని ప్రమోటీ ఐఏఎ్‌సలు ఆవేదన చెందుతున్నారు. గత ఎనిమిది నెలలుగా ఇచ్చిన పోస్టింగ్‌ల్లో తమ కేడర్‌లో ఒకరిద్దరికి మినహా ఇతరులకు చెప్పుకోదగ్గ పోస్టింగ్‌లు రాలేదని, కీలకమైన పోస్టింగ్‌ల్లో ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయిందని తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అందరూ ఆర్‌ఆర్ బ్యాచ్ (డైరెక్ట్) ఐఏఎ్‌సలు ఉండటంతో తమను పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై ఇటీవల ప్రమోటీ ఐఏఎస్ అధికారులు కొందరు విడివిడిగా సమావేశమై చర్చించారు. ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయాలని భావిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒకరిద్దరు అధికారులను కలసి తమ గోడు చెప్పుకొందామని ప్రయత్నించినా వారి దర్శనం లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రమోటీ కేడర్ అధికారుల్లో నెలకొన్న ఆందోళన, సమావేశం గురించి నిఘా విభాగం సీఎంకు నివేదించినట్లు తెలిసింది.
గతానికి భిన్నంగా...
ప్రభుత్వంలో మొత్తం 400 మందికి పైగా అఖిల భారత సర్వీసు అధికారులు పనిచేస్తున్నారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇతర విభాగాల అధికారులున్నారు. ఐఏఎ్‌సలలో నేరుగా యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన ఆర్‌ఆర్‌బ్యాచ్ వారు, రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎ్‌సలుగా పదోన్నతి పొందిన అధికారులు ఉన్నారు. మొన్నటిదాకా ఈ రెండు కేటగిరీల అధికారులకూ సమబాధ్యతలు, పోస్టింగ్‌లు ఇచ్చేవారు. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ రెండు కేటగిరీల అధికారులకూ పోస్టింగ్‌లు ఉండేవి. జగన్ ప్రభుత్వంలోనూ ఇదే విధానం కొనసాగింది. అయితే కూటమి ప్రభుత్వంలో ప్రమోటీ ఐఏఎ్‌సలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని కార్యదర్శులు అందరూ ఆర్‌ఆర్ కోటా అధికారులే. అందులో ఒకరు ఐఏఎస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కూడా. తమ కేడర్ వారు ఎవరూ సీఎంఓలో కార్యదర్శిగా లేరన్న ఆందోళన ప్రమోటీ అధికారుల్లో నెలకొంది. సాధారణంగా ప్రమోటీ ఐఏఎ్‌సలకు క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం చాలా ఎక్కువ. రాష్ట్ర సర్వీస్ కింద గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులైన వీరు రెవెన్యూ డివిజన్‌లలో ఆర్‌డీఓలుగా, జిల్లా కేంద్రాల్లో డీఆర్‌ఓ, పీడీ డ్వామా, పీడీ డీఆర్‌డీఏ, ఇతర క్షేత్రస్థాయి ప్రభుత్వ వ్యవస్థల్లో సేవలందించి ఉంటారు. రాష్ట్ర, జిల్లా, మండల పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది. దీంతో ప్రతిభ ఆధారంగా ఐఏఎ్‌సలుగా పదోన్నతి కల్పించాక సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ పోస్టులలో నియమిస్తారు. ఆ తర్వాత శాఖల విభాగాఽధిపతులు, కార్యదర్శులుగా కీలక బాధ్యతలు అప్పగిస్తారు.
నేరుగా కీలక పోస్టింగ్‌లు...
యూపీఎస్సీ ద్వారా నేరుగా నియమితులయ్యే ఆర్‌ఆర్ అధికారులు మొదట సబ్‌కలెక్టర్‌గా పోస్టులు పొందుతారు. ఐఏఎ్‌సకు ఎంపికయ్యాక డీఓపీటీలో శిక్షణ పొంది నేరుగా రాష్ట్రాలకు వస్తారు. అప్పటి వరకు వారికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యల గురించి పెద్దగా తెలియదు. గ్రామీణ అసమానతలపైనా సరైన అవగాహన ఉండదు. ఎవరితో ఎలా వ్యవహరించాలి? కీలకమైన అం శాల్లో సంయమనంగా ఎలా ఉండాల్నో కొందరికి ఇప్పటికీ తెలియదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. ఫైబర్‌నెట్‌లో జరిగిన గొడవలే. ప్రభుత్వమే అధికారులకు రాష్ట్ర పరిస్థితులపై అవగాహన కల్పించాలి. అప్పటి వరకు వారికి క్షేత్రస్థాయి బాధ్యతలు అప్పగించాలి. ఆ తర్వాతే వారికి కీలక బాధ్యతలు అప్పగించాలి. అలా కాకుండా నేరుగా కీలక పోస్టుల్లో కూర్చోబెడితే పాలనా అనుభవం కన్నా సమస్యలే వస్తాయని అనేక అనుభవాలు చెబుతున్నాయి.
పోస్టింగ్‌ల్లో అసమానతలు
కొంతకాలంగా పోస్టింగ్‌ల విధానంలో తీవ్ర అసమానతలు, వ్యత్యాసా లు ఉంటున్నాయని ప్రమోటీ అధికారులు చెబుతున్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్(జేసీ) పోస్టులనే ఉదాహరణగా చూపిస్తున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా, కలెక్టర్లుగా 17 మంది ఆర్‌ఆర్ అధికారులను నియమిస్తే, ప్రమోటీ అధికారులకు కేవలం 9 మం దికే అవకాశం కల్పించారు. జేసీ పోస్టుల్లో 21 ఆర్‌ఆర్ కేడర్‌కు ఇస్తే, 5 మాత్రమే ప్రమోటీ అధికారులకు ఇచ్చారు. ప్రభుత్వంలో విభాగాధిపతులుగా అంటే ఆయా శాఖల డైరెక్టర్ లేదా కమిషనర్ పోస్టుల్లో 90 శాతం ఆర్‌ఆర్‌కే ఇచ్చారని ప్రమోటీ అధికారులు చెబుతున్నారు. పురపాలక శాఖలోని రెండు పోస్టులే తమ కేడర్ వారికి ఇచ్చారని, మిగిలిన కీలకమైన పోస్టులన్నీ వారికే అప్పగించారని, తమకు ఏమాత్రం ప్రాధా న్యం లేని పోస్టుల్లో పడేశారన్న ఆందోళన వారిలో నెలకొంది. ఆయా శాఖల్లోని కార్పొరేషన్‌లు, ఏమాత్రం పనిలేని విభాగాల డైరెక్టర్‌లుగా నియమించారని ఓ సీనియర్ ప్రమోటీ అధికారి వాపోయారు. ప్రభుత్వంలో ఇప్పటికీ అనేక కీలకమైన పోస్టులకు రెగ్యులర్ అధికారులు లేరు. ఆ పోస్టులకు ఆర్‌ఆర్ కేడర్ అధికారులనే ఎఫ్‌ఏసీ కింద ఇన్‌చార్జీలుగా నియమించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఓ సీనియర్ ప్రమోటీ అధికారిని కీలక శాఖ కమిషనర్ పోస్టు నుంచి బదిలీ చేసి ప్రాధాన్యం లేని మరో శాఖకు మార్చారు. దీంతో ఆయన తీవ్ర ఆవేదన చెంది నేరు గా సీఎంఓ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న తనను ఎలా మారుస్తారని, ఇది అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెగువ ఉన్నవారు తమ అన్యాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అత్యధికులు మౌనంగా ఉంటున్నారని ఆ కేడర్ అధికారులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రితో భేటీకి యత్నం
పోస్టింగ్‌లలో ఎదుర్కొంటున్న వివక్షపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ అంతరంగాన్ని తెలియజేయాలని ప్రమోటీ అధికారులు భావిస్తున్నారు. మొదట సీఎంకు లేఖ రాయాలని యోచిస్తున్నారు. ము ఖ్యమంత్రే పిలిచి మాట్లాడితే తామెదుర్కొంటున్న సమస్యలను ఆయన ముందు ఉంచాలని అధికారులు ఓ వినతిపత్రాన్ని సిద్ధం చేసినట్లు తెలిసింది. ‘మేం ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. మాకు జరుగుతున్న అన్యాయా న్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అందరినీ సమానంగా చూసే బాధ్యత సర్కారుదే. కాబట్టి, మా ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం’ అని ఓ సీనియర్ ప్రమోటీ అధికారి ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.